YSRCP AP Local Elections : స్థానిక పోరులో వైఎస్ఆర్సీపీ బిగ్ ప్లాన్ - నామినేషన్ల రగడ వెనుక ఎన్నికల బహిష్కరణ వ్యూహమా?
YSRCP Local Elections : ఏపీ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల వివాదం తీవ్రమైంది. వైసీపీ ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతోందా? పోలీసులు అడ్డుకుంటున్నారా లేక ఓటమి భయమా?

AP Municipal Elections Nomination Disputes: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యమైన రాజకీయ, చట్టపరమైన సమీకరణాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థానిక పోరులో నామినేషన్ల ఘట్టం నుంచి మొదలైన వివాదం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం వరకు చేరినప్పటికీ.. అధికార కూటమి, పొలిటికల్ సర్కిళ్లలో మరో ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నామినేషన్లను అడ్డుకున్నారు అనే ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగానే తీవ్రతరం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బహిష్కరణ ప్రకటన వచ్చేలా మానసిక వాతావరణాన్ని సిద్ధం చేసుకుంటోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ ర్యాలీలకు ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు
రాష్ట్రంలోని పలు సమస్యాత్మక కేంద్రాలు, మున్సిపాలిటీలలో స్థానిక అధికారులు , పోలీసులు తీసుకుంటున్న భద్రతా చర్యలే. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, అనవసర ఘర్షణలను నివారించేందుకు పోలీసులు నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, సంబంధిత అభ్యర్థులు, ప్రతిపాదకులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే, వైసీపీకి చెందిన కొందరు ముఖ్యనేతలు తమ అనుచరగణంతో భారీ రాలీలుగా నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకోవడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమే. కానీ, దీన్నే పక్కాగా తమకు అనుకూలంగా మలుచుకుని మా నేతలను పోలీసులు దగ్గరుండి అడ్డుకుంటున్నారు, నామినేషన్లు వేయనివ్వడం లేదు అని వైసీపీ డిజిటల్ స్పేస్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తోందనేది టీడీపీ నేతల ఆరోపణ.
బహిష్కరణే బెటరని అనుకుంటున్నారా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత వైసీపీ క్షేత్రస్థాయి యంత్రాంగం , ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్రమైన నైరాశ్యంలో కూరుకుపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి ఉనికి కూడా తుడిచిపెట్టుకుపోతుందనే భయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే.. ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాం అనే నరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పార్టీ ప్రతిష్టకు క్షేమకరమని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పొలిటికల్ టాక్ నడుస్తోంది. మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియను వీలైనంత వివాదాస్పదం చేయడం ద్వారా తమ బహిష్కరణ నిర్ణయానికి పునాది వేసుకునే ప్రయత్నం సాగుతోందని తెలుస్తోంది. నామినేషన్లలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించడం, ఆరోపణలను మీడియా వేదికగా నిరంతరం పబ్లిసిటీ చేయడం ద్వారా.. ఎన్నికల యంత్రాంగం , పోలీసులు కూటమికి కొమ్ముకాస్తున్నారు, ఇలాంటి వాతావరణంలో ఎన్నికలు ప్రహసనంగా మారాయి అనే అభిప్రాయాన్ని బలంగా నాటాలని యత్నిస్తున్నారు. మా అభ్యర్థుల ప్రాణాలకు రక్షణ లేదు, అందుకే మేము ఈ ప్రజాస్వామ్య రహిత ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని బాహాటంగా ప్రకటించడానికి పార్టీకి ఒక బలమైన సాకు దొరుకుతుందని భావిస్తున్నారు.
పోటీ విషయంలో వైసీపీ ఆలోచనలేంటి?
తమకు ప్రజా మద్దతు ఉందని, కానీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతూ, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, అభ్యర్థులను భౌతికంగా అడ్డుకోవడం వల్లే తాము న్యాయపోరాటం చేయాల్సి వస్తోందని వారు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా నామినేషన్ల ప్రక్రియను సమీక్షించి గడువు పెంపును పరిశీలించాలని సూచించడమే తమ ఆరోపణలకు నిదర్శనమని వారు స్పష్టం చేస్తున్నారు. స్థానిక పోరులో సాగుతున్న ఈ యుద్ధం రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీ , పోలీసులు ఎంతటి పటిష్ట భద్రత కల్పించినా, ఒకవేళ వైసీపీ నిజంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తే.. అది రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రగడకు దారితీస్తుంది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ వ్యూహం బహిష్కరణ వైపా లేక పూర్తిస్థాయి పోరాటం వైపా అనేది తేలిపోనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















