Sudarshan Chakra: ఎంతటి వినాశనాన్ని అయినా ఎదుర్కొనే శక్తి సుదర్శన చక్రం సొంతం..దీని శక్తి సామర్థ్యాలేంటో తెలుసా!
సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారు? దానికున్న మహిమలు ఏంటి? సుదర్శన చక్రం విష్ణువు చేతిలోనే ఎందుకు ఉంటుంది?

పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను మన గగన తలంలో రక్షణ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టింది. యావత్ భారతగగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేసింది. పాక్ మిస్సైళ్లను క్షణాల్లో పేల్చేసి దాని వైమానిక బలగాలను అయోమయానికి గురిచేసిన S–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ గురించి చర్చ జరుగుతోంది. ఈ సుదర్శన చక్రం గురించే ఇప్పుడు అంతటా చర్చ మొదలైంది. పురాణాల్లో సుదర్శన చక్రం గురించి ఏముందో తెలుసా...
శ్రీ మహావిష్ణువు రూపాన్ని తల్చుకోగానే ఆయన చేతిలో ఉండే సుదర్శన చక్రం కళ్లముందు కనిపిస్తుంది. ఈ చక్రానికి చాలా శక్తిసామర్థ్యాలుంటాయి. యుద్ధంలో శత్రువుల వినాశనానికి, భక్తులను రక్షించేందుకు , ఎంతటి వినాశనాన్ని అయినా ఎదుర్కొనే శక్తి సుదర్శన చక్రానికి ఉంటుందని పురాణాల్లో ఉంది.
శ్రీ మహావిష్ణువు ఆయుధం అయిన ఈ సుదర్శన చక్రం విష్ణువుకి ఎలా వచ్చింది?
సుదర్శన చక్రానికి అంత శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి ?
సుదర్శన చక్రం ఈ మహిమలు అన్నింటినీ ఎవరి నుంచి పొందింది?
ఎంతటి కష్టాన్ని అయినా, చెడుని అయినా అంతం చేసే శక్తి సుదర్శన చక్రానికి ఉంటుందా ?
ఈ విశ్వానికి రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకి ఓ శక్తివంతమైన ఆయుధం అవసరం అయింది. ఆ ఆయుధం ఎలా ఉండాలంటే దేవతలకు, భక్తులకు వచ్చే ఎలాంటి కష్టాన్ని అయినా తీర్చగలగాలి, ఎంతటి విపత్తుని అయినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉండాలి. అలాంటి ఆయుధం కోసం శ్రీ మహావిష్ణువు ధ్యానించాడు..పరమేశ్వరుడిని మెప్పించేవరకూ ధ్యానంలోనే ఉన్నాడు విష్ణువు. అప్పుడు ప్రత్యక్షమైన శివుడు విష్ణువుకి అత్యంత శక్తివంతమైన సుదర్శ చక్రం సృష్టించి ఇచ్చాడు. అలా శివుడి ఆలోచనలు, శక్తితో రూపొందించినదే సుదర్శనచక్రం. ఈ చక్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ప్రసాదించాడు పరమేశ్వరుడు.
మరో పురాణ గాధ ప్రకారం విశ్వకర్మ కుమార్తె సూర్య భగవానుడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆదిత్యుడి నుంచి వచ్చే వేడివల్ల ఆయనకు సమీపంలోకి వెళ్లలేకపోతుంది. అప్పుడు కూతురికోసం విశ్వకర్మ సూర్యుడి తేజస్సును తగ్గేంచి ఓ వస్తువు తయారు చేశాడు. అలా పుట్టిందే సుదర్శనచక్రం అని మరో కథనం.
సుదర్శన చక్రం, శివుడి త్రిశూలం రెండూ అత్యంత శక్తివంతమైనవని హిందూ పురాణాల్లో ఉంది. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం ప్రతి సెకెనుకి మిలియన్ల సార్లు తిరుగుతుందట. దీనికి 108 బ్లేడులు ఉంటాయి. కళ్లు మూసి తెరిచేలోగా మిలియన్ల యోజనాలు (యోజనం అంటే 8 కిలోమీటర్లు) తిరిగే శక్తి సుదర్శన చక్రం సొంతం.ఈ విశ్వాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూసినా, దుష్టశక్తులు విజృంభించినా వాటికి అడ్డుకట్ట వేసే శక్తి సుదర్శన చక్రం సొంతం. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు..దీనికి తెలివి, స్థిరరత్వం, నీతి,న్యాలం లాంటి లక్షణాలూ ఉన్నాయి.
శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు. ఈ అవతారంలో సుదర్శనచక్రాన్ని అగ్నిదేవుడి నుంచి పొందాడు కృష్ణుడు.
సుదర్శన చక్రాన్ని శ్రీ మహా విష్ణువు చాలా సందర్భాల్లో ఉపయోగించినట్లు పురాణకథలున్నాయి. గజేంద్రమోక్షం లో మొసలి నుంచి విడిపించమని భగవంతుడిని ప్రార్థించిన ఏనుగుని రక్షించేందుకు సుదర్శన చక్రం ప్రయోగించాడు విష్ణువు. శిశుపాలుడిని సంహరించేందుకు కూడా సుదర్శన చక్రం ప్రయోగించాడు. ఇలా సందర్భాన్ని బట్టి శత్రు సంహారం పూర్తిచేసి తిరిగి భగవానుడి చేతిలో నిక్షిత్రం అవుతుంది సుదర్శనచక్రం.






















