Margasira Lakshmi Pooja Katha in Telugu : మార్గశిర గురువారం వ్రతంలో భాగంగా తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇదే!
Margasira Guruvaram Dates 2024: డిసెంబరు 5 మార్గశిరమాసం మొదటిగురువారం వచ్చింది. ఈ రోజు మార్గశిర లక్ష్మివార వ్రతం ఆచరించేవారు పూజ పూర్తైన తర్వాత చదువుకోవాల్సిన కథ ఇదే...
Margasira Guruvaram Vrath Kadha in Telugu: మార్గశిర గురువారం లక్ష్మీపూజ పూర్తైన తర్వాత..వ్రతకథ చెప్పుకుని అక్షతలు అమ్మవారిపై కొన్ని వేసి..మీపై వేసుకోవాలి. ఈ వ్రతం గురించి పరాశర మహర్షి నారదుడికి వివరించారు.
Also Read: మార్గశిర లక్ష్మీవార వ్రతం - మొదటి గురువారం పూజా విధానం, నైవేద్యం!
మార్గశిర లక్ష్మివార వ్రత కధ:
పూర్వం కళింగ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి. అందుకోసం బెల్లం ఇచ్చేది. ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీపూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు, పూలతో పూజచేసి..తనకి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది. కొన్నాళ్లకి సుశీలకు పెళ్లి జరిగింది. తనతో పాటూ లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టింటినుంచి తీుసుకెళ్లింది సుశీల. అప్పటినుంచి మెట్టినిల్లు వృద్ధి చెందింది కానీ పుట్టినిల్లు పూర్తిగా దారిద్ర్యంలో మునిగిపోయంది. విధిలేక సవతి తల్లి తన కుమారుడిని సుశీల ఇంటికి పంపించి ఏమైనా తీసుకురమ్మని చెప్పింది.
పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల..సోదరుడు వచ్చిన ప్రతిసారీ బోలెడు వరహాలు ఇచ్చి పంపించేది. ఓసారి వెదురుకర్రలో పెట్టి వరహాలు ఇచ్చింది, మరోసారి మూటకట్టి..ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దానిలోపల గుజ్జు తీసేసి వరహాలు నింపి పంపించింది. అయితే ప్రతిసారీ మార్గమధ్యలో సేదతీరుతున్న సమయంలోనో, చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లే సమయంలోనూ ఆ ధనాన్ని పోగొట్టుకుని ఇంటికి చేరుకునేవాడు సుశీల సోదరుడు. ఈ పరిస్థితిలో మార్పు రాదేమో అని బాధపడిన సవతి తల్లి స్వయంగా కూతురి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. మార్గశిర గురువారం నోము నోచుకుంటే దారిద్ర్యం తీరిపోతుందని ఆమెకు చెప్పిన సుశీల..విధిగా నోమునోచుకుందాం అంది. పాటించాల్సిన నియమాలన్నీ చెప్పుకొచ్చింది..అన్నిటికీ సరే అందామె.
Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!
తెల్లవారేసరికి పిల్లలకు చద్దన్న పెడుతూ నోటిలో ఓ ముద్ద వేసుకుంది..ఆ వారం నోము నోచుకునే అదృష్టానికి దూరమైంది.
రెండోవారం పిల్లల తలకు నూనె రాస్తూ ఆ చేతిని రాసుకుంది...రెండో వారం నోము నోచుకునే అవకాశం లేకుండాపోయింది.
మూడోవారం ఏదో ఆటంకం వచ్చి వ్రతం చేసుకునే అవకాశం రాలేదు. మూడువారాలు కుమార్తె మాత్రమే నోము నోచుకుంది. ఇక నాలుగోవారం స్వయంగా రంగంలోకి దిగిన సుశీల..సవతి తల్లి ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకుని దగ్గరుండి లక్ష్మివారం వ్రతం పూర్తిచేయించింది. అయినప్పటికీ లక్ష్మీ కటాక్షం సిద్ధించలేదు.
అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించిన సుశీల..ఏం జరిగింది? నోము నోచినా కానీ కటాక్షం సిద్ధించలేదని బాధపడింది. అప్పుడు లక్ష్మీదేవి వాక్కులు వినిపించాయి. నీ చిన్నప్పుడు నా బొమ్మలతో ఆడుకుంటున్న సమయంలో నీ సవతి తల్లి చీపురుతో కొట్టింది. లక్ష్మీసమానురాలైన ఆడపిల్లను..లక్ష్మీరూపంగా భావించే చీపురుతో కొట్టడం వల్ల ఆ ఇంట సంపదలేదని చెప్పింది. క్షమించమని ప్రార్థించిన సుశీల.. మరోసారి తల్లితో భక్తిశ్రద్ధలతో వ్రతం చేయించింది. అప్పుడు ఆ ఇంట దారిద్ర్యం తీరిపోయి సిరిసంపదలు కలిగాయి.
కధలోపమైనా వ్రత లోపం కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!
నోట్: పండితుల నుంచి , కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...