వ్యభిచారులు ఇచ్చే మట్టితోనే అమ్మవారి విగ్రహాల తయారి, ఎందుకంటే..
మీకు తెలుసా? దుర్గా దేవి విగ్రహ తయారీలో వ్యభిచారి వాకిటి మట్టి కూడా ఉపయోగిస్తారు. ఆ మట్టి బహుమతిగా వెళితే తప్ప ఆ బొమ్మ సంపూర్ణం కాదు. ఆశ్చర్యంగా ఉన్నా.. అదే నిజం.
వ్యభిచారాన్ని మనం తప్పుగా భావిస్తాం. ఆ పనిచేసేవారిని చాలామంది చీదరించుకుంటారు. వారిని సమాజానికి దూరంగా ఉంచుతారు. వారితో కలిస్తే తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే, అక్కడ వ్యభిచార గృహాలను పవిత్రంగా భావిస్తారు. దసరా వేడుకల్లో అక్కడి నుంచి సేకరించే మట్టితోనే అమ్మవారి విగ్రహాలను తయారు చేస్తారు. ఆ మట్టిని విగ్రహ తయారీదారులు కానుకగా స్వీకరిస్తారు. వ్యభిచారి చేతి నుంచి మట్టి అందకపోతే.. అమ్మవారి విగ్రహం పరిపూర్ణం కాదు. ఈ వింత ఆచారాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేస్తున్నారు. అందుకే అక్కడి దసరా వేడుకలు మిగతా ప్రాంతాల కంటే ప్రత్యేకం.
దేశ వ్యాప్తంగా దసరా పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పండుగను నవరాత్రి (తొమ్మిది రాత్రులు)గా కూడా జరుపుకుంటారు. మన దేశంలోని పశ్చిమ బెంగాల్ లో జరిగే దసరా తీరే వేరు. కోల్‌కతా మొత్తం ఈ తొమ్మిది రోజులు వింత శోభను సంతరించుకుంటుంది. ప్రతి వాడలో దేవి మండపాలు కొలువు తీరుతాయి. ఇక్కడ జరిగే పండగలో ఎన్నో విశేషాలు. అందులో ముఖ్యమైన ఘట్టం దేవి మంటపాల ఏర్పాటు. అక్కడ కొలువు దీరే దేవి విగ్రహాలు చాలా ప్రత్యేకం. దసరా అంటేనే స్త్రీ శక్తి ఆరాధన. అందులో ప్రతి స్త్రీలో దేవిని చూడడం ఇక్కడి ఆచారం. అందుకే ఇక్కడి దేవి విగ్రహ తయారీ నుంచే ఆ ప్రక్రియ మొదలవుతుందని చెప్పవచ్చు.
చిన్మయి మృన్మయిగా మారుతుంది ఇలా
దుర్గా పూజకు నెల రోజుల ముందు కోల్‌కతాలోని కుమార్తులిలోని ఇరుకైన వీధులు విగ్రహాలు తయారు చేసే కళాకారులు, వారు తయారుచేసిన విగ్రహాలతో కిక్కిరిసి పోతుంది. దుర్గా మాతను అలంకరించే పనిలో కళాకారులు కుటుంబ సమేతంగా తీరిక లేకుండా ఉంటారు. దేవీ పుత్రులు, చిన్మయి విగ్రహాలను తయారు చేస్తారు. వీటిని తర్వాత ఐదు రోజుల ఉత్సవాలలో పూజారులు ఆచారబద్ధంగా అమ్మవారిని మృణ్మయిగా మారుస్తారు.
గంటల తరబడి, రోజుల తరబడి చెమడోడ్చి తయారు చేసే హస్తకళా విన్యాసం ఈ దేవీ మూర్తుల తయారి. ఇంట్లో లేదా తమ కమ్యూనిటిల్లో ఈ మూర్తులను నిలుపుకొని కొలుచుకునేందుకు వీలుగా భిన్నంగా కనిపించే మూర్తులకు డిమాండ్ ఎక్కువ.ఈ విగ్రహాలను తయారు చేయడానికి ఉలుబేరియా అనే గ్రామం నుంచి బంకమట్టిని హూగ్లీ నది ద్వారా కోల్ కత్త నగరానికి తీసుకువచ్చి నది ఒడ్డునే విగ్రహాలు తయారు చేస్తారు.
వ్యభిచారి వాకిలిలోని మట్టే ఎందుకు?
సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం దుర్గా మాత విగ్రహ తయారీలో నాలుగు విషయాలు చాలా ముఖ్యమైనవి. అవి గంగా నదీతీరం నుంచి సేకరించిన మట్టి, గోవుపేడ, గోమూత్రం వీటితో పాటు నాలుగో అతి ముఖ్యమైనది వ్యభిచార గృహం నుంచి సేకరించిన మట్టి, దీనిని నిషిద్ధో ఫల్లీస్ అని అంటారు. వీటిలో ఏది లేకపోయినా ఆ విగ్రహం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. దీనిని పుణ్య మిట్టి అంటే పవిత్రమైన మట్టి అని అంటారు. పూజారి చేతి నుంచి మట్టి వ్యభిచారి చేతిలోకి ఆమె చేతి నుంచి వచ్చే మట్టి ని బహుమతిగా విగ్రహం తయారుచేసే వారు స్వీకరించాలి. ఇలా మట్టిని ఉత్సవాలకు కొన్ని నెలల ముందునుంచే సేకరించడం మొదలుపెడతారు.
అందరికీ భాగస్వామ్యం
శరదృతువులో జరిగే ఈ ఉత్సవాల్లోకి సమాజానికి దూరంగా బహిష్కారానికి గురైన వారిని సైతం కలుపుకుపోయేందుకు గాను ఇలాంటి ఆచారం ఏర్పాటు చేసి ఉంటారు. వేశ్యాగృహాలను సందర్శించే వ్యక్తులు తమ ధర్మాన్ని ఆ గుమ్మం దగ్గర వదిలి కేవలం శారీరక వాంఛలను తీర్చుకోవడానికి ఆ ప్రపంచంలోకి అడుగు పెడతారు. అక్కడి పాపాలన్నింటిని స్వీకరించిన ఆ నేల అన్ని ధర్మాలను గ్రహించి ధన్యమవుతుందనేది వారి నమ్మకం.
నవ కన్యా ఆరాధన
దీని వెనుక వేదాలలో ఉన్న మరోక అంశం కూడా ప్రాచూర్యంలో ఉంది. నవకన్యలుగా ఫిలవబడే తొమ్మిది తరగతుల స్త్రీలను ఆరాధించాలని, దుర్గా పూజ సమయంలో పూజించాలని నమ్ముతారు. వారిలో ఒక నటి (నర్తకి), ఒక వేశ్య, రాజకి (బానిస), ఒక బ్రాహ్మణీ(బ్రాహ్మణ కన్య), ఒక శూద్ర వనిత, ఒక గోపాల వనిత మొదలైన తొమ్మిది రకాల స్త్రీలను ఆరాధించడం సంప్రదాయం. ఈ విశ్వాసం ప్రకారం ఇలా స్త్రీలను ఆరాధించకుండా పది చేతులు కలిగిన దుర్గా దేవి ఆరాధన అసంపూర్ణం.
Also Read: ఒక్కో దేవుడికి ఒక్కో ఆయుధం - కానీ పరాశక్తి చేతిలో అవన్నీ ఉంటాయ్ ఎందుకలా!
Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!