India to be renamed 'Bharat': 'భారత్' అనే పేరు ఎలా వచ్చింది - మన దేశానికి అసలు పేరు ఏంటి!
మనదేశానికి 'భారత్' అనే పేరు ఎలా వచ్చింది , మొదట్లో మన దేశాన్ని ఏ పేరుతో పిలిచేవారు...ఎన్నో పేర్లున్నా భారత్ అనే పేరు ఎలా ప్రాచుర్యం పొందింది....
India to be renamed 'Bharat': ఇప్పటి వరకూ నగరాల పేర్లు, జిల్లాల పేర్లు మారాయి..తొలిసారిగా మన దేశం పేరు మారుతోంది. ఇప్పటి వరకూ మన దేశాన్ని ఇండియా అని కూడా పిలిచేవాళ్లం. కానీ ఇకపై భారత్ అని మాత్రమే పిలవాలంటోంది కేంద్ర ప్రభుత్వం. అసలు భారత్ అనే పేరు ఎప్పుడు మొదలైంది. పురాణాల్లో భారత్ గురించి ఏముంది.
సంకల్పం చెప్పేటప్పుడు
“జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోఃదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య, ఆగ్నేయ ప్రదేశే అని ఆయా ప్రాంతాల ఉనికిలో భాగంగా ‘కృష్ణాగోదావరీ మధ్య దేశే’ అని కలిపి చెబుతారు. కొన్ని ప్రాంతాలవారు ‘శ్రీ కృష్ణాకావేరియోః మధ్య ప్రదేశే అని సంకల్పంలో చెబుతారు. జంబూద్వీపం అనేది కేవలం భారత ఉపఖండం మాత్రమే కాదు. జంబూద్వీపంలో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబూద్వీపాన్ని 9 భౌగోళిక ప్రాంతాలుగా విభజించారు. వాటిలో భరతవర్షం ఒకటి. ఇది మొత్తము 9 ద్వీపాల సముదాయం. స్పష్టంగా చెప్పాలంటే భారత్ అనే పేరు వేదకాలం నుంచే వాడుకలో ఉంది.
Also Read: బీజేపీ అధికారంలోకి వచ్చాక మారిన నగరాలు, ప్రదేశాల పేర్లు- యూపీలోనే 40కిపైగా మార్పులు
ఎన్నో పేర్లున్నా భారత్ ప్రత్యేకం
మన దేశానికి ఎన్నో పేర్లున్నాయి. జంబూద్వీపం, భరత ఖండం, అజనాభవర్ష్, హిమవర్షం, భారతవర్ష్, ఆర్యవర్ష్, హిందూ, హిందుస్థాన్, ఇండియా... ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. వీటిలో కొన్ని శ్లోకాల్లో ప్రస్తావించారు. అయితే ఎక్కువగా వాడుకలో ఉన్నది మాత్రం భారత్ అనే పేరే. మనదేశంలో ఉన్న వైవిధ్య సంస్కృతుల్లాగే వివిధ కాలాల్లో రకరకాల పేర్లు వచ్చాయి. ఒక్కోసారి భౌగోళికంగా, మరోసారి జాతి స్ఫూర్తితో, ఇంకోసారి ఆచార వ్యవహారాల వల్ల కూడా హిందూ, హిందుస్థాన్, ఇండియా లాంటి పేర్లు భౌగోళికంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇండియా, హిందుస్తాన్ పేర్లు రావడానికి మూలం సింధు నది.
భరతుడి పేరుతో భారత్
భరతుడు పాలించడం వల్ల భారతదేశం అనే పేరు వచ్చిందంటారు పండితులు. భరతుడు అంటే దశరథుడి తనయుడు, శ్రీరాముడి సోదరుడు కాదు. శకుంతల-దుష్యంతుల పుత్రుడు భరతుడు. భరతుడి పేరుమీదే భారత్ గా మారిందని ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. భరతుడు అనే చక్రవర్తి నలువైపులా ఉన్న భూభాగాన్ని సొంతం చేసుకుని సువిశాల సామ్రాజ్యం స్థాపించాడు. ఆయన రాజ్యానికి భారతవర్ష్ అనే పేరు వచ్చింది.
భారత్ పేరు వెనుక కథలెన్నో
మత్స్యపురాణంలో భారత్ ప్రస్తావన ఉందని చెబుతారు. జైన సంప్రదాయ సూత్రాలు కూడా భారత్ పేరులో కనిపిస్తాయి. భగవాన్ రుషభదేవ్ పెద్ద కొడుకు మహాయోగి భరత్ పేరుమీదే ఈ దేశానికి భారతవర్ష్ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. సంస్కృతంలో వర్ష్ అంటే ప్రాంతం అనే అర్థం ఉంది. అందుకే భారత్ అనే పేరు ఒక నిర్దిష్ట వ్యక్తి నుంచి కాకుండా, ఆ జాతి సమూహాల పేరున ప్రాచుర్యం పొందిందనే వాదన కూడా ఉంది.
Also Read: బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ ట్వీట్, తప్పులో కాలేయడం అలవాటేనంటూ నడ్డా ఫైర్
మహా'భారత్'
దాదాపు 2500 ఏళ్ల క్రితం మహాభారత సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో భారత భౌగోళిక సరిహద్దులో ఉన్న అన్ని సామ్రాజ్యాలూ పాల్గొన్నాయి. అందుకే దానిని మహాభారత్ అన్నారు.
హింద్, హిందుస్తాన్
హిందూకుష్ అవతల ఉన్న ఆర్యులు వారి సమాజాన్ని ఇరాన్ అన్నారు. తూర్పున ఉన్న సమాజాలను ఆర్యావర్తులు అన్నారు. ఈ రెండు సమూహాలూ చాలా గొప్పవి. హిందుకుష్ మాట క్రీస్తు పూర్వం 2 వేల ఏళ్ల క్రితమే అక్కాదీ నాగరికతలో ఉంది. అక్కద్, సుమేర్, ఈజిప్షియన్... అన్నిటితో భారత్‌కు బంధాలు ఉండేవి. హింద్, హిందూ, హింద్వాన్, హిందుష్ ఈ పేర్లన్నీ అత్యంత ప్రాచీనమైనవి. ఇండస్.. ఇదే హిందిష్ మాటకు గ్రీకు రూపం. గ్రీకులో భారత్‌కు ‘ఇండియా’, సింధుకు ‘ఇండస్’ అనే మాటల ప్రయోగాలు ప్రామాణికం. సంస్కృతంలోని ‘స్థానం’ పార్సీలో ‘స్తాన్’ అవుతుంది. అలా ‘స్తాన్’ అనే మాట ‘హిందు’కు జతకలిసి ‘హిందుస్తాన్’ అయింది. అంటే హిందువులు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతం అని అర్థం.
జంబూద్వీపం 'భారత్' కన్నా పాత పేరు
ఇక ‘జంబూద్వీపం’ అనే మాటకు వస్తే అది దేశానికి అత్యంత పురాతన పేరు. అది భారత్, ఆర్యావర్త, భరతవర్ష్ అనే పేర్ల కంటే పాతది. నేరేడుపండును సంస్కృతంలో జంబూ ఫలం అంటారు. భారత్‌లో ఒకప్పుడు నేరేడు చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి, అందుకే ‘జంబూద్వీపం’ అనేవారు. జంబూద్వీపం అనే పేరు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాని తర్వాత వచ్చిన 'భారత్' బాగా ప్రాచుర్యం పొందింది.