Dasaoju Sravan : తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ - జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాజీనామా!
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
Dasaoju Sravan : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ వైపు చేరికలు ఉంటే.. మరో వైపు రాజీనామాలు పెరుగుతున్నాయి. కోమిటరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన అంశం ఇంకా చర్చల్లోనే ఉండగానే.. ఈ సారి జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న దాసోజు శ్రవణ్ రాజీనామా బాట పడుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత తనకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధి హోదా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం ఇవ్వడం లేదని ఆయన అనుకుంటున్నారు.
విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఖైరతాబాద్ టిక్కెట్ దక్కదని దాసోజు శ్రవణ్ అసంతృప్తి
దాసోజు శ్రవణ్ గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి వరకూ ఆయనే ఆ నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యతలు చూసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో దాసోజు శ్రవణ్‌కు టిక్కెట్‌పై పార్టీ పెద్దల నుంచి హామీ లభించలేదు. ముషీరాబాద్ నుంచి కూడా ఆయన పోటీకి ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ కూడా అవకాశం కష్టమని సంకేతాలు రావడంతో ఈ సారి తనకు ఎక్కడా పోటీ చేసేందుకు చాన్స్ రాదని భావించి పార్టీ మారాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
పీఆర్పీ నుంచి టీఆర్ఎస్.. అక్కడ్నుంచి కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీలోకి !
దాసోజు శ్రవణ్ ఉన్నత విద్యాధికులు . ప్రజారాజ్యంపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీలో కీలకపాత్ర పోషించారు. కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో..పీఆర్పీ సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ పార్టీలో చాలా కాలం యాక్టివ్‌గా పని చేశారు. కానీ ఎన్నికల్లో టిక్కెట్ లభించలేదు. ఆయన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం లేదని చెప్పి పక్కన పెట్టారు. దీంతో అసంతృప్తికి గురైన ఆయన టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచి వాగ్దాటి ఉన్న దాసోజు శ్రవణ్‌కు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించింది. కానీ ఇటీవల తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తికి గురవుతున్నారు.
రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్న శ్రవణ్
వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. తనకు టిక్కెట్ హామీ లభించడంతో ఆ పార్టీలో చేరాలని దాదాపుగా డిసైడ్ అయ్యారు. అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. పలుమార్లు పోటీ చేసినప్పటికీ ఆయనకు ఒక్క సారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలన్న ఆశయం నెరవేరలేదు.