Bhagavad Gita: భగవద్గీత - సక్సెస్ ఫుల్ పర్సన్ కావాలంటే మీలో ఏ లక్షణాలు ఉండాలో తెలుసా?
Lord Krishna's advice on success: భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చిన ప్రతి సందేశం మానవ జీవితానికి ఉపయోగపడుతుంది. జీవితంలో విజయం సాధించాలనుకునే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పాడు.
Lord Krishna's advice on success: శ్రీమద్భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి. గీత మొత్తం శ్రీకృష్ణుని బోధనలతో నిండి ఉంది. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం భగవద్గీతలో ప్రస్తావించారు. గీతలోని బోధనలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. భగవద్గీత సూత్రాలను మన జీవితంలో అలవర్చుకుంటే ఎంతో పురోగతిని పొందవచ్చు. శ్రీమద్భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు విజయాన్ని సాధించడానికి అనేక మార్గాలను తెలిపాడు. భగవద్గీత ప్రకారం, మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే తప్పకుండా అందులో విజయం సాధించవచ్చు. ఆ భగవద్గీత బోధనలు చూద్దాం..
చేసే పని మీద నమ్మకం
శ్రీమద్భగవద్గీత ప్రకారం, ప్రతిఫలాన్ని ఆశించకుండా పని చేసేవాడు తన పనిలో తప్పకుండా విజయం సాధిస్తాడు. మీరు ఏదైనా ఉద్యోగంలో విజయం సాధించాలంటే, మీరు మీ పనులపై దృష్టి పెట్టాలి. చేయాల్సిన పనులపై మనసు పూర్తిగా లగ్నం చేయకుండా ఇతర ఆలోచనలతో ఉండేవారు తమ లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేరు.
పనిపై అనుమానం కూడదు
భగవద్గీత ప్రకారం, ఒక వ్యక్తి తన చర్యలను ఎప్పుడూ అనుమానించకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. కాబట్టి, మీరు విజయం సాధించాలనుకుంటే, మీరు ఏమి చేసినా, ఎటువంటి సందేహాలు లేకుండా పూర్తి విశ్వాసంతో పూర్తి చేయండి, అప్పుడే మీరు విజయపథంలో ముందుకు సాగుతారు.
మనసు అదుపులో ఉంచుకోండి
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మనసుపై నియంత్రణ చాలా ముఖ్యం అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. పని చేస్తున్నప్పుడు, మీ మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలి. కోపం తెలివిని నాశనం చేస్తుంది, అంతే కాకుండా అది చేసిన పనిని పాడు చేస్తుంది. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
మితిమీరిన అనుబంధం
భగవద్గీత ప్రకారం, ఒక మనిషి ఏ ఒక్కరితోనూ అతిగా అనుబంధం పెంచుకోకూడదు. ఈ అనుబంధమే మనిషి కష్టాలకు, వైఫల్యాలకు దారి తీస్తుంది. మితిమీరిన అనుబంధం ఒక వ్యక్తిలో కోపం, విచారం అనే భావాలను సృష్టిస్తుంది. ఈ కారణంగా, వారు తమ పనిపై మనసును, దృష్టిని కేంద్రీకరించలేరు. అందుకే మనిషి మితిమీరిన అనుబంధానికి దూరంగా ఉండాలి.
భయాన్ని వీడండి
భగవద్గీత ప్రకారం, ఏదైనా పనిలో విజయం సాధించాలంటే, ముందుగా మనలోని భయాన్ని పోగొట్టుకోవాలి. ఈ పాఠాన్ని చెబుతూ, శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో నిర్భయంగా పోరాడమని చెప్పాడు. ఓ అర్జునా... యుద్ధంలో మరణిస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం లభిస్తుందని కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత బోధించాడు. కాబట్టి మీ మనసులోని భయాన్ని వదిలించుకోండి.
Also Read : ఈ రెండు పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవద్దని భగవద్గీత చెబుతోంది!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.