(Source: ECI/ABP News/ABP Majha)
T Congress Membership : టీ కాంగ్రెస్ సభ్యత్వంపై వర్గ రాజకీయాల దెబ్బ ! రేవంత్ రెడ్డికి ఇబ్బంది తప్పదా ?
టీ కాంగ్రెస్ సభ్యత్వాల విషయంలో సీనియర్లు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎక్కువ సభ్యత్వాలు చేస్తే రేవంత్‌కు హైకమాండ్ వద్ద పలుకుబడి పెరుగుతుందని వారు పట్టించుకోవడం లేదని భావిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఆ పార్టీ సభ్యత్వాలపై చూపిస్తోంది. డిజిటల్ మెంబర్ షిప్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ నేతలను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యాలను నిర్దేశించారు. సభ్యత్వం తీసుకున్నవారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. లక్ష్యానికి తగ్గట్లుగా సభ్యత్వాలు చేయించిన వారికి ఏకంగా రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని చెబుతున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఫలితం కనిపిస్తోంది. చాలా చోట్ల మందకొడిగా సభ్యత్వ కార్యక్రమం సాగుతోంది. దీనికి కారణం వర్గపోరాటమేనని టీ కాంగ్రెస్ వర్గాలు ఉసూరుమంటున్నాయి.
30 లక్షల సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి !
తెలంగాణ కాంగ్రెస్‌లో సభ్యత్వాలు అనే మాట విని చాలా కాలం అయింది. సీరియస్‌గా డిజిటల్ మెంబర్‌షిప్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కనీసం 30 లక్షల మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్పించాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు మాత్రం సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో సభ్యత్వ నమోదు నత్త నడకన సాగుతోంది. తన నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా 70వేల సభ్యత్వాలు చేయించారు. అక్కడి స్థానిక నాయకులకు రేవంత్ ప్రత్యేకంగా సన్మానం చేశారు. బూత్‌కు ఐదు వందల మందిని ఓటర్లుగా చేర్చారని .. అలాంటి నేతలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తామన్నారు. అయితే ఇతర నియోజకవర్గాలకు రేవంత్ 30వేల టార్గెట్ రేవంత్ రెడ్డి పెట్టారు.
సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో జరగని సభ్యత్వ ప్రయత్నం !
తెలంగాణ కాంగ్రెస్‌లో లీడర్లు ఎక్కువ. సీనియర్లు ఇంకా ఎక్కువ. తమ తమ నియోజకవర్గాల్లో తిరుగులేని పట్టు ఉందని ప్రకటించుకునేవారే ఎక్కువ. అయితే అలాంటి వారి నియోజకవర్గాల్లో ఇప్పుడు అతి తక్కువ సభ్యత్వ నమోదు జరుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా పరిస్థితి దారుణంగా ఉంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తన నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. కానీ ఆయన అసలు సభ్యత్వంపై దృష్టి పెట్టలేదు. ఇప్పటి వరకూ సంగారెడ్డిలో రెండు వేల మంది కూడా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు. అవి కూడా ఆయన చేయించలేదని కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు సొంతంగా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర సీనియర్ల నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు.
సభ్యత్వాలు చేయిస్తే రేవంత్‌కు క్రెడిట్ పోతుందని సీనియర్లు భావిస్తున్నారా ?
తమ నియోజకవర్గాల్లో భారీగా సభ్యత్వాలు చేయిస్తే రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందని సీనియర్ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కువ సభ్యత్వాలు చేస్తే హైకమాండ్ రేవంత్‌నే అభినందిస్తుదని తమను పట్టించుకోదని అనుకుంటున్నారు. రేవంత్ మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సీనియర్లు..వారి వర్గం సభ్యత్వాలకు సహకరించడం లేదని రేవంత్ వర్గం ఓ అభిప్రాయానికి వచ్చింది. అయితే రేవంత్ అనుకూలంగా ఉన్న నేతలు మాత్రం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ వర్గీయులుగా పేరు పడిన వారు ఒక్కో నియోజకవర్గంలో ఇరవై వేల కన్నా ఎక్కువ సభ్యత్వాలు చేయించారు.
పార్టీ హైకమాండ్‌కు సీనియర్లపై రేవంత్ వర్గీయుల ఫిర్యాదు !
సభ్యత్వాల విషయంలో సీనియర్లు పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెడుతున్నారని రేవంత్ వర్గీయులు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర నియోజకవర్గాల్లో సభ్యత్వం జరిగిన తీరును.. సీనియర్ల నియోజకవర్గాల్లో జరిగిన తీరును.. వారు పట్టించుకోని వైనాన్ని ఆధారాలతో సహా హైకమాండ్‌కు పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ సభ్యత్వాలు చేయిస్తే పార్టీకే లాభం కానీ.. రేవంత్ రెడ్డికి లాభం అని అనుకోవడం ఏమిటనేది రేవంత్ వర్గీయుల వాదన.