TDP Selfie Challenge : సెల్ఫీ చాలెంజ్‌లతో చంద్రబాబు, లోకేష్ విమర్శలు - వైఎస్ఆర్‌సీపీ కౌంటర్ ఎలా ఇవ్వబోతోంది ?
టీడీపీ అగ్రనేతల సెల్ఫీ చాలెంజ్‌కు వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది ? వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు ఏం ప్లాన్ చేయబోతున్నారు ?
TDP Selfie Challenge : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జోన్ -4 సమావేశంలో పాల్గొనేందుకు నెల్లూరు వెళ్లిన సమయంలో అక్కడ తమ ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి సీఎం జగన్‌కు సవాల్ చేశారు. తమ హయాంలో ఇన్నిఇళ్లు కట్టామని మీ హయాంలో ఏం కట్టాలో చెప్పాలన్నారు. ఇది వైరల్ అయింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ దాదాపుగా ప్రతీ రోజూ ఇలాంటి సెల్ఫీ చాలెంజ్‌లు విసురుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి చాలెంజే చేయడంతో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ ఈ సవాళ్లకు ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
యవగళంలో లోకేష్ వరుస సెల్ఫీల చాలెంజ్ !
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ భిన్నమైన పంథాలో వెళ్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికిసెల్ఫీల చాలెంజ్ ను ఎంచుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఘాటుగా విమర్శించడానికి స్పీచ్‌లలో ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో పాదయాత్రలో తనకు ఎదురుపడిన అంశాలు, ప్రజల కష్టాలకు ప్రభుత్వం కారణం ఎలాగో వివరిస్తూ సెల్ఫీలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నారు. ఇవి వైరల్ అవుతున్నాయి. తాను తీసుకు వచ్చిన పరిశ్రమను చూపించి ఆ పరిశ్రమ ముంతు సెల్ఫీ దిగుతున్న లోకేష్.. జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఒక్క పరిశ్రమ విషయంలో అలా సెల్ఫీ తీసుకుని చూపించాలని సవాల్ చేస్తున్నారు, ఇలాంటి సెల్ఫీ చాలెంజ్ లు ప్రతీ రోజూ ఉంటున్నాయి.
ప్రభుత్వ వైఫల్యాలు కనిపించేలా సెల్ఫీల వ్యూహం !
ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేయడానికి టీడీపీ అగ్రనేతలు ఈ సెల్ఫీల వ్యూహం అమలు చేయడం.. ప్రస్తుత రాజకీయంలో సోషల్ మీడియా అత్యంత కీలకంగా మారింది. పాదయాత్రలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టాలని ప్రత్యేకంగా ప్రయత్నిస్తూండటంతో ఇలాంటిసెల్ఫీ చాలెంజ్‌లకు కొదవ ఉండటం లేదు. కనీస సౌకర్యాలు అందించలేకపోతున్న ప్రభుత్వం బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోందని ఓ బెల్ట్ షాపు వద్ద లోకేష్ సెల్ఫీ తీశారు. ఫిష్ ఆంధ్రా పేరుతో ఏర్పాటు చేసిన దుకాణాలు మూతపడ్డాయని చూపించారు. అలాగే తాము తీసుకు వచ్చిన పరిశ్రమల ముందు సెల్ఫీలు దిగి ఇలాంటి పరిశ్రమల్ని ఎన్ని తీసుకు వచ్చారో వాటి ముందు సెల్ఫీ దిగి చూపించాలని సవాల్ చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు తాము సాధించిన విజయాలను కూడా… హైలెట్ చేస్తూ సెల్ఫీ చాలెంజ్‌లను లోకేష్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే ప్రారంభించారు. .ఇదే పని ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు కూడా చేసే అవకాశం ఉంది.
వైఎస్ఆర్‌సీపీ ఎలా కౌంటర్ ఇవ్వబోతోంది ?
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియాలో వెనుకబడిపోతే.. ప్రత్యర్థి పార్టీకి సరైన కౌంటర్ ఇవ్వకబపోతే.. తేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా సైన్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా స్ట్రాటజిస్టులు పని చేస్తూంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సెల్ఫీ చాలెంజ్‌కు వైఎస్ఆర్‌సీపీ అగ్రనాయకత్వం స్థాయిలో కౌంటర్ రావాల్సి ఉంది. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కువగా ఫేక్, మార్ఫింగ్ పోటోలు వేసి ట్రోల్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కావని...నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన కళ్ల ముందు కనిపించే అభివృద్ధిని చూపించాలంటున్నారు. అందుకే వైఎస్ఆర్‌సీపీకి కూడా రిప్లయ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎలా కౌంటర్ ఇస్తారన్నది సస్పెన్స్‌గా మారింది.