Why YSRCP Silent On BJP : బీజేపీ విమర్శలపై స్పందించని వైఎస్ఆర్‌సీపీ - భయమా ? రాజకీయ వ్యూహమా ?
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ స్పందించలేదు. ప్రాధాన్యం ఇవ్వకూడదని అనుకుంటోందా ?
Why YSRCP Silent On BJP : ఏపీ భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలి గా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి వైఎస్ఆర్‌సీపీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఏపీని ఆదుకుందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన పురంధేశ్వరి జగన్ ప్రభుత్వంలో లోటుపాట్లను ఎత్తి చూపారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో చెప్పాలని.. రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్ధితి ప్రజలందరికీ తెలుసని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందని.. మహిళలు మొబైల్ ఊపడానికే తప్ప దిశా ఎందుకు పనికిరావడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారారు. రెండేళ్లలోనే విభజన చట్టంలో చెప్పినట్టు జాతీయ విద్యా సంస్థలు అన్ని నెలకొల్పారన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ, పలు ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు తేలేదని.. జాకీ లాంటి సంస్థ కూడా వెళ్లిపోయిందంటూ మండిపడ్డారు.
విధానపరమైన అంశాలపై తీవ్ర విమర్శలు
ప్రభుత్వం చెప్పిన దశలవారీ మద్య నిషేధం ఏమైందని ఏపీ ప్రభుత్వాన్ని పురంధేశ్వరి ప్రశ్నించారు. మద్యం విషయంలో పెద్ద కుంభకోణం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని.. పదో తరగతి విద్యార్థిని దారుణంగా సజీవ దహనం చేశారని విమర్శించారు. విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదని.. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని మండిపడ్డారు. మొత్తంగా ప్రభుత్వం తీరుపై పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పించారు. మామూలుగా అయితే ఇలాంటి విమర్శలను వైఎస్ఆర్‌సీపీ అసలు సహించదు. తమ మార్క్ కౌంటర్లతో విరుచుకుపడుతుంది. కానీ పురందేశ్వరపై విమర్శలు చేయడానికి.. బీజేపీ ఆరోపణల్ని ఖండించడానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు సిద్ధంగా లేరు.
బీజేపీపై ప్రస్తుతానికి మౌన వ్యూహం !
ప్రస్తుతం ఏపీలో మిత్ర పక్షాలన్నీ ఒక్కటవుతున్నపరిస్థితుల్లో కేంద్రంతో గొడవలు పెట్టుకునే పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ లేదు. ఎన్నో అంశాలపై కేంద్రంతో రాజీపడ్డ వైసీపీ సర్కార్ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తోంది. ఇప్పటికే టీడీపీ ఎన్డీయేకు దగ్గరవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్న వేళ ఏదన్నా పొరపాటున బీజేపీ నేతలపై ఎదురు తిరిగితే జగన్ భవిష్యత్ కు గ్యారంటీ ఉండని పరిస్థితి అందుకే ఏపీ బీజేపీ విషయంలో వైఎస్సార్సీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అందుకే జనసేన, టీడీపీ టార్గెట్ గా వైసీపీ నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తుంటారు. ఈ సమయంలో ఏదైనా బీజేపీని మాట అంటే ఢిల్లీ నుంచి వచ్చిపడే తిట్లు తట్టుకోలేక వైసీపీ భరిస్తోందని అందరి అభిప్రాయం.
పొత్తలపై బీజేపీ వైఖరి తెలిసిన తర్వాత వైసీపీ ఎదురుదాడి చేస్తుందా ?
పొత్తులపై బీజేపీ వైఖరి ప్రస్తుతం తెలియడం లేదు. టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి పిలిచారో లేదో స్పష్టత లేదు. కానీ వైసీపీ మాత్రం.. తాము బీజేపీకి దగ్గరేనని సంకేతాలు పంపుతోంది. ఒక వేళ టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి ఉంటే మాత్రం.. వైసీపీ బీజేపీపై ఎదురుదాడి దిగడం ఖాయమని భావిస్తున్నారు. ఆ తర్వాత ప్రత్యేకహోదా సహా అనేక అంశాలను తెరపైకి తెస్తారని చెబుతున్నారు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల భయం ఉంటే మాత్రం టీడీపీతో కలిసినా వైసీపీ దూకుడుగా వెళ్లకపోవచ్చన్న అభిప్రాయమూ ఉంది. మొత్తంగా వైసీపీ మౌనం.. బీజేపీకి అలుసలయ్యే అవకాశం కనిపిస్తోంది.