Modi Vs KCR : సీక్రెట్ భేటీ రహస్యాలతో బీజేపీకి ఎంత లాభం ? ఆ విషయాలు బయట పెట్టడం వెనుక మోదీ వ్యూహం ఏమిటి ?
నిజామాబాద్‌లో ప్రధాని మోదీ స్పీచ్ బీజేపీకి మేలు చేస్తుందా ? ఆ విషయాలు బయట పెట్టడానికి అసలు కారణం ఏమిటి ?
Modi Vs KCR : నిజామాబాద్‌లో ప్రధాని మోదీ ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఎన్డీఏలో చేరేందుకు కేసీయార్ ప్రతిపాదనలు పెట్టారని తాను తిరస్కరించారని.. ప్రధాని స్వయంగా ప్రకటించారు. అది జరిగింది ఇప్పుడు కాదు రెండేళ్ల కిందట. మరి ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు ?. చాలా సార్లు తెలంగాణలో సభలు ఏర్పాటు చేసినప్పటికీ కేసీఆర్ ను కనీస మాత్రంగా కూడా విమర్శించని మోదీ ఇప్పుడు కేసీఆర్ తమతో జత కట్టాలనుకున్న విషయాన్ని ఎందుకు బయట పెట్టారు ? . ఇలా చెప్పడం వల్ల బీజేపీకి ఎంత లాభం అన్నది కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు.
మోదీ మాటల వెనుక ప్రత్యేక వ్యూహం - కానీ ఏమిటది ?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్‌లో కేసీఆర్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయలేదు... విమర్శలు చేయలేదు. కేసీఆర్‌కు.. తనకు మధ్య జరిగిన సంభాషణల వివరాలు మాత్రం వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ తన వద్దకు వచ్చి ఎన్డీఏలో చేరుతానని గ్రేటర్ మేయర్ పదవి ఇస్తానని ప్రతిపాదన పెట్టారని మోదీ అన్నారు. ప్రతిపక్షంలో అయినా కూర్చుకుంటాము కానీ బీఆర్ఎస్‌తో కలిసేది లేదని చెప్పి పంపిచానన్నారు. కేటీఆర్‌కు బాధ్యతలు ఇస్తానని.. సహకరించాలని కోరారన్నారు. అయితే తాను మీరేమైనా రాజులా అని ప్రశ్నించాననని మోదీ తెలిపారు. అప్పుడే కేసీఆర్ అవినీతి చిట్టా అంతా తాను చెప్పానన్నారు. అప్పట్నుంచి కేసీఆర్ తనను కలవడం మానేశారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు వరకూ తాను వస్తే.. స్వాగతం చెప్పేందుకు కేసీఆర్ వచ్చే వారని.. ఆ తర్వాత నుంచి మొహం చాటేస్తున్నారని మోదీ తెలిపారు. మోదీ మాటల ఆషామాషీగా చెప్పరు. ఖచ్చితంగా రాజకీయ వ్యూహంతోనే ఈ విషయాలు బయట పెట్టారు. ఆ వ్యూహం ఏమిటన్నది రాజకీయ నిపుణులకూ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ విషయాలు బయట పెట్టడం వల్ల బీజేపీకి వచ్చేదేమీ ఉండదని భావిస్తున్నారు.
బీజేపీకి ఎంత మేలు చేస్తుంది ?
రాజకీయ నాయకుడు చేసే ప్రతి ప్రకటన వెనుక ఓ రాజకీయం ఉంటుంది. అందులో సందేహం లేదు. ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయి నేతలు బహిరంగసభలో రాజకీయ ప్రకటనలు చేస్తే అందులో రాజకీయం లేకుండా ఉండదు. మోదీ బయట పెట్టిన ఈ అంతరంగిక విషయాల వల్ల బీజేపీకి ఏమైనా మేలు ఉంటుందా అని ఆలోచిస్తే.. ఏ కోణంలోనూ ఒక్క ఓటు కూడా కలవదు కదా అన్న అభిప్రాయ రాజకీయాలపై ఓనమాలు తెలిసిన వారికీ వస్తుంది. పైగా ఆ రెండు పార్టీలు ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తాయన్న అభిప్రాయానికి జనం వస్తారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న దళిత, ముస్లింల ఓటర్లు .. మోదీ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ వైపు అనుమానంగా చూసే ప్రమాదం ఉందంటున్నారు.
కాంగ్రెస్‌కు మరింత మేలు జరుగుతుందా ?
బీఆర్ఎస్ తమతో కలవడానికి ప్రయత్నించింది అని చెప్పడం ద్వారా డైలమాలో ఉండే ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటరును కూడా కాంగ్రెస్ వైపు నెట్టినట్లవుతుందని చెబుతున్నారు. అంటే బీఆర్ఎస్ నష్టపోతుంది. బీజేపీకి లాభం లేదు. మరి ఎవరికి లాభం. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అప్పటికే.. తాము ముందు నంచచి చెబుతున్నది నిజమేననే వాదన ప్రారంభించారు. ఇటీవల బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ కు మేలు చేసేలా ఉన్నాయన్న భావన వస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న సంజయ్ ను మార్చడంతో పాటు కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోలేకపోవడం.. కవితను అరెస్టు చేయకపోవడం వంటి అంశాల ద్వారా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టికి ఊపిరి పోశారు. ఇప్పుడు కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు బయటపెట్టిన విషయాల ద్వారా మరోసారి కాంగ్రెస్ పార్టకి మేలు చేశారన్న అభిప్రాయం సహజంగానే వస్తోంది.
కానీ రాజకీయాల సమీకరణాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. మోదీ మాటల వెనుక వ్యూహం ఏమిటో తేలాలంటే.. కొంత కాలం రాజకీయ పరిణామాలను గమనించాల్సిందే.