Christmas 2025: మోషే, యేసు క్రీస్తు-ఇద్దరి జీవితాల్లో ఆశ్చర్యకరమైన సారూప్యతలు! రహస్యమేమిటో తెలుసుకోండి
Christmas 2025:మోషే పుట్టిన 1,300 ఏళ్లకు యేసు క్రీస్తు జన్మించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచ క్రైస్తవులు వీరి జన్మ సారూప్యతలను ధ్యానిస్తారు.

Christmas 2025: భూమిపై పుట్టిన వారిలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులుగా యేసు క్రీస్తు, మోషేలను ప్రపంచ చరిత్ర గుర్తించింది. ఇందులో యేసు క్రీస్తు క్రైస్తవ మతానికి మూలంగాను, దేవుడిగా కొనియాడటం మనకు తెలిసిందే. ఇక మోషే, ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఆచరించే యూదా మతానికి మూల పురుషుడిగా ఉన్నారు. ఇలా ఇద్దరి జీవితాల్లో చాలా సారూప్యతలు కనిపిస్తాయి. అయితే, ఇది యాదృచ్ఛికం కాదని, ఇందులో దైవిక ప్రమేయం ఉందని మత విశ్లేషకులు చెబుతారు.
మోషే పుట్టిన 1,300 ఏళ్లకు యేసు క్రీస్తు జన్మించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచ క్రైస్తవులు వీరి జన్మ సారూప్యతలను ధ్యానిస్తారు. ఆ సారూప్యతలు ఏంటో ఇప్పుడు మనమూ ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
1. మోషే, యేసు క్రీస్తు పుట్టుకతో భయపడిన ఇద్దరు రాజులు
మోషే: క్రీ.స్తు పూర్వం 1390 నుంచి 1350 మధ్య కాలంలో ఈజిప్టులోని గోషేను అనే ప్రాంతంలో జన్మించి ఉంటారని చెబుతారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ వాసులంతా ఈజిప్టులో బానిసలుగా ఉన్నారు. మోషే పుట్టే సమయానికి ఈజిప్టును ఫరోలు పాలించేవారు. ఆ సమయంలో ఫరో రాజుగా థుట్మోస్ I (Thutmose I) లేదా థుట్మోస్ II (Thutmose II) అయ్యే అవకాశం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఇజ్రాయెల్ ప్రజల సంఖ్య పెరుగుతుంటే ఫరో రాజులో భయం పట్టుకుంది. అదే సమయంలో మోషే జన్మించినట్లు యూదా మత గ్రంథాలతోపాటు క్రైస్తవుల బైబిల్ చెబుతుంది.
యేసు క్రీస్తు: రెండువేల ఇరవై ఐదు (2025) సంవత్సరాల ముందు బెత్లహేంలో జన్మిస్తారు. ఆ సమయంలో, మోషే కాలంలో బానిసలుగా ఉన్నట్లే, రోమన్ల అణిచివేత పాలనలో ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు. యేసు క్రీస్తు పుట్టే నాటికి గ్రేట్ హేరోదు అనే రాజు పరిపాలిస్తుంటాడు. అదే సమయంలో యేసు క్రీస్తు బెత్లహేంలో జన్మించడం జరుగుతుంది. ఆ సమయంలో తూర్పు దిక్కున పెద్ద నక్షత్రం ఆకాశంలో కనపిస్తోంది. దీన్ని చూసి తూర్పు దేశాల నుంచి ముగ్గురు జ్ఞానులు వచ్చి హేరోదు రాజును కలిసి, "యూదులకు కొత్త రాజు పుట్టాడు, అతను ఎక్కడ?" అని అడగడంతో, తనకు, తన వారసులకు పోటీగా రాజు పుట్టాడన్న భయం పట్టుకుంటుంది.
2. మోషే, యేసు క్రీస్తు శిశువులుగా ఉన్నప్పుడు శిశువధకు పాల్పడిన రాజులు
మోషే కాలంలో ఫరో రాజు, ఇజ్రాయెలు ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న భయంతో ఉండేవాడు. ఈ కారణంగా, వారి సంఖ్య ఈజిప్టు ప్రజల కన్నా ఎక్కువ పెరగకుండా చిన్న పిల్లలను చంపాలని క్రూరమైన ఆదేశం ఇస్తాడు. దాంతో మోషే పుట్టిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇజ్రాయేల్ ప్రజల పిల్లల వధ జరుగుతుంది.
యేసు క్రీస్తు జననం కోసం గ్రేట్ హేరోదు రాజు వద్ద ముగ్గురు జ్ఞానులు వాకబు చేయడంతో ఆయన భయపడి, బెత్లహేం చుట్టుపక్కల ప్రాంతాల్లోని చిన్న పిల్లలనందరినీ ఎలాంటి జాలి లేకుండా చంపడం జరుగుతుంది. ఇలా మోషే, యేసుక్రీస్తు శిశువులుగా ఉన్న సమయంలో వారిని పాలించే రాజులు శిశువధకు పాల్పడటం జరుగుతుంది. ఈ వృత్తాంతం యూదా, క్రైస్తవ మత గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది.
3. మోషే, యేసు క్రీస్తులను కాపాడిన ఈజిప్టు దేశం
ఫరో రాజు శిశువులను నదిలో పడవేసి చంపాలని ఆజ్ఞ ఇస్తే, మోషేను మాత్రం వారి తల్లిదండ్రులు ఒక చిన్న చెక్క పెట్టెలో పెట్టి నదిలో వదిలివేస్తారు. అక్కడికి స్నానం చేసేందుకు వచ్చిన ఫరో కుమార్తె ఆ పెట్టెను తెరచి, మోషేను పెంచుకునేందుకు ఈజిప్టు రాజ ప్రసాదానికి తీసుకుని వెళ్లి పెంచి పెద్ద చేస్తుంది. బానిస కుమారుడైన మోషే, రాకుమారుడిలా ఆ ప్యాలెస్‌లో పెరిగినట్లు యూదా మత గ్రంథాలు, క్రైస్తవ మత గ్రంథాలు చెబుతాయి.
బెత్లెహెం ప్రాంతంలో శిశువులను చంపమని గ్రేట్ హేరోదు ఆజ్ఞ ఇవ్వగానే, దేవదూత యేసు క్రీస్తు తల్లిదండ్రులకు కనిపించి, వారిని ఈజిప్టుకు వెళ్లమని చెప్పడంతో వారు ఈజిప్టు దేశంలో తల దాచుకుంటారు. అక్కడ కొంత కాలం ఉన్నాక, గ్రేట్ హేరోదు మరణించినట్లు అదే దేవదూత చెప్పడంతో వారు తిరిగి ఇజ్రాయేల్‌లోని నజరేతుకు వెళ్లి అక్కడ నివాసం ఉన్నట్లు బైబిల్‌లో చెప్పారు.
ఇలా మోషే, యేసు క్రీస్తు శిశువులుగా ఉన్నప్పుడు వారి జీవితంలో ఈజిప్ట్ అనే దేశం ముఖ్య పాత్ర పోషించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇద్దరూ శిశువధ నుంచి రక్షించడానికి దైవిక జోక్యం ఉందని మత విశ్లేషకులు చెబుతారు.
4. ఇద్దరికీ విమోచకులుగా గుర్తింపు
మోషే నాయకత్వంలోనే ఇజ్రాయెల్ వాసులు ఫరో బానిసత్వం నుంచి బయటకు వచ్చినట్లు వారి మత గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు చెబుతాయి. రాజ కుటుంబంలో పెరిగినప్పటికీ, తన మూలాలు మర్చిపోకుండా బానిసలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసుల కోసం రాజరికాన్ని వదలి మోషే వేరే దేశానికి పారిపోయాడని, ఆ తర్వాత వారిని విడిపించేందుకు దైవిక బలంతో వచ్చాడని చెబుతారు. ఆ తర్వాత అద్భుత దైవిక శక్తితో ఈజిప్టు నుంచి ఇజ్రాయెల్ వాసులను బానిసత్వం నుంచి విడిపించి, వారిని ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశానికి తీసుకువచ్చాడని, ఆయన్ని విమోచకుడిగా గుర్తిస్తారు నేటి యూదులు.
ఇక యేసు క్రీస్తును క్రైస్తవులంతా పాపం నుంచి విడిపించడానికి వచ్చిన రక్షకుడిగా, విమోచకుడిగా చెప్తారు. పాపం వల్ల స్వర్గ ద్వారాలు మానవులకు మూసుకుని పోయాయని, పాపం నుంచి వారిని విడిపించి పవిత్రులుగా చేయడానికే ఆయన సిలువలో మరణించాడని క్రైస్తవుల విశ్వాసం. ఇలా యేసు క్రీస్తును పాప విమోచకుడని చెప్తారు.
5. ప్రసిద్ధి చెందిన మోషే, యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగాలు
మోషే తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించాక మౌంట్ సినాయి కొండ పైన దేవుని ద్వారా పది ఆదేశాలు పొంది వారికి బోధించినట్లు వారి మత, చారిత్రక గ్రంథాలు చెప్తాయి. దీన్ని ఓ నిబంధనగా చెప్తారు. ఇవి ఇజ్రాయేల్ ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశాలు. దీంతోపాటు అనేక చట్టాలు ఆనాడు చేసుకున్నారు. ఇప్పటికీ మోషే ఇచ్చిన పది ఆజ్ఞలను యూదులు క్రమం తప్పకుండా పాటిస్తారు. చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తారు. అంత కఠినంగా ఈ ఆజ్ఞలను పాటిస్తారు.
యేసు క్రీస్తు విషయానికి వస్తే, ఆయన మౌంట్ ఆఫ్ బీటిట్యూడ్స్ (Mount of Beatitudes) వద్ద చేసిన ప్రసంగం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్నే సెర్మెన్ ఆన్ ది మౌంట్ (Sermon on the Mount) లేదా కొండ మీద ప్రసంగంగా చెబుతారు. మోషే దేవుని ఆరాధన అంశాలు, పాటించాల్సిన విధి, విధానాలు చెబితే, యేసు క్రీస్తు మనిషి అంతర్గతంగా నైతికంగా ఆలోచించే అంశాలను స్పృశిస్తారు. ఈ ప్రసంగంలోనే ఒక చెంప మీద కొడితే మరో చెంప తిప్పాలని, ప్రతీకారం (ప్రతి హింస కాదు) చేయకూడదని చెబుతారు. ఈ ప్రసంగం క్రైస్తవులకు ఓ దిక్సూచిగా భావిస్తారు. ఇలా ఇద్దరూ కొండ మీద చేసిన ప్రసంగాలు అటు యూదులకు, ఇటు క్రైస్తవులకు ప్రాముఖ్యమైనవిగా నిలిచాయి.
ఇలా ఇద్దరి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఒకే రీతిలో కనిపిస్తాయని థియోలాజికల్ స్కాలర్స్ చెబుతారు. ఈ సారూప్యతలు కేవలం సాహిత్యపరమైనవి కాదని, మోషే జీవిత నమూనా ఆ తర్వాత వచ్చిన యేసు క్రీస్తుకు ఓ ముంగుర్తుగా విశ్లేషిస్తారు. మోషే ప్రజలను బానిసత్వం నుంచి విడుదల చేస్తే, యేసు క్రీస్తు పాపం నుంచి ప్రజలను విమోచించారని చెబుతారు.





















