Janmashtami 2025: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో!
Lord krishna: రెండున్నర వేల సంవత్సరాలకు ముందే ఇండియాలో కృష్ణుడి ఆరాధన.. చారిత్రక ఆధారాలు ఇవిగో..

Krishna: భారతదేశంలోని అతి ముఖ్యమైన దైవాల్లో శ్రీ కృష్ణుడు అగ్రస్థానంలో ఉంటాడు. హైందవంలో త్రిమూర్తులతో పాటు కీలకమైన దేవుడిగా చాలాసార్లు మహావిష్ణువు అవతారంగా కనిపించే కృష్ణుడు భాగవతంలో మాత్రం తానే దేవదేవుడుగా కనిపిస్తాడు. భారతదేశం మొత్తం మీద రాముడు లేదా కృష్ణుడు గుడి లేని గ్రామం కనిపించదు. మహాభారతం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఆయన బోధించినట్టుగా చెప్పే భగవద్గీత ఈరోజు కార్పొరేట్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ సబ్జెక్టుగా మారిపోయింది. అయితే ఇంతకు భారతదేశంలో కృష్ణుడు ఆరాధన ఎప్పుడు మొదలైంది? దానికున్న అతి ముఖ్యమైన చారిత్రక ఆధారాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.

(టిక్ల రాక్ పెయింటింగ్స్ 300-200BCE (మధ్య ప్రదేశ్ ) సంకర్షణుడు, వాసుదేవ, ఏకనాంశ)
వాసుదేవుడి ఆరాధన కృష్ణుడి పూజ గా మారిందా?
మొదట్లో మధుర ప్రాంతంలో ఉండే వృష్ణ తెగలో " వాసుదేవ" ఆరాధన ఉండేది. తర్వాత వారే ద్వారకా ప్రాంతానికి వలస వెళ్లారు. అప్పటికే అక్కడ స్థిరపడిన యాదవ తెగ అదే దేవుడ్ని "కృష్ణ " పేరుతో పూజించే వారు. 500BCE నాటికి వాసుదేవుడి ఆరాధన కృష్ణుడి పూజ ఒకటిగా కలిసి పోయాయి. చారిత్రికంగా మొదటిసారిగా అదే కాలానికి చెందిన వ్యాకరణ పండితుడు 'పాణిని' వాసుదేవ ఆరాధన గురించి రాసాడు.

(గ్రీకో-బాక్ట్రియన్ కింగ్ Agathocles of Bactria (190-180 BCE ) ముద్రించిన సంకర్షుణుడు, వాసుదేవ నాణాలు)
ఆఫ్ఘనిస్తాన్ -కజికిస్తాన్-తుర్కమెనిస్థాన్ ప్రాంతాల్లోనూ దొరికిన కృష్ణుడి నాణాలు
మొట్టమొదటిసారిగా నాణెలపై కృష్ణుడు బొమ్మ ముద్రించింది మాత్రం గ్రీకో-బాక్ట్రీయన్ రాజులు. అలెగ్జాండర్ సామ్రాజ్యం నుంచి విడిపోయిన తర్వాత వీళ్ళు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్,కజికిస్తాన్,తుర్కమెనిస్థాన్ల నుండి ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతాల వరకూ 256 BC నుండి 120 BC వరకూ పాలించారు. ఆ సమయంలో కృష్ణుడి ఆరాధన గ్రీక్ రాజ్యాలకు చేరుకుంది. గ్రీకో- బాక్ట్రియన్ రాజు ఆగథోక్లస్ (190-180BCE) Agathocles I Dicaeus తొలిసారి తన నాణాలపై కృష్ణుడు బొమ్మ ముద్రించాడు. ఈ నాణాలు ప్రస్తుత ఆఫఘనిస్తాన్ ప్రాంతం లో దొరికాయి. శివ కృష్ణుడు ఆ నాణెం పై వాసుదేవ-కృష్ణ ముద్ర చక్రాన్ని ధరించిన దేవుడి రూపంలో ముద్రించబడి ఉంది.

కృష్ణుడి కోసం గ్రీకులు స్థాపించిన వాసుదేవ స్థంభం -"హెలిడోరస్ పిల్లర్"
200 BCE నుండి 10AD వరకూ ప్రస్తుత పాకిస్థాన్ సహా పంజాబ్ లాంటి పశ్చిమ భారత ప్రాంతాల్ని పాలించిన మరో గ్రీక్ రాజ్యం ఇండో -గ్రీకులు. వీళ్ళ రాజు ఆంటీయల్సిడాస్ (Antialcidas ) 115-95 BCE మధ్య కాలం లో శుంగ వంశ చక్రవర్తి భగభద్ర ( 114-83 BCE ) వద్దకు తన రాయబారి హెలిడోరస్ ను పంపాడు. అతను ప్రస్తుత మధ్యప్రదేశ్ లోని 'విదీశా' సమీపంలో "దేవ దేవుడైన వాసుదేవుడ్ని " కీర్తిస్తూ ఒక స్తంభాన్ని చెక్కించాడు. అయితే తర్వాత కాలంలో ఇది మరుగున పడిపోయింది. 1877లో ఈ పిల్లర్ ను బ్రిటీష్ అధికారి అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ కనుగొన్నాడు. ఈ పిల్లర్ కు అతి దగ్గరలో సాంచి స్తూపం ఉండడం తో మొదట్లో బౌద్ధ స్టూపం గా భావించారు. కానీ స్పష్టంగా ఈ స్తంభం పై "వాసుదేవ" అని ఉండడం తో బౌద్ధం బలంగా ఉన్న సమయంలోనే వైష్ణవం లేదా కృష్ణుడి ఆరాధన కూడా ఆ ప్రాంతాల్లో బలంగా ఉన్నట్టు ధ్రువీకరణ జరిగింది. అంతేకాదు ఈ పిల్లర్ చుట్టూ ఒక భారీ వాసుదేవాలయం శిదిలాలు ఉన్నట్టు కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే మధ్య ప్రదేశ్ లోని "టిక్ల" ప్రాంతం లో 300-200BCE మధ్య గీసిన కొన్ని రాక్ పెయింటింగ్స్ కూడా గుర్తించారు. వీటిలో వాసుదేవ (కృష్ణ), సంకర్షణ (బాలరాముడి) తోపాటు అంతగా తెలియని ఏకనాంశ అనే దేవత బొమ్మలు ముద్రించి ఉన్నాయి.దానితో భారతదేశం లో కనీసం రెండున్నర వేల సంవత్సరాల నుండే వాసుదేవ/కృష్ణ ఆరాధన ఉందని చరిత్ర కారులు ధ్రువీకరించారు.






















