2024 ఎన్నికల్లో పొత్తుల ఫార్ములా ఇదేనా? దీనికి టీడీపీ ఓకే చెబుతుందా?
ఏపీలో సొంతంగా బలపడాలని బీజేపీ, జనసేన వ్యూహాలు రచిస్తున్న టైంలో టీడీపీతో పొత్తు కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.
పవన్ కల్యాణ్ స్పీచ్‌లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో టర్న్ తీసుకుంది. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో మరింత బలపడాలని బీజేపీ, జనసేన వ్యూహాలు రచిస్తున్న టైంలో కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. దానికి టు ప్లస్ టు ప్లస్ వన్ ఫార్ములా తెరపైకి తీసుకొస్తున్నారు కొందరు విశ్లేషకులు.
2014లో ఈ కాంబినేషన్ పొలిటికల్ తెరపై కనిపించినా... అప్పటికి జనసేన పోటీ లేదు. బీజేపీ నామమాత్రంగా ఉండేది. అందుకే కలిసి పోటీ చేయడం చాలా ఈజీ అయ్యింది. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా ఒంటరిగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తనకున్న ఫ్యాన్ బేస్, ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బలమైన పార్టీగా నిలబడాలని శ్రమిస్తున్నారు పవన్ కల్యాణ్. అందుకే ఈసారి సీట్ల పంచాయితీ, పొత్తుల పితలాటకం మామూలుగా ఉండబోదనే విశ్లేషణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ చిక్కు ముడిని మూడు పార్టీల అధినాయకత్వం ఎలా విప్పుతుందనే డిస్కషన్ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.
జనసేన అధినేత పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో మండల, కమిటి సమావేశాల్లో చేసిన ప్రసంగం ఈ చర్చకు దారి తీసింది. జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో కూటమిగా పని చేస్తాయని స్పష్టం చేశారు. పొత్తు లెక్కలు పక్కాగా ఉంటాయని కూడా తేల్చేశారు. తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయాన్ని వారే స్పష్టంగా తమ పార్టీ తరపున చెప్పాల్సి ఉంటుందని అన్నారు. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ భగ్గుమంది. పవన్ టార్గెట్‌గా ఎన్ని కామెంట్స్ చేయాలో అన్నీ చేస్తోంది. విమర్శల డోస్‌ను కూడా పెంచింది. కేవలం పవన్ మాత్రమే పొత్తుల కోసం వెంప్లర్లాడుతున్నారని సెటైర్లు వేస్తోంది. టీడీపీ పంచన చేరేందుకు పవన్ ఆత్రుతగా ఉన్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.
లెక్క పక్కా అయ్యిందని పవన్ చెప్పకనే చెప్పారా?
పొత్తుల వ్యవహరంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్షాలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్షం అయితే ఒక అడుగు ముందుకు వేసి ముందస్తు ఎన్నికలు ఉంటాయని ప్రచారం చేస్తోంది.
ఎన్నికల ఊపు రావటంతో ప్రతిపక్షాలు ఎవరి ఎత్తుల్లో వారు బిజిగా ఉన్నారు. జనసేన పార్టీకి మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే పరిస్థితి కనిపించం లేదు. అందుకే తెలుగుదేశం బలాన్ని వాడుకోవాలని చూస్తోంది. తెలుగు దేశం పార్టీ సింగల్‌గా వెళితే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. కేంద్రంలో అధికారంలో బీజేపిని కలుపుకోవటం ద్వారా లబ్ధి పొందాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. అందుకే మూడు పార్టీలు కలసి లెక్కను పక్కా చేసుకోవాలని చూస్తున్నాయి.
మూడు పార్టీలు ఒక్కటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేసేందుకు ఉపయోగపడుతుందని పవన్ ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ కలయికకు కేంద్ర బిందువైన సీఎం పదవిపై ఎన్నికల తర్వాత నిర్ణయించుకోవచ్చని పవన్ చెబుతున్నారని జనసేన వాదన. అన్ని అనుకున్నట్లుగా సీట్లు మెజార్టి వస్తే మొదటి రెండు సంవత్సరాలు తెలుగు దేశం పార్టీ ముఖ్యమంత్రి సీట్ దక్కించుకుంటుంది. ఆ తరువాత రెండేళ్లు జనసేన పార్టీ, చివరి ఏడాది భారతీయ జనతా పార్టీకి షేర్ చేసేందుకు ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. దీనికి టీడీపీ ఒప్పుకుంటుందా అనేది అనుమానంగానే ఉంది.
ముందే కూతపెట్టిన పవన్ ?
పొత్తుల వ్యవహరంలో పవన్ చేసిన కామెంట్స్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తోంది. జనసేన పార్టీకి చెందిన క్యాడర్‌కు క్లారిటి ఇచ్చే క్రమంలో పవన్ పొత్తుల విషయాలపై ముచ్చటించారు. పార్టీ శ్రేణులు అధికార పార్టీకి చెందిన నేతల మైండ్ గేమ్‌లో చిక్కుకోకుండా జాగ్రత్త పడేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మచిలీపట్టణంలో జరిగిన పార్టీ పదో ఆవిర్భావ సభలో కూడా పవన్ ఇలాంటి కామెంట్‌లనే చేశారు. పార్టీకి చెందిన నాయకులు,కార్యకర్తలు ప్రతిపక్ష పార్టి వేసే ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పొత్తులపై చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దుమారాన్నే రాజేశాయి. సొంత పార్టీకి చెందిన నాయకులను టార్గెట్‌గా చేసుకొని, వారిని అప్రమత్తం చేయటంతోపాటుగా క్లారిటిగా సంకేతాలు పంపాలనుకున్న పవన్ కు వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవటం తెలుగు దేశం పార్టీకి చాలా అవసరం. అలాంటిది చంద్రబాబుకు లేని తొందర జనసేనకు ఎందుకు, పొత్తులపైనే పవన్ ఎందుకు ఆరాటపడుతున్నారంటే, దాని వెనుక కూడా చంద్రబాబే ఉన్నారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల వాదన. సొ పవన్ ముఖ్యమంత్రి కావటాని కన్నా ముందు చంద్రబాబు సీఎం సీట్‌ను అధిరోహించాలనే కుతూహలం ఎక్కువ ఉందని విమర్శిస్తోంది.
Also Read: కర్ణాటక ఫలితాలు ఇతర రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో రిపీట్ కావు: బీజేపీ ఎంపీ జీవీఎల్
Also Read: వంద రోజులు పూర్తి చేసుకున్న యువగళం, కుమారుడు లోకేష్‌తో కలిసి అడుగులేసిన తల్లి భువనేశ్వరి