Vijayashanti: పార్టీలో ప్రాధాన్యం లేదు - బీజేపీ నేతల తీరుపై విజయశాంతి అసంతృప్తి !
పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని విజయశాంతి బీజేపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు.
Vijayashanti : తెలంగాణ బీజేపీ నేతలకు తనకు మాట్లాడే చాన్సివ్వడం లేదని ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్‌కు.. పార్లమెంటరీ బోర్డుతో పాటు ఎన్నికల కమిటీలోనూ చోటు దక్కిన కారణంగా బీజేపీ కార్యాలయంలో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమానికి విజయశాంతి హాజరయ్యారు. అయితే ఆ తర్వాత కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడిన విజయ శాంతి.. తాను అసంతృప్తిగా ఉన్నానని పరోక్షంగా వెల్లడించారు. తాను అసంతృప్తిగా ఉన్నానో లేదో మా పార్టీ నేతల దగ్గర క్లారిటీ తీసుకోండని సలహా ఇచ్చారు. తనను ఎందుకు మాట్లాడనివ్వడం లేదో తెలియడం లేదన్నారు. పార్టీ తన సేవలను ఉపయోగించుకోవాలనుకుంటుందో లేదో స్పష్టత లేదన్నారు.
పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత కోసం విజయశాంతి ఎదురు చూపులు
పార్టీకి తన సేవలు అవసరం అయితే తాను సిద్దంగా ఉన్నాననని విజయశాంతి స్పష్టం చేశారు. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని.. ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న విజయశాంతి .. ఆ పార్టీపై అసంతృప్తితో గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు. మొదట్లో కొన్ని రోజులు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. తర్వాత ఆమె సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ కేసీఆర్ నిర్ణయాలపై విమర్శలు చేయడం మినహా పెద్దగా తెర ముందుకు రావడం లేదు. పార్టీ కార్యాలయంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు.
తనకు రాను రాను ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆందోళన
ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో బీజేపీ నేతలందరూ ఏఏ సీట్లలో పోటీ చేయాలో ఖరారు చేసుకుంటున్నారు. అయితే విజయశాంతి విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఆమె కంటూ ప్రత్యేకంగా నియోజకవర్గం లేదు. టీఆర్ఎస్‌లో ఉండగా మెదక్ పార్లమెంట్.. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆమె మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ మెదక్ నుంచి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత మళ్లీ ఆమె మెదక్ వైపు చూడలేదు. పైగా అక్కడ టిక్కెట్ ఆశించే నేతలు ఎక్కువగా ఉన్నారు.
ఇటీవల పెద్దగా బీజేపీ కార్యక్రమాల్లో కనిపించని విజయశాంతి
విజయశాంతి బీజేపీలో చేరడంలో కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్ కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం వారిద్దరూ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా.. బీజేపీ అత్యున్నత కమిటీల్లో లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం విజయశాంతిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని విజయశాంతి బాధపడుతున్నారు. బీజేపీ అసంతృప్తిపై బీజేపీ నేతలు ఆమెతో చర్చించే అవకాశం ఉంది. విజయశాంతి మొదట బీజేపీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత తెలంగాణ తల్లి అనే పార్టీని పెట్టారు. టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ బీజేపీలో చేరారు.