(Source: ECI/ABP News/ABP Majha)
BRS : బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు - కేటీఆర్, హరీష్ ఢిల్లీ టూర్ అందుకేనా ?
Telangana : బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీ రాజ్యసభపక్షంలో విలీనం కానుందా ? కేటీఆర్, హరీష్ ఢిల్లీలో డీల్ పూర్తి చేసుకుని వచ్చారా ?
Will the BRS Rajya Sabha party merge with the BJP Rajya Sabha party : తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు క్యూ కట్టగా.. మరో వైపు పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు కానీ.. అత్యున్నత స్థాయి రాజకీయవర్గాలు మాత్రం.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని చెబుతున్నారు.
బీఆర్ఎస్‌కు రాజ్యసభలో నలుగురు సభ్యులు
ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెటెరో పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో లోక్ సభ లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే రాజ్యసభలో నలుగురు ఉండటంతో బీఆర్ఎస్ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడా నలుగురు బీజేపీలో విలీనం అయ్యేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో ఎంపీ కేశవరావు కాంగ్రెస్ లో చేరి.. తన పదవికి రాజీనామా చేశారు. ం
కేసీఆర్ వ్యూహం మేరకే విలీనం జరగబోతోందా ?
నలుగురు రాజ్యసభ సభ్యలు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులే అయితే ఈ ఎంపీల విలీన రాజకీయం బీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసే జరుగుతోందని చెబుతున్నారు. కేసీఆర్ సూచనల మేరకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని అక్కడ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని అంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి బలం అవసరం . పూర్తి మెజార్టీ లేదు. అందుకే రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చిటనట్లుగా చెబుతున్నారు. దీనికి బీఆర్ఎస్ పెద్దలు కొన్ని షరతులతో అంగీకరించారని చెబుతున్నారు.
గతంలో టీడీపీ సభ్యుల విలీనం
గతంలో ఏపీలో టీడీపీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పెరుపడిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కూడా ..బీజేపీలో టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేయడంతో.. అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని అనుకుంటూ ఉంటారు. అయితే అలా వెళ్లిన వాళ్లు ఎవరూ తిరిగి రాలేదు. కానీ బీజేపీకి, టీడీపీకి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో బీఆర్ఎస్ కూడా రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసేస్తుందని అంటున్నారు. డీల్ నిజమే అయితే.. వారంలోనే ఈ నలుగురు బీజేపీలో చేరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు.