Shri Vitthal Rukmini Mandir Pandharpur : శ్రీ కృష్ణుడిని ఇటుకపై నిలబెట్టిన భక్తుడు..ఈ క్షేత్రంలో తొలి ఏకాదశిరోజు జరిగే ఉత్సవం చాలా ప్రత్యేకం!
Tholi Ekadashi: ఏటా తొలి ఏకాదశికి పండరీపురం క్షేత్రంలో జరిగే వార్కరీ ఉత్సవం చాలా ప్రత్యేకం. 250 కిలోమీటర్ల మేర భక్తులు పాదయాత్రగా తరలివస్తారు. 21 రోజులు కొనసాగే ఈ యాత్రనే మరాఠీలు వార్కరీ అంటారు.
Shri Vitthal Rukmini Mandir Pandharpur: తొలి ఏకాదశికి పండరీపుర క్షేత్రంలో ప్రతి సంవత్సరం వార్కరీ ఉత్సవం జరుగుతుంది. అళంది, దేహు క్షేత్రాల నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరం భక్తులు పాదయాత్రగా పండరీపురానికి తరలివస్తారు. 21 రోజులు కొనసాగే ఈ యాత్రనే వార్కరీ ఉత్సవం అని పిలుస్తారు. ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాలు, ఒడిశాలో పూరీ జగన్నాథుడి రథయాత్రలా...మరాఠీలకు వార్కరీ ఉత్సవం అలాంటిదే. వాస్తవానికి వార్కరీ ఉత్సవం మహారాష్ట్రలో కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రారంభమైన భక్తి ఉద్యమం. వారీ అంటే యాత్ర, కారీ యాత్రికులు..కాలినడకన బయలుదేరిన భక్తులు భక్తి పరమార్థాన్ని అందరకీ పంచడమే వార్కరీ...
Also Read: మొహర్రం రోజు ఏం చేస్తారు..ఈ పండుగ ప్రత్యేకత ఏంటి!
ఇటుకపై నిల్చున్న శ్రీ కృష్ణుడు
ప్రస్తుతం పండరీపురంలో కనిపించే విఠల్ రుక్మిణి దేవాలయ నిర్మాణానికి పుండరీకుడే ఆద్యుడని చెబుతారు. మరాఠీ, కన్నడ సాహిత్యాలలోనూ పుండరీకుడి ప్రస్తావన ఉంది. పుండరీకుడు శ్రీ కృష్ణుడి భక్తుడు. వృద్ధులైన తల్లిదండ్రుల సేవలో తరిస్తూ ఉండేవాడు. ఆ భక్తికి మెచ్చిన శ్రీ కృష్ణుడు ఓ సారి పుండరీకుడి ఇంటికివెళ్లి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్న పుండరీకుడు కాస్త సమయం కావాలని అడిగి తాను బయటకు వచ్చేవరకూ ఇదిగో ఈ ఇటుకపైనే నిలబడి ఉండు అని చెప్పి వెళ్లిపోయాడు. అలా పుండరీకుడు వచ్చేవరకూ కృష్ణుడు నడుముపై చేతులుపెట్టుకుని ఆ ఇటుకపైనే నిల్చుని ఉన్నాడు. అలా కన్నయ్యని చూసి రెప్పవేయలేకపోయిన పుండరీకుడు భక్తులకు ఇలాగే దర్శనమివ్వమని వరం కోరుకున్నాడు. అలా శ్రీ కృష్ణుడే విఠోబాగా పుండరీపురంలో వెలిశాడు. ఈ ఆలయాన్ని పుండరీకుడు కోరికమేరకు హోయసల సామ్రాజ్యానికి చెందిన విష్ణువర్ధనుడు నిర్మించాడు..ఈ మేరకు శాసనం కూడా ఉంది. పండరీపురంలో కృష్ణుడు, రుక్మిణికి వేర్వేరు ఆలయాలు కనిపిస్తాయి. ఓ ఆలయంలో బ్రాహ్మణులు పూజలు చేస్తే..మరో ఆలయంలో అన్ని కులాల వారూ నేరుగా పూజలు చేసే అవకాశం ఉంటుంది. వార్కరీ సంప్రదాయం అంటే ఇదే. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా భీమానది ఒడ్డున విఠలుడిగా వెలసిన శ్రీ కృష్ణుడిని మహారాష్ట్రతో పాటు.. కర్ణాటక, గోవా, తెలంగాణకు చెందిన భక్తులు ఆరాధిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో విఠలుడి ఆరాధన ఎక్కువ.
Also Read: తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి - ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!
తొలి ఏకాదశి రోజు 'వార్కరీ' ఉత్సవం ప్రత్యేకం
పండరీపురం విఠలుడి ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశి చాలా ప్రత్యేకం. ఏటా ఈ రోజు వార్కరీ ఉత్సవం జరుగుతుంది. క్రీ.శ 13వ శతాబ్ధానికి చెందిన జ్ఞానేశ్వర్ మహారాజ్ సమాధి క్షేత్రం అయిన అళంది నుంచి, క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందిన భక్త తుకారాం సమాధి ఉన్న దేహు నుంచి భక్తులు పాదయాత్రలు ప్రారంభిస్తారు. తొలి ఏకాదశికి 21 రోజుల ముందు మొదలయ్యే ఈ పాదయాత్ర 250 కిలోమీటర్లు సాగి..తొలి ఏకాదశికి పండరీపురం చేరుకుంటుంది. ఇందుల పాల్గొనే భక్తులు కఠిన నియమాలు పాటిస్తారు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు, బ్రహ్మచర్యం పాటిస్తారు. పాదరక్షలు కూడా ధరించరు. ప్రతి భక్తుడిలో శ్రీ కృష్ణుడే ఉన్నాడని భావిస్తూ పాటలు పాడుతూ, భజనలు చేస్తూ ముందుకు సాగుతారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి కూడా ఈ యాత్ర సాగుతుంది.
Also Read: తొలి ఏకాదశి శుభాకాంక్షలు..శ్రీ మహావిష్ణువు శ్లోకాలతో తెలియజేయండి!