Spirituality: ఆ దేవాలయాల్లో మటన్, చికెన్ బిర్యానీ, చేపలు ప్రసాదాలు
గుడికి వెళ్లొచ్చినప్పుడు, పూజలు చేసేటప్పుడు, పండుగల సమయంలోనూ కొందరు మాంసాహారులు కూడా నాన్ వెజ్ మాటెత్తరు. దేవుడంటే భయమో-భక్తో నోరు కట్టేసుకుంటారు. మరి ఆలయంలో ప్రసాదంగా నాన్ వెజ్ పెడితే…
సాధారణంగా ఆలయంలో ప్రసాదంగా ఏమిస్తారు...లడ్డు, పులిహోర, చక్కెరపొంగలి, పరమాన్నం, దధ్యోజనం, కేసరి ఇలాంటివి ఇస్తుంటారు. కానీ కొన్ని ఆలయాల్లో మాత్రం మాంసాహారమే ప్రసాదం. అలాంటి ఆలయాలేంటో చూద్దాం...
మునియడికి చికెన్-మటన్ బిర్యాని (తమిళనాడు)
తమిళనాడు మధురైలో వడక్కంపట్టి అనే చిన్న గ్రామంలో ఉంది మునియడి ఆలయం. మునియడి అంటే శివుడిరూపంగా భావిస్తారు. ఇక్కడ ఏటా మూడు రోజుల పాటు ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదంగా అందిస్తారు. అల్పాహారంగా బిర్యాని తినేందుకు పోటీలుపడిమరీ వస్తారు భక్తులు..
విమలా దేవికి చేపలు, మటన్ (ఒడిశా)
పూరీ జగన్నాథుడి ఆలయ సముదాయంలో ఉంది విమలాదేవి ఆలయం. అత్యంత శక్తివంతమైన అమ్మావారిగా పూజలందుకునే విమలా దేవికి దుర్గాపూజ సమయంలో... పవిత్రమైన మార్కండ ఆలయ ట్యాంక్ నుంచి చేపలు పట్టి అక్కడే వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. జంతు బలి కూడా ఉంటుంది. జగన్నాథుని ఆలయ ప్రధాన తలుపులు తెరవకముందే ఇదంతా జరిగిపోతుంది.
Also Read: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
తార్కుల్హా దేవికి మటన్ (ఉత్తరప్రదేశ్)
గోరఖ్‌పూర్‌లో ఉన్న ఈ ఆలయంలో ఏటా ఖిచారి మేళా నిర్వహిస్తారు. చైత్ర నవరాత్రుల్లో ఈ ఆలయాన్ని భారీగా భక్తులు సందర్శిస్తారు. కోరిన కోర్కెలు నెరవేర్చాలంటూ మేకను బలిచ్చి ఆ మాంసాన్ని వండి నైవేద్యం పెడతారు. మట్టికుండల్లో మాత్రమే వండి నైవేద్యం అనంతరం అక్కడకు వచ్చిన భక్తులకు సమర్పిస్తారు.
ముత్తప్పన్ కు చేపలే నైవేద్యం ( కేరళ)
కేరళో కొలువై ఉన్న ముత్తప్పన్ ని మహావిష్ణువు అని కొందరు, శివుడిగా కొందరు భావిస్తారు. ఈ ఆలయంలో కల్లుతో పాటు కాల్చిన చేపలను నైవేద్యంగా పెట్టి...భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇలా చేస్తే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం.
కామాఖ్య దేవికి చేపలు మాంసమే నైవేద్యం ( అసోం)
అసోం నీలాచల్ కొండల్లో ఉన్న కామాఖ్యదేవి..భారతదేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. తాంత్రిక శక్తులను వశం చేసుకోవాలి అనుకునేవారు కామాఖ్య దేవిని పూజిస్తారు. ఇక్కడ శాఖాహారం, మాంసాహారంతో చేసిన రెండు రకాల ప్రసాదాలు ఉంటాయి. ఎందులోన ఉల్లి, వెల్లుల్లి మాత్రం వినియోగించకూడదు. మేక మాంసంతో పాటు చేపలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.కొన్నిసార్లు చేపలను చట్నీగా చేసి నైవేద్యం పెడతారు. భోగానని సమర్పించేటప్పుడు ఆలయ ప్రధాన తలుపులు మూసేస్తారు.
Also Read: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
కైల్‌ఘాట్ కాళీకి మాంసం నైవేద్యం ( పశ్చిమ బెంగాల్)
పశ్చిమ బెంగాల్ లో ఉన్న ఈ ఆలయం దేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి. 200 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో మేకను బలిస్తే కాళీ అమ్మవారి కరుణ ఉంటుందని భక్తుల విశ్వాసం.
దక్షిణేశ్వర్ కాళి కి చేపలు నైవేద్యం (పశ్చిమ బెంగాల్)
మనదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మరో శక్తిపీఠం పశ్చిమబెంగాల్ లో ఉన్న దక్షిణేశ్వర్ కాళి అమ్మవారు. ఈ ఆలయంలో కాళికా దేవికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత చేపలు నైవేద్యం పెడతారు. ఇక్కడ జంతుబలులపై నిషేధం ఉంది.
తారాపీత్ దుర్గాదేవికి మాంసాహారం (పశ్చిమ బెంగాల్)
పశ్చిమ బెంగాల్ లో నాన్ వెజ్ నైవేద్యంగా సమర్పించే మరో ఆలయం బీర్భూమ్‌లో ఉన్న తారాపీత్ దుర్గాదేవి ఆలయం. ఇక్కడ మాంసాహారంతో పాటూ మద్యాన్ని కూడా అమ్మకు నైవేద్యం పెడతారు. అదే ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు.