Pandharpur Wari Palki Yatra 2025 : 20 రోజులు 250 కిలోమీటర్లు.. కేవలం విఠల్ పై భక్తితో మాత్రమే సాగే తీర్థయాత్ర ఇది!
Pandharpur Wari Palkhi 2025 : పండరీపుర యాత్ర అంటే మహారాష్ట్రలో పండర్‌పూర్‌కు వార్కారీలు చేసే వార్షిక తీర్థయాత్ర. ఇప్పటికే ప్రారంభమైన ఈ యాత్ర ఎప్పుడు ముగుస్తుంది? విశిష్ఠత ఏంటి ? తెలుసుకుందాం

Pandharpur Wari 2025 : పండరీపుర యాత్ర.. ఏటా మహారాష్ట్ర నుంచి వేలాది భక్తులు కాలినడకన చేసే ఆధ్యాత్మిక యాత్ర. శ్రీ మహావిష్ణువు రూపం అయిన విఠల్ పై ఉండే భక్తికి నిదర్శనం ఈ యాత్ర. ఇది కేవలం ఆధ్యాత్మిక సంప్రదాయం కాదు భక్తుల భావోద్వేగం.
ఏటా జేష్ఠమాసంలో వచ్చే బహుళ సప్తమికి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆషాఢమాస శుద్ధ ఏకాదశి రోజు పండరీపూర్ లో ముగుస్తుంది. అంటే 20 రోజుల పాటు 250 కిలోమీటర్లు సాగే యాత్ర ఇది. దారిపొడవునా భక్తిపాటలు, భజనలు, కీర్తలనలో పాండురంగడుని ఆరాధిస్తారు. మహారాష్ట్రలో జరిగే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక యాత్ర ఇది
ఈ ఏడాది జూన్ 18 న ప్రారంభమైన పండరీపుర యాత్ర జూలై 5న పండరీపూర్ చేరుకుని జూలై 06 తొలి ఏకాదశి రోజు స్వామిని దర్శించుకుంటారు.
సాధువులు తుకారాం మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్ ల నివాస ప్రదేశాలైన దేహు, అలంది పట్టణాల నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
రెండు పల్లకీలు ప్రధానమైనవి
1. దేహు నుంచి తుకారాం మహారాజ్ పాల్కీ
2. అలండి నుంచి జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్కి
ఈ ఊరేగింపులో భాగంగా తుకారాం మహారాజ్, సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాదుకలను పల్లకిలో ఊరేగింపుగా పండరీపూర్ తీసుకెళ్తారు. ఇది వారి శాశ్వతమైన ఆధ్యాత్మిక ఉనికిని సూచిస్తుంది.
తుకారాం మహారాజ్ పాల్కీ 2025 మార్గం
జూన్ 18 న దేహు నుంచి బయలుదేరి, ఆషాఢ ఏకాదశికి ఓ రోజు ముందు అయిన జూలై 5న పండరీపూర్ చేరుకుంటుంది. జూలై 6 ఆషాఢ ఏకాదశి రోజు విఠల్ భగవాన్, రుక్మిణిదేవి దర్శనం చేసుకుంటారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో కులమతాలకు అతీతంగా అంతా పాల్గొంటారు.
తుకారాం మహారాజ్ 5 బోధనలు
భక్తి అనేది అత్యున్నత మార్గం
ఆధ్యాత్మిక సంతృప్తిని పొందడానికి విఠల్ భగవానుడి పట్ల స్వచ్ఛమైన భక్తి అత్యంత అర్థవంతమైన మార్గమని తుకారాం చెప్పారు. ఆచారాలు, కులం కన్నా హృదయాన్ని ప్రేమపూర్వకంగా భగవంతుడికి అర్పించడమే ముఖ్యమైనది
సమానత్వం
కులవివక్ష తగదు..ఎందుకంటే దేవుడి దృష్టిలో అన్ని జీవులు సమానమే అనే ఆలోచనను ఆయన సమర్థించారు. అందుకే అన్ని వర్గాల ప్రజలను భక్తిగానంలో చేరాలని పిలుపునిచ్చారు
జీవితంలో సరళత
తుకారాం మహారాజ్ సరళమైన జీవితాన్ని గడిపారు , భౌతిక సంపదలపై ఆశను వీడాలని బోధించారు. ప్రజలు తమ వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందాలని , కృతజ్ఞతతో జీవించాలని చెప్పారు
కీర్తనలు
కీర్తనల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యాప్తి చేసేందుకు కృషి చేశారు. సంక్లిష్టమైన తత్వాలను సామాన్య ప్రజలకు వారి భాషలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా సామూహిక భక్తి , ఐక్యతను పెంపొందించారు
భగవంతుడి చిత్తానికి లొంగిపోండి
ప్రతిదీ భగవంతుని చిత్తం ప్రకారమే జరుగుతుందని తుకారాం మహారాజ్ బోధించారు. అందుకే భగవంతుడి చిత్తానికి తలొంచినవారికి ఎలాంటి కష్టమూ రాదని బోధించారు.
సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్కీ 2025 మార్గం
ఈ పాల్కి జూన్ 19, 2025న అలండి నుంచి బయలుదేరింది.. తుకారాం మహారాజ్ ఊరేగింపుతో పాటు జూలై 5న పండర్‌పూర్ చేరుకుంటుంది.13వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త అయిన జ్ఞానేశ్వర్.. భగవద్గీతపై మరాఠీ వ్యాఖ్యానం అయిన 'జ్ఞానేశ్వరి' ద్వారా ప్రసిద్ధి చెందారు.
విఠల్ నామ జపంతో మార్గం 250 కిలోమీటర్ల మార్గం మొత్తం మారుమోగిపోతుంది. ధనిక, పేద,చిన్నా, పెద్దా, మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం లేకుండా అంతా కలసి పాల్గొనే యాత్ర ఇది. కేవలం భక్తి యాత్ర మాత్రమే కాదు మార్గమధ్యలో దానధర్మాలు చేస్తారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచంలో అతిపెద్ద పురాతన ఉద్యమాల్లో ఇదొకటి.






















