Undavalli Arun Kumar : ఏపీలో మూడు పార్టీలూ బీజేపీకే మద్దతు - తనను బెదిరిస్తున్నారని ఉండవల్లి ఆవేదన !
ఏపీ రాజకీయ పార్టీలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. అందుకే రాష్ట్ర సమస్యలపై ఎవరూ పోరాడటం లేదన్నారు.
Undavalli Arun Kumar : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ పరస్పరం విమర్శించుకుంటున్నాయి కానీ బీజేపీ జోలికి వెళ్లడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు . బీజేపీ విషయంలో వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ, జనసేన ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని అందుకే.. విభజన హామీల పరిష్కారం జరగడంలేదన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు బీజేపీలో చేరుతున్న రాజకీయ నాయకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలవరం పూర్తవుతుందన్న నమ్మకం లేదు !
పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను చంద్రబాబు తీసుకోవడంపై జగన్ విమర్శలు చేశారని.. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారని ఆయన ప్రస్నించారు. ప్రాజెక్ట్ అంటే.. డ్యాం మాత్రమే కాదని... కనీరం రూ. ముఫ్పై వేల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అందుకే పోలవరం నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపడం లేదన్నారు. కనీసం ప్రాజెక్ట్ పూర్తి చేయకపోయినా.. 41 మీటర్లు ఆనకట్టగా అయినా అభివృద్ధి చేయాలని ఉండవల్లి సూచించారు.
మతం విషయంలో బీజేపీ సక్సెస్
బీజేపీలో వరుసగా చేరికలు జరుగుతూండటంపై ఉండవల్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదువుకున్న వాళ్లు కూడా సంకుచితంగా వ్యవహరిస్తున్నారని .. కాంగ్రెస్, ఇతర పార్టీల వారు బీజేపీలో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయిన బీజేపీ.. మతం విషయంలో మాత్రం సక్సెస్ అయిందన్నారు. బీజేపీ ఐడియాలజీ ఏమిటో తెలియకుండా.. పదవుల కోసం అందరూ బీజేపీలో చేరుతున్నారని ఉండవల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీకి ఒరిగిందేమీ లేదని మా ఓట్లేసిన వాళ్లకు అన్నీ చేసేద్దాం.. ఓట్లేయని వాళ్లను పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా జగన్ పాలన ఉందన్నారు. ప్రజలను వైసీపీ మోసం చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు !
ప్రతిపక్ష పార్టీల నేతల ఆస్తులు హైదరాబాద్‌లో ఉండటం వల్లనే విభజన సమస్యల విషయంలో పోరాడటం లేదని ఉండవల్లి విమర్శించారు. హెరిటేజ్ హెడ్ ఆఫీస్ ... భారతి సిమెంట్ కార్పొరేట్ ఆఫీస్ అన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. ఇలాంటి విషయాలను చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అందుకే మీడియా సమావేశాలు తగ్గించానన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తాను ఇలాంటి చెబితే... విమర్శించేందుకైనా వివరణ ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు అధికార పార్టీ నేతలు స్పందించడం లేదన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తనను కొంత మంది బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.