YS Jagan: ఈ 13న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం, సీఎం జగన్ ఏం చెప్పనున్నారు - ఎమ్మెల్యేలకు టెన్షన్ !
ఈ నెల 13 న జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ ఏం చెప్పనున్నారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. కొంతమంది ఎమ్మెల్యేలకి ఇబ్బందులు తప్పవా అని పార్టీలో చర్చ మొదలైంది.
ఈ నెల 13న జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఏం చెప్పనున్నారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. కొంతమంది ఎమ్మెల్యేలకి ఇబ్బందులు తప్పవా అని పార్టీలో చర్చ మొదలైంది.
కీలకంగా మారిన 13న జరిగే సమావేశం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తుమన్న జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం జగన్.. త్వరలో తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో ఈ నెల 13 న కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు . ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం జగన్ క్షేత్ర స్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు పైన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కఠిన నిర్ణయాలకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పైన ఫోకస్ పెట్టారు. ఈ సమావేశంలో ఆ అంశమే కీలకం కానుంది.
ఇక వరుసగా సమావేశాలే...
ఇప్పటికే పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం జగన్, ఈ సారి మంత్రులు, ఎమ్మెల్యేలతో మీటింగ్ కు నిర్ణయం తీసుకున్నారు. గత సమావేశంలో ప్రతి సచివాలయ పరిధిలో కన్వి నర్లు, గృహ సారథుల నియమాకంపై నిర్ణయించినా ఇప్పటికీ నియామకాలు పూర్తి కాలేదు.
రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో వీరి నియామకం పైన సీఎం జగన్ గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు ఇదే అంశం పైన మరోసారి ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో గత సమావేశంలో దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ దగ్గర సర్వే వివరాలు ఉన్నాయి. ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే సీట్లు ఇవ్వటం కష్టమని తేల్చి చెప్పారు. పనితీరు మెరుగు పర్చుకోవటానికి వారికి మరో అవకాశం ఇచ్చారు. దీంతో ఈ సమావేశంలో జగన్ ఏం చెప్పబోతున్నారనేది పార్టీ వర్గాలతో పాటుగా, ఎమ్మెల్యేల్లో హైటెన్షన్ పెరిగిపోతోంది.
సర్వేలు... రిపోర్ట్ లు...
వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంఛార్జ్ లకు సంబంధించిన ప్రోగ్రస్ రిపోర్టులు ఐపాక్ తో పాటుగా మరో రెండు సర్వే సంస్థలు ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రజలతో, పార్టీ కేడర్ తో మమేకం అవుతున్న విధానంతో పాటుగా వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా మార్కులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరు పైన ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం లేకపోలేదన్నది పార్టీ నేతల వాదన. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ప్రతిపక్ష టీడీపీ సిట్టింగ్ లకు సీట్లు ఖరారు చేయటంతో పాటుగా కొత్తగా ఇంఛార్జ్ లను నియమించే పనిలో ఉంది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను గమనిస్తూ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు దిశగా నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు అనే విదానం అభ్యర్థుల ఎంపికకు కీలక సూత్రంగా చెబుతున్నారు. ఈ వ్యవహారం పై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
పార్టీ, ప్రభుత్వాన్ని కలిపి ముందుకు... పల్లె నిద్ర
ప్రభుత్వ వ్యవహారాలతో పాటు పార్టీ పనులను సమన్వయం చేసుకుంటూ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ కార్యాచరణ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ సైతం ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం కానున్నారు. ముఖ్యమంత్రి జగన్ పల్లెనిద్ర చేయాలని కీలకంగా నిర్ణయించారని అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత ముఖ్యమంత్రితో పాటుగా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేయబోతున్నారన్నది పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే గుర్తింపు పైన సంకేతాలు కూడా సిద్దం చేసుకుంటున్నారు. దీని వలన రెబల్స్ లెక్కలు క్లియర్ అవుతాయని పార్టీ భావిస్తోంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత జగన్ ఏం ప్రకటన చేయబోతున్నారనేది మరో నాలుగు రోజుల్లో తేలనుంది. ఈ నెల 20న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి నేతలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.