నిత్య పూజ ఎలా చెయ్యాలి? సనాతన ధర్మం ఏం చెబుతోంది?
పూజ అనే మాటకు అర్థం పూర్వజన్మ వాసనలను నశింపజేసేదని అర్థం. జరామృత్యువులకు అతీతులను చేసే మార్గం చూపేదని కూడా పురాణాలు చెబుతున్నాయి.
హిందూ సనాతన ధర్మం జీవితంలోని ప్రతి ఒక్క పార్శ్వాన్ని స్పృషించే జీవిన విధానంగా ప్రసిద్ధికెక్కింది. భగవంతుడి ముందు దీపం వెలిగించని ఇంట్లో ఉండకూదని శాస్త్రం చెబుతోంది. అంటే ప్రతిరోజూ తప్పనిసరిగా ఇంట్లో భగవదారాధన జరగాలని అర్థం.
మానవ జన్మ ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ ఫలితాలను సిద్దింపజేసుకునే మార్గం. అదే సంకల్పంతో జీవించాలనేది ధర్మం. ఈ సంకల్పాలు నెరవేరాలంటే భగవదానుగ్రహం తప్పకుండా కావాలి. అందుకు నిత్య పూజ అవసరమవుతుంది. దీని కోసం విధి విధానాలు శాస్త్రం వివరిస్తోందని పండితులు చెబుతున్నారు.
భక్తి లేని ఆధ్యాత్మికత వ్యర్థమని ఆధ్యాత్మిక గురువులంతా ముక్త కంఠంతో చెప్పే మాటే. భక్తి అనేది ఒక సమర్పణ భావన. భక్తికి తొలి మెట్టుగా మనం పూజను భావించవచ్చు. అలాంటి పూజకు ఒక విధి విధానం ఉంటుంది. అదేమిటో తెలుసుకుని ఆ ప్రకారంగా ప్రతిరోజు పూజ చెయ్యడం వల్ల ఆ భగవంతుడితో అనుసంధానమై ఉండొచ్చనేది పండితుల సూచన. మరి మనం కూడా నిత్య పూజా విధానం గురించి తెలుసుకుందాం.
- ఆత్మ సిద్ధి కలిగించేది ఆసనం. అనారోగ్యాన్ని దూరం చేసేది, కొత్త సంకల్పలను నెరవేర్చేది, నవ సిద్ధులను సిద్ధింపజేసేది ఆసనం. ఆసనం చాలా ముఖ్యం నిలబడి పూజ చెయ్య కూడదు. చక్కగా కూర్చుని పూజ చేసుకోవాలి.
- పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం. కనుక పూజలో తర్పణ తప్పనిసరి. గంధం అంతులేని దౌర్భాగ్యాన్ని, కష్టాన్ని దూరం చేసేది, ధర్మ జ్ఞానాన్ని ఇచ్చేది. కనుక గంధం కూడా తప్పకుండా పూజలో వినియోగించాలి.
- అక్షత అంటే పవిత్రమైందని అర్థం. కల్మషాలను పోగొట్టేవి కనుక అక్షతలు కూడా పూజా ద్రవ్యాల్లో ఉండాలి.
- పుష్పం పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇచ్చేది. కనుక పువ్వు లేని పూజ పూర్తికాదని అంటుంటారు. భగవంతుడికి కనీసం ఒక్క పువ్వునైనా సమర్పించాలి.
- ధూపం దుర్వాసనలను పోగొట్టి ఒక చక్కని పవిత్ర పర్యావరణాన్ని సృష్టిస్తుంది. కనుక ధూపాన్ని కూడా తప్పకుండా భగవంతుడికి సమర్పించుకోవాలి.
- దీపం అజ్ఞాన అంధ:కారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును మన ఆత్మకు అందించేది. అహంకారాన్ని దూరం చేసి మనలో భక్తిని మేల్కొలిపే సాధనం. ఏం చేసినా లేకపోయినా దీపం వెలిగించి నువ్వే దిక్కు అని వేడుకోవడం వల్ల సమస్త బాధలు దూరమవుతాయని సనాతన ధర్మం చెబుతోంది.
- ఆరు రుచులతో, నాలుగు విధాల పదార్థాలను భగవంతుడికి తృప్తినిచ్చే దానిని నివేదించడాన్ని నైవేద్యంగా చెబుతారు.
- దేవుడికి సమర్పించిన సాదం అనగా ఆహారం ప్రసాదం. సామరస్యానికి, పరతత్వానికి ప్రతీక.
- లవంగ, జాజి, పచ్చకర్పూరం వంటివి కలిపిన ద్రవ్యాన్ని ఆచమనీయం అంటారు.
- పూజ మొదలయ్యే ముందు భగవంతుని పూజకు ఆహ్వానించడాన్ని ఆవహానంగా చెబుతారు.
- భగవంతుని పూజకు ఆహ్వానించి కుశలం కనుక్కోవడాన్ని స్వాగతం అంటారు.
- పాదాలు కడుక్కునేందుకు ఇచ్చే జలాన్ని పాదోపాద్యం అంటారు.
- తేనె, నెయ్యి, పెరుగుల మిశ్రమమం మధుపర్కం.
- గంధం, కస్తూరి, అగరుతో కూడిన జలంతో భగవంతుడికి చేసే సేవ స్నానం.
- వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, చేతులు నేలకు తాకించి చేసే వందనం సాష్టంగ నమస్కారం.
- ఇలా ఆహ్వానించిన దేవుడికి పదాహారు ఉపచారాలతో పూజించి తిరిగి పంపడాన్ని ఉద్వాసన అంటారు.
- పూజ అంటే పూర్వజన్మ వాసనలు పోగొట్టేది
- అర్చన అంటే అభిష్ట ఫలాన్ని నెరవేర్చేది.
- జపం అంటే జన్మజన్మల పాపాన్ని పోగొట్టేది.
- స్తోత్రం అంటే మనస్సును ఆనందింప జేసేది. తరింపజేసేది.
- ధ్యానం ఇంద్రియ నిగ్రహాన్ని అందించేది.
- ధీక్ష దివ్య భావాలు కలిగించేది. పాపాలను పోగొట్టేది.
- అహంభావాన్ని పోగొట్టేది, ఆనందాన్ని ఇచ్చేది ఆభిషేకం.