V V Vinayak : వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా వినాయక్ - ఆ ఇద్దరు నిర్మాతలదే భారం !
YSRCP : వి వి వినాయక్ రాజమండ్రి ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. ఆర్థిక కారణాలతో వెనుకడుగు వేసినా ఇద్దరు నిర్మాతలు ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరంటే ?
VV Vinayak to contest as Rajahmundry MP : మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ కు రాజమండ్రి ఎంపీ టికెట్ ఖాయం చేసింది వైసీపీ. ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. నిజానికి 2014 ఎన్నికల నుండి వినాయక్ ను ఎన్నికల బరిలో దింపే ప్రయత్నం చేస్తూ వస్తోంది వైసీపీ. అయితే ఆయన మాత్రం సున్నితంగానే తిరస్కరిస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం రాజమండ్రి ఎంపీ గా పోటీలో నిలపాలని వైసీపీ వినాయక్ పై ఒత్తిడి తెచ్చింది . కానీ ఎన్నికల ఖర్చు దృష్ట్యా ఆయన పోటీ తనవల్ల కాదని చెప్పేసినా వినాయక్ కు సీట్ ఇవ్వండి మిగిలినవి మేము చూసుకుంటాం అంటూ పార్టీ అధ్యక్షుడు జగన్ కు ఇద్దరు నిర్మాతలు హామీ ఇచ్చారని దానితో రాజమండ్రి ఎంపీ టికెట్ ఆయనకే కన్ఫర్మ్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి
ఎవరా ఇద్దరు నిర్మాతలు ?
సినీ ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాపుల తో సంబంధం లేని స్టార్ డైరెక్టర్ గా వినాయక్ కు పేరుంది. అటు మెగా ఫ్యామిలీ కీ.. ఇటు నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు గా వినాయక్ పేరు చెబుతారు. ఆయనతో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్న కొడాలి నానీ సాంబ సినిమా తీస్తే టీడీపీ లో గెలిచినా వైసీపీ అనుబంధ సభ్యుడు గా కొనసాగుతున్న వల్లభనేని వంశీ అదుర్స్ సినిమా తీశారు. దర్శకుడు నిర్మాతల సంబంధం కన్నా వీరి మధ్య ఫ్రెండ్స్ అనే బాండింగ్ చాలా ఎక్కువ. దానితో ఎలాగైనా వినాయక్ ను ఎంపీ గా చెయ్యాలనే దాన్ని ఆశయం గా పెట్టుకున్నారు ఈ ఇద్దరు ఫ్రెండ్స్. ఈ వరుస లోనే జగన్ కు వినాయక్ గెలుపు బాధ్యత తమదని చెప్పి సీటు కన్ఫర్మ్ చేయించినట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లోనే వినాయక్ కుటుంబం
ఒకప్పటి పశ్చిమ గోదావరి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చాగల్లు గ్రామం అసెంబ్లీ పరంగా కొవ్వూరు నియోజక వర్గం లో ఉంది. చాగల్లు కు చెందిన వి.వి.వినాయక్ తండ్రి గండ్రోతు కృష్ణారావు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. కొవ్వూరు SC నియోజక వర్గం కావడం తో అక్కడ పోటీ చెయ్యడం వీలు కాదు .. కాబట్టి వినాయక్ స్టార్ డైరెక్టర్ అయ్యాక తన తండ్రి నీ చాగల్లు గ్రామ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా గెలుపొందించారు. ఆయన మృతి చెందాక ఒకానొక దశలో వినాయక్ సోదరుడు గండ్రోతు సురేంద్ర తో తణుకు లేదా తాడేపల్లి గూడెం నుండి పోటీ చేస్తారని 2019 ఎన్నికల సమయం లో ఊహాగానాలు చాలా బలంగా వినిపించాయి. వినాయక్ ను టీడీపీ లోకి ఆహ్వానించే ప్రయత్నాలు కూడా గట్టిగానే సాగాయి. 2019 ఎన్నికల్లో రాజమండ్రి వైసీపీ తరపున రాజమండ్రి ఎంపీ గా పోటీ చేసిన భరత్ రామ్ తండ్రి కూడా వినాయక్ ఇంటికి వెళ్ళి మరీ ఆ ఫ్యామిలీ మద్దతు పొందారు. ఇప్పుడు వినాయక్ నే స్వయంగా పోటీలోకి దించుతుండడం తో భరత్ కు రాజమండ్రి అసెంబ్లీ కేటాయించారు. వినాయక్ కంటే ముందు నుండీ ఆయన తండ్రి కృష్ణారావుకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మంచి పలుకుబడి ఉంది. దానితో ఆయన గెలుపు ఈజీ నే అనీ..మిగిలిన వ్యవహారాలు మేము చూసుకుంటాం అని నాని..వంశీ లు జగన్ కు చెప్పడం తో రాజమండ్రి సీటు వినాయక్ కే కేటాయిస్తున్నారు సీఎం జగన్ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..
కేరళలో వి వి వినాయక్ పూజలు
ఎక్కడ షూటింగ్ లో ఉన్నా సంక్రాంతి కి స్వగ్రామం చాగల్లు వచ్చే వినాయక్ ఈ సారి మాత్రం కేరళ వెళ్లినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా సినీ దర్శకత్వానికి దూరం గా ఉంటున్న ఆయన రాజకీయ రంగప్రవేశానికి ముందు కొన్ని ప్రత్యేక పూజల కోసం కేరళ లోని దేవాలయాలకు వెళ్లినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.