Diwali 2021: ధన త్రయోదశికి బంగారానికి లింకేంటి, ఈ రోజు లక్ష్మీ పూజ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి?
ధనత్రయోదశి దీనినే ధంతేరాస్ అని కూడా పిలుస్తారు. దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏడాది నవంబరు 2 మంగళవారం ధంతేరాస్. ఈ రోజున బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి...
ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజున కొందరు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. ఈ రోజునే బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి.. ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచి ఉంది అన్నదే ఇప్పుడు డిస్కషన్.
ధన త్రయోదశి రోజు బంగారం ఎందుకు కొంటారంటే...
అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందట. అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. అందుకే ధంతేరాస్ వచ్చేసరికి బంగారం వెండి ధరలు పెరిగినా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే వినియోగదారులు మాత్రం కొనుగోలు చేసేందుకు వెనకాడరు.
ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి. ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు.
Alos Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
ఉత్తరాది పండుగ
ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తరాదివారే ఎక్కువగా జరుపుకుంటారు. రాను రాను సెంటిమెంట్స్ పెరిగి దక్షిణాదివారూ ఫాలో అవుతున్నారు. బంగారం-వెండి కొనుగోలు చేయడం, లక్ష్మీపూజ చేయడం మంచిదే కదా ఇందులో తప్పేముందని భావిస్తున్నారు. అందుకే తమ శక్తి కొలది బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. వినాయకుడు, లక్ష్మీదేవి, కుబేరుడి బొమ్మలు కొత్తవి కొనుగోలు చేసి పూజించడాన్ని శుభప్రదంగా భావిస్తారు. సాధారణంగా ఈ పూజను ప్రదోష వేళలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాల కాలాన్నే ప్రదోషకాలం అంటారు. ధన త్రయోదశి రోజున ఎవ్వరికీ రుణాలు ఇవ్వడం, అనవసర ఖర్చులు వంటివి చేయరు.
Alos Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
యముడికి ప్రత్యేక పూజ
ధన త్రయోదశి రోజు కొన్ని ప్రాంతాల్లో ‘యమ త్రయోదశి’గానూ పరిగణిస్తారు. పూర్వం ‘హిమ’ అనే రాజుకు లేక లేక కొడుకు పుడతాడు. వివాహమైన నాలుగో రోజునే ఆ రాకుమారుడు మరణిస్తాడని కొందరు హెచ్చరిస్తారు. కాలక్రమంలో ఒక రాజకుమారి అతణ్ని వరించి పెళ్లాడుతుంది.భర్తను తానే కాపాడుకుంటానని ధీమాగా చెబుతుంది. పెళ్లయిన నాలుగో రోజున రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాశులుగా పోసి- దీపాలు ఉంచుతుంది. లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో స్తుతిస్తూ, గానం చేస్తుంటుంది. అదే సమయానికి, రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడు. నగల మీద పడిన దీపకాంతి వల్ల, ఆయన కళ్లు చెదురుతాయి. యువరాణి పాటలకు మైమరచిపోతాడు. మృత్యుఘడియలు దాటి, యముడు శూన్యహస్తాలతో వెనుదిరిగాడన్నది వేరొక కథనం. ఈరోజు త్రయోదశి వేళ, యముడి ప్రీతి కోసం దీపాలు వెలిగిస్తే మృత్యుభయం ఉండదనీ అంటారు. పరిపూర్ణ ఆయుష్షు కోసం సూర్యాస్తమయం సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తారు.యముడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు కాబట్టి.. ఇంటి ఆవరణంలో దక్షిణం వైపున, ధాన్యపు రాశి మీద ఈ దీపాలను వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల యముడు శాంతిస్తాడని, అకాల మరణం దరి చేరనీయడమని చాలా మంది నమ్ముతారు.
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి