Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Telangana BC CM Debate: తెలంగాణకు బీసీ సీఎం ఖాయమన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇది సవాలా? కాంగ్రెస్ కొత్త వ్యూహమా?

Telangana Congress Politics: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భవిష్యత్తులో తెలంగాణకు బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు స్వయంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఇస్తారని ఆయన ప్రకటించారు. రేవంత్ రెడ్డి వంటి బలమైన నేత, వచ్చే టర్మ్ కూడా తానే సీఎంనని ప్రకటించుకుంటున్న రేవంత్ రెడ్డి పదవిలో ఉండగానే సీఎం అభ్యర్థి ప్రస్తావన తీసుకురావడం వెనుక ఉన్న అసలు రాజకీయ కోణం ఏంటనే దానిపై రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి.
రేవంత్ నాయకత్వాన్ని బలహీనపరుస్తున్నారా?
ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ఉద్దేశించినేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యంపై గొంతు విప్పుతున్న బీసీ నేతలకు పీసీసీ అధ్యక్షుడి ప్రకటన కొత్త ఊపిరి పోసినట్లయింది. అయితే, ముఖ్యమంత్రి స్థానంలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఉన్న సమయంలో.. అది కూడా పాలన సాగుతున్న మధ్యకాలంలో ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వంపై, సీఎం గ్రాఫ్ పై ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయం రేవంత్ వర్గీయుల నుంచి వ్యక్తమవుతోంది.
రాహుల్ గాంధీ నినాదంతో ఇరుకున పెట్టే ప్రయత్నం
అయితే, ఈ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ హైకమాండ్ పక్కా సామాజిక ఇంజనీరింగ్ వ్యూహం ఉందనేది మరొక బలమైన విశ్లేషణ. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ జనాభా ప్రాతిపదికన భాగస్వామ్యం అనే నినాదంతో కుల గణనను ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణలో జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపే తిప్పుకోవడానికి, బీజేపీ విసురుతున్న బీసీ సీఎం ఆకర్షణీయమైన నినాదానికి చెక్ పెట్టడానికే మహేష్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సాగుతున్న పవర్ పాలిటిక్స్‌కు స్పష్టమైన సంకేతం. రేవంత్ రెడ్డి పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించడానికి , తదుపరి అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీ నాయకత్వాన్ని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రొజెక్ట్ చేయడానికి పీసీసీ వర్గాలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా సొంత బీసీ నేతలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం ద్వారా అసంతృప్తిగా ఉన్న బీసీ ఓటర్లకు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఆశలు కల్పించే ప్రయత్నం ఇది.
కాంగ్రెస్‌లో ముందు ముందు బీసీ కార్డ్ రాజకీయం
ఈ పరిణామాలు ప్రతిపక్షాలైన బిఆర్ఎస్, బిజెపిలకు మంచి పొలిటికల్ వెపన్‌గా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే సీఎం పీఠంపై అసమ్మతి మొదలైంది అని, రేవంత్ రెడ్డిని కుర్చీ దింపేందుకు కాంగ్రెస్ లోపలే కుట్రలు జరుగుతున్నాయనడానికి మహేష్ గౌడ్ కామెంట్సే నిదర్శనం అని ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నాయి. రేవంత్ స్వయంగా బీసీ సీఎంకు మద్దతిస్తారని చెప్పడం ద్వారా అధిష్టానం ఆయనను ఈ అంశంలో ఇరకాటంలో పడేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. బీసీ సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు రాజకీయ ప్రయోజనం చేకూర్చే వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్‌కు, పార్టీ అంతర్గత ఐక్యతకు కత్తిమీద సాములా మారాయి. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఈ బీసీ కార్డ్ రాజకీయాలను ఏ విధంగా అధిగమిస్తారు? పార్టీలో తన పట్టును నిలబెట్టుకుంటూనే బీసీ వర్గాలను ఎలా సంతృప్తి పరుస్తారో వేచి చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















