అన్వేషించండి
Telangana congress: బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పోరాటం: 42% సాధించేనా? | Jantar Mantar వద్ద ధర్నా!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచడమే హస్తినలో ఈ నిరసనకు ప్రధాన కారణం. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులనుతెలంగాణ అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతికి పంపింది.

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నిరసన; బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి డిమాండ్
Source : X.com
Telangana congress :బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ బాట పట్టింది. ఇవాళ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టనుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహా బీసీ నేతలంతా ఢిల్లీలో మకాం వేశారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే ఈ నిరసన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచడమే హస్తినలో ఈ నిరసనకు ప్రధాన కారణం. బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులను రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపింది.
1. తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు (విద్యా సంస్థలలో సీట్ల రిజర్వేషన్లు, రాష్ట్ర సేవల్లో నియామకాలు లేదా పోస్టులు) బిల్లు, 2025 (The Telangana Backward Classes, Scheduled Castes and Scheduled Tribes (Reservation of Seats in Educational Institutions and of Appointments or Posts in the Services under the State) Bill, 2025): ఇందులో విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అసెంబ్లీ ఆమోదించిన రీతిలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. అదే రీతిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది ఈ బిల్లులో పేర్కొన్న ముఖ్యాంశాలు. అంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించి ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం చట్టం చేయాల్సి ఉంది.
2. తెలంగాణ వెనుకబడిన తరగతులు (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్లు) బిల్లు, 2025 (The Telangana Backward Classes (Reservation of Seats in Rural and Urban Local Bodies) Bill, 2025): రాజకీయంగా అంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు. దీన్ని తెలంగాణ శాసనసభ ఆమోదించింది. గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరిగింది.
ఇలా ఈ రెండు బిల్లులపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే పార్లమెంట్‌లో దీనిపై చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ ఇచ్చింది. ఇక ఇవాళ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనుంది. రేపు రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని సీఎం రేవంత్ రెడ్డి, ఇతర బీసీ నేతలు నిర్ణయించారు.
ప్రతిష్ఠాత్మకంగా ఈ నిరసన కార్యక్రమాలను తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 1200 మంది కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ప్రత్యేక రైలులో ఢిల్లీకి తీసుకెళ్లింది. జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేయనుంది. ఇందులో ఏఐసీసీ ముఖ్య నేతలు, ఇండియా కూటమిలోని ఇతర పార్టీ నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్






















