Konark Sun Temple: వయసుకి తగిన పాఠాలు చెప్పే విశ్వవిద్యాలయం కోణార్క్, ఆలయంలో ఇవి మీరు గమనించారా!
కోణార్క్ కేవలం హిందూ దేవాలయం మాత్రమే అనుకుంటే పొరపాటే...వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విఙ్ఞానాన్ని అందించే ఆలయం ఇది. ఆ విశేషాలు మీకోసం
Secrets Behind Konark Sun Temple : పన్నెండేళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోణార్క్ దేవాలయం. సూర్యుడి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులు మాత్రమే కాదు ప్రపంచంలో ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన అద్భుతమైన విశ్వవిద్యాలయం. జీ20 సదస్సుకు వచ్చిన ప్రపంచ నేతలకు.. ప్రగతి మైదాన్ వేదికగా నూతనంగా నిర్మితమైన భారత్ మండపం వద్ద ప్రపంచ దేశాధినేతలందరితో కరచాలనం చేసి ఆప్యాయంగా స్వాగతించారు ప్రధాని మోదీ. ఈ సమయంలో కోణార్క్ చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయం విశిష్టత ఏంటి...అసలు ఈ పేరు ఎలా వచ్చింది. ఇక్కడకు వెళ్లినవారు ఏం నేర్చుకోవాలి?..
కోణార్క్ అనే పేరు ఎలా వచ్చింది
ఓ కథ ప్రకారం సూర్యడు... అర్కుడు అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాడు. అలాగే ఒడిశాలో ఉన్న ఐదు పుణ్య క్షేత్రాల కోణంలో సూర్యుడు వెలసిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి కోణార్క్ అనే పేరు వచ్చిందంటారు
శ్రీ కృష్ణుడి కొడుకు సాంబుడికి శాపం
మరోకథ ప్రకారం..శ్రీకృష్ణుడు, జాంబవతీ కుమారుడైన సాంబుడు చాలా అందగాడు. ఆ గర్వంతో సాంబుడు ఓసారి నారద మహర్షిని అవమానించాడు. సాంబుడి గర్వాన్ని అణిచేందుకు నారద మహర్షి ఒక ఉపాయం ఆలోచించాడు. ఓ సారి నారద మహర్షి సాంబుడిని అంతఃపురంలో ఆడవాళ్ళు స్నానం ఆచరించే ప్రదేశానికి తీసుకెళ్ళాడు. సాంబుడు అక్కడున్న ఆడవారితో తప్పుగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న కృష్ణుడు వెంటనే అక్కడికి చేరుకుని సాంబుడిని కుష్టి వాడై పొమ్మని శపించాడు. తప్పు తెలుసుకున్న సాంబుడు శాపవిమోచన మార్గం అడగగా కృష్ణుడు ప్రస్తుత కోణార్క్ సూర్య దేవాలయం ఉన్న ప్రాంతంలో సూర్యుడి గురించి తపస్సు చేయమని చెప్పాడు.
గాల్లో తేలే సూర్య భగవానుడు
తండ్రి శ్రీ కృష్ణుడి సూచన మేరకు సాంబుడు ఈ క్షేత్రంలో చంద్రభాగంలో ఉన్న నదిలో స్నానం ఆచరించి సూర్యుడి గురించి 12 ఏళ్లు తపస్సు చేసి శాపవిమోచనం పొందారు. అందుకు ప్రతిఫలంగా ఈ ఆలయం గర్భగుడి పైకప్పులో సుమారు 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని ఉంచి... మూల విరాట్ ను ఇనుముతో తయారు చేసి సూర్య భగవానుడిని గాలిలో తేలేలా ఏర్పాటు చేశారు. అప్పట్లో మన దేశానికి వచ్చిన కొందరు విదేశీ నావికులు ఈ ఆలయంలో ఉన్న అయస్కాంతం ప్రభావం వల్లనే సముద్రంలో ప్రయాణించే ఓడలు నావికా వ్యవస్థ పని చేయడం లేదని భావించిన వారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు చెబుతారు.
Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో సానుకూల మార్పులుంటాయి
వ్యక్తిగత జీవితంలో వివిధ దశలకు సరిపడా విజ్ఞానం
చిన్నారుల నుంచి యవ్వనంలో ఉండేవారికి, మలిసంధ్యలో ఉన్నవారికి ఇలా ఓ వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విఙ్ఞానాన్ని అందిస్తోంది కోణార్క్ ఆలయం.
పిల్లలకు ప్రత్యేకం
కోణార్క్ దేవాలయంలో గోడలపై నేలకు రెండు అడుగుల ఎత్తులో అంటే పిల్లలకు కనిపించే విధంగా ఉండే వివిధ రకాల జంతువులు, పక్షులు వాటి విన్యాసాలు కనిపిస్తాయి. బొమ్మలతో పాటూ వాటి ఆహారపు అలవాట్లు కూడా పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఈ బొమ్మలకు పై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం, కుస్తీ లాంటి విభిన్న రకాల కళలున్న శిల్పాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు చూపుతిప్పుకోనివ్వకుండా ఉంటాయి. ఇంకా... రాజకీయం, యుద్ధ కళలు, రాజ్య పాలన, శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు విద్యార్థుల మెదడుకి పదును పెడతాయి.
యవ్వన పాఠాలు
పిల్లల కోసం చెక్కిన బొమ్మలని దాటుకుని పైకి చూస్తే కామసూత్ర భంగిమలు యవ్వనంలో ఉండేవారికి పాఠాలు నేర్పిస్తాయి. హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియజేస్తాయి.
మలిసంధ్యలో ఉండేవారికి దేవతామూర్తుల దర్శనం
యవ్వనులకు పాఠాలు నేర్పించిన బొన్మల నుంచి మరింత పైకి చూస్తే దేవతా మూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. ఎలాంటి ఆకర్షణలకూ, మోహానికి లొంగిపోకుండా మనసును నిర్మలంగా ఉంచుకోగలిగితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడని చెప్పడమే వీటి పరమార్థం. అందుకే దేవతా విగ్రహాలను కామసూత్ర భంగిమలకు పైన చెక్కారు
Also Read: ఈ రాశివారు ఈరోజు ఏపని చేసినా విజయం సాధిస్తారు, సెప్టెంబరు 10 రాశిఫలాలు
అహంకారం వీడాలనే సందేశం
ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే, ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లు కనిపిస్తుంది. అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనం...ఏనుగు ధనానికి ప్రతీక... ఈ రెండూ మనిషికి ఉంటే పతనం తప్పదనేది ఈ శిల్పం సందేశం.
వీరత్వం-బలం
10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే అశ్వాలు వీరత్వానికీ, బలానికీ ప్రతీకలుగా చెబుతారు
సమయాన్ని సూచించే చక్రాలు
ప్రత్యేక రథంలా ఉండే ఈ ఆలయానికి ఉన్న 24 చక్రాలు అందంకోసం చెక్కలేదు. వీటి వెనుక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయి. రథాన్ని లాగుతున్నట్టు రూపొందించిన ఏడు గుర్రాలు ఏడు రోజులకు, సూర్య రశ్మిలో రంగులకు ప్రతీక అంటారు. 1884 సంవత్సరంలో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చారు. ఈ ఆలయానికి ఇరువైపులా 12 చక్రాల వరుస ఉంది. ఈ 24 చక్రాలు గంటలను సూచిస్తాయని చెబుతారు. 10 రూపాయల నోటులో కనిపించే చక్రం ఇదే. ఒడిశాలో పూరీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ దేవాలయాన్ని గంగా వంశానికి చెందిన నర్సింహదేవ (1236-1264) నిర్మించారు.