Medaram Jatara: నేటి నుంచి మేడారం జాతర ప్రారంభం - మహబూబాబాద్ నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు
Medaram Jatara: మేడారం జాతర ఇవాళ్టి (ఫిబ్రవరి 21) నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. అంటే ఫిబ్రవరి 25 వరకు జాతరకు భక్తకోటి తరలిరానుంది.
Sammakka Saralamma Jatara: ఆసియాలోనే అతిపెద్దదైన వనజాతర నేటి నుంచి ప్రారంభంకానుంది. గిరిజనుల ఆరధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఊళ్లకు ఊళ్లే కదిలి వెళ్తున్నాయి. రెండేళ్లకోసారి జరిగే జాతర చూసి వనదేవతలను పూజించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు జనం వనం బాట పట్టారు. తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కదలి వస్తున్న భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కుంభమేళాను తలపిస్తున్నాయి.
నాలుగు రోజుల జాతర
మేడారం జాతర ఇవాళ్టి (ఫిబ్రవరి 21) నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. అంటే ఫిబ్రవరి 25 వరకు జాతరకు భక్తకోటి తరలిరానుంది. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం, అధికారులు ఏర్పాట్లు చేశారు. జాతర ప్రారంభానికి వారం పదిరోజుల ముందు నుంచే భక్తులు మేడారం తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో ఇప్పటికే అడవంతా జనంతో నిండిపోయింది.
Also Read: నాలుగు రోజుల జాతరలో ఏ రోజు ఏం చేస్తారు - మూడోరోజు ఎందుకు ప్రత్యేకం!
భరిణి రూపంలో వనదేవత
ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలో ఉందీ మేడారం. ఇది ఒక గిరిజన గ్రామం. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టనట్టు చూపించే వనజాతరే ఈ మేడారం జాతర. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు ఉండవు. చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను కుంకుమ భరిణి రూపంలో తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఈ గిరిజన దేవలతకు మొక్కులు తీర్చడానికి బెల్లాన్ని సమర్పిస్తారు. దీన్ని బంగారంగా భావిస్తారు.
Also Read: నిరాడంబరంగా ఉండే సమ్మక్క సారలమ్మ ల గద్దెలు కాలక్రమేణా ఇలా మారాయ్!
ప్రక్రియ మంగళవారమే ప్రారంభం
మేడారం జాతర మహత్తర ఘట్టం మంగళవారమే ప్రారంభమైంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులు, పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. పగిడిద్దరాజును పడగ రూపంలో పట్టుకొని మేడారానికి బయల్దేరారు. మహబూబాబాద్ నుంచి 70 కిలోమీటర్ల పయనం తర్వాత ఈ సాయంత్రానికి జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు. అక్కడ కొక్కెర వంశీయులు వారికి స్వాగతం పలుకుతారు. పగిడిద్దరాజుకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రతిగా సమ్మక్కకు పెనుక వంశీయులు చీర, పసుపు, కుంకుమ పెడతారు. రాత్రి 9 గంటలకు పగిడిద్దరాజు సారలమ్మ, గోవిందరాజుతో కలిసి గద్దెలపై కొలువుదీరుతారు.
Also Read: అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం - భక్తజన వనసంబురం మేడారం గురించి ఈ విషయాలు తెలుసా!
110 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
వనం నుంచి దేవతల రాకతో ప్రారంభమయ్యే ఈ జాతర వన ప్రవేశంతో ముగుస్తుంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను జాతరను జరుపుకుంటారు. దీనిని 2014 నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఈ మహా జాతర కోసం 110 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
Also Read: మేడారంలో హెలికాప్టర్ సేవలు రెడీ, రెండు రకాల ప్యాకేజ్‌లు - ఇలా బుక్ చేసుకోవచ్చు
నాలుగు రోజులపాటు ఏం జరగనుందంటే...
- మంగళవారం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చారు.
- పగిడిద్దరాజు, సాలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్టించడం ఈ జాతరలో మొదటి ప్రక్రియ
-బుధవారం ఉదయం కొండాయి గుడి నుంచి గోవిందరాజును గద్దె వద్దకు తీసుకొస్తారు.
- సాయంత్రానికి సారలమన్నను కూడా కోలాహలంగా గద్దెపైకి తీసుకొస్తారు.
- రెండో రోజు చిలకలగుట్టపై ప్రత్యేక పూజలు చేస్తారు.
-అనంతరం ఊరేగింపుగా గద్దెల వద్ద సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు.
-మూడో రోజు గద్దెపై ఉన్న వనదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు.
-ఆఖరి రోజు నాల్గో రోజు సమ్మక్క సారలమ్మను వన ప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది.
ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
అటవీ ప్రాంతంలో జాతర కావడంతో భక్తులకు ఎలాంటి ప్రయాణ అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు వేసింది. రక్షణ పరంగా కూడా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 14 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ సిసి కమెరాలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తోంది. పుణ్య స్నానాలు చేసే జంపన్నవాగు వద్ద కూడా సౌకర్యాలు కల్పించింది. జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకోవడం, ప్రసాదం స్వీకరించే వెసులుబాటు కూడా ఆర్టీసీ తీసుకొచ్చింది.
23న రానున్న రాష్ట్రపతి
జాతర తిలకించేందుకు ఫిబ్రవరి 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా రానున్నారు. వీరితోపాటు మంత్రులు, ఇతర నేతలు వనదేవతలకు పూజలు చేయనున్నారు. మంత్రి సీతక్క జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.