TDP BUS Yatra : ఏపీని నాలుగు వైపులా కమ్మేస్తున్న టీడీపీ - ఈ ప్రచారం వ్యూహం మాములుగా లేదుగా !
ఓ వైపు నారా లోకేష్ యువగళం పాదయాత్రమరో వైపు చంద్రబాబు పర్యటనలుపార్టీ నేతలను గ్రామాలకు పంపేందుకు బస్సు యాత్రలుప్రచార వ్యూహంలో టీడీపీ దూకుడుగా ఉందా?
TDP BUS Yatra : ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు చంద్రబాబునాయుడు వివిధ కార్యక్రమాల పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. అదే సమయంలో ఇంచార్జులు అందర్నీ ప్రజల్లోకి పంపేందుకు మినీ మేనిఫెస్టోను రెడీ చేసి ఐదు బస్సులను నియోజకవర్గాలకు పంపుతున్నారు. ఇదే క్రమంలో కొన్ని ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకుంటున్నారు. ఓ వైపు సోషల్ మీడియాలో ఉద్దృతంగా ప్రచారం చేస్తూనే క్షేత్ర స్థాయిలో ప్రతి ఒటర్ నూ కలిసేందుకు టీడీపీ పక్కా ప్రణాళికలు వేసుకుంది.
మిని మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం
మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టో ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కు షెడ్యూల్ ప్రకటించింది. పార్టీ నేతలంతా ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనునున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..టీడీపీ మేనిఫెస్టో ఉద్దేశాలను వివరించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 125 నియోజకవర్గాలను ఎంపిక చేసారు. ప్రతీ ఒక్కరికి ఈ పథకాలను తీసుకెళ్లటమే లక్ష్యంగా యాత్ర కొనసాగించనున్నారు. భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో సాగించే ఈ యాత్ర ద్వారా మహానాడులో పూరించిన ఎన్నికల శంఖారావంకు కొనసాగింపుగా ఈ యాత్ర చేపడుతున్నారు.టీడీపీ అమలు చేయబోయే కార్యక్రమాల్ని ప్రతిఒక్కరికీ తెలియచేయడంకోసం బస్సు ప్రచారం ప్రారంభిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.
ప్రజలతో క్యాడర్ కలిసిపోయేలా ప్రత్యేక కార్యక్రమం !
మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలతో..ఆధునిక హంగులతో ప్రత్యేకంగా బస్సులను సిద్దం చేస్తున్నారు. 125 నియోజకవర్గాల్లో మొత్తం 30 రోజులు ఈ బస్సులు ప్రచారం చేయనున్నాయి. ప్రతీ నియోకవర్గంలో స్థానిక కేడర్ కు ప్రాధాన్యత ఇస్తూ..అక్కడి అంశాలను ప్రస్తావిస్తూ పార్టీ మేనిఫెస్టోను(Manifesto) వివరిస్తూ ఈ యాత్ర కొనసాగనుంది. స్థానికంగా ప్రజల సమస్యల పైన పార్టీ నేతలు స్పందించేలా ప్రణాళికలు సిద్దం చేసారు. ప్రతీ వర్గానికి ఈ మేనిఫెస్టో ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న వైఫల్యాను..దోపిడీని వివరిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పల్లెనిద్ర చేయనున్నారు. మేనిఫెస్టోకు ప్రాచుర్యం కల్పించటమే ఈ యాత్ర లక్ష్యంగా స్పష్టం చేస్తున్నారు.ఈనెల 19న చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బస్సుల్ని ప్రారంభించనున్నారు. మేనిఫెస్టెను వివరిస్తూనే ప్రజాభిప్రాయం సేకరించనున్నారు.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రచారం !
ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరిన్ని నిర్ణయాలకు ఈ యాత్ర నాంది కానుంది. మహాశక్తి పేరుతో మహిళలకు చంద్రబాబు ప్రత్యేక పథకాలు ప్రకటించారు. దీని ద్వారా మహిళలకు కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. మహిళ ‘మహా’ శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.టీడీపీ అధినేత చంద్రబాబు మూడు ప్రాంతాల్లోనూ మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ముందుగా 125 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేసారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం కల్పించేలా బస్స యాత్ర ఉండనుంది.
మొత్తంగా ఎన్నికలకు తొమ్మిది నెలలు ఉండగానే టీడీపీ పూర్తి స్థాయిలో ప్రచారంలో దిగింది. ఎక్కడ చూసినా టీడీపీ ప్రచార కార్యక్రమాలే కనిపించేలా ప్లాన్ రెడీ చేసుకుని.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.