Telangana Political Game : కేంద్ర దర్యాప్తు సంస్థల గుప్పిట్లో తెలంగాణ మంత్రులు ! ఆట మొదలైందా.. ముగుస్తోందా..?
తెలంగాణలో కేంద్ర ద ర్యాప్తు సంస్థలను ఆయుధంగా చేసుకుని బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ యుద్ధం చేస్తున్నాయి. ఎవరిది పైచేయి అవుతుంది ?
Telangana Political Game : వందల మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి.. 40 గంటలపాటు.. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సాగించిన సోదాలు.. చూస్తే..రాష్టంలో రాజకీయం రసకందాయంలో ఉందని అర్థం కాకమానదు. భారతీయ జనతా పార్టీకి భారతీయ రాష్ట్ర సమతికి మధ్య ఏడాదిన్నరగా జరుగుతున్న పోరు ప్రస్తుతం పతాక స్థాయిని దాటి ప్రీ క్లైమాక్సు కు చేరుకుంది. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ.. కేసీఆర్ గళమెత్తిన దగ్గర నుంచి మొదలైన ఆట... ఈడీ, ఐటీ వేటల దాకా వచ్చింది. తెరాసలో బిగ్ షాట్లనే టార్గెట్ చేస్తోంది. ఒక్కో మంత్రిని ఒక్కో కేసు వైపు నడిపిస్తూ.. ఉక్కరి బిక్కిరి చేస్తోంది.
దర్యాప్తు సంస్థలతో హోరాహోరీ తలపడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ !
పదేళ్ల కిందటి గ్రానైట్ కేసులో గుంగులకు ఈడీ నోటీసులు ఇచ్చారు. కేసినో వ్యవహారంలో ఈడీ అధికారులు తలసాని తమ్ముడి వరకూ వచ్చారు. ఇక మిగిలింది ఆయనే. నిన్న టీఆరెఎస్ లో ఆర్థికంగా బలమైన మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దండయాత్రే చేసింది. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎప్పటి నుంచో వాడుతున్నారు. మొత్తం మీద ఈడీ - ఐటీ దాడులతో కేంద్రం పొలిటికల్ వేడిని పెంచుతోంది. ఇటు వైపు నుంచి కూడా తక్కువేం లేదు. ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శినే కార్నర్ చేసే వరకూ వెళ్లింది. ఈడీ, ఐటీ అంటూ.. తనకు బాగా కలిసొచ్చిన ఆయుధాలను కేంద్రం బయటకు తీస్తే.. నేనూ తక్కువ కాదు అంటే కేసీఆర్ సిట్ వేసి సై అంటున్నారు. ఇంకా ఏసీబీని కూడా రంగంలోకి తెస్తారు. కేంద్రానికి సాధనా సంపత్తి, బలం ఎక్కువ. కేసీఆర్ కు ఆయన మనోనిబ్బరం, మానసిక బలం ఎక్కువ. ఎవ్వరూ తక్కువ కాదన్నట్ల సాదుతున్న పొలిటికల్ ఫైట్ ప్రజానీకానికి పసందుగా కనిపిస్తోంది.
కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు ఆడుతున్న రాజకీయం కాదు.. నిజమైన పోరాటమే !
కిందటి ఎన్నికలకు ముందు... ఆ తర్వాత కూడా కేసీఆర్ కేంద్రంతో మంచి సంబంధాలే నడిపారు. రాష్ట్రంలో బీజేపీతో ఎలాంటి బేధాలున్నా.. కేంద్రంతో మాత్రం ఆ రిలేషన్ కొనసాగించారు. కానీ ఎప్పుడైతే.. ఇక్కడ బీజేపీ ఎదగడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందో అప్పుడే చెడింది. జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీజేపీ హవా పెరగడం.. ఈటెల రాజేందర్ ను పార్టీ లో చేర్చుకుని దెబ్బకొట్టడం... దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఇవన్నీ రెండు పార్టీలను అనివార్యంగా దూరం చేశాయి. కేసీఆర్ కు కాంగ్రెస్ కన్నా బీజేపీ ప్రథమ శత్రువు అయిపోయింది. నిన్నా మొన్నటి వరకూ ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే.. ప్రజల ముందు శత్రువుల్లా నటిస్తున్నాయనే ఓ వాదనుండేది. ఇప్పుడు అది కూడా క్లియర్ అయినట్లే.
దూకుడులో ఎదురుదెబ్బలు తిన్న బీజేపీ -చాన్స్ అందుకున్న కేసీఆర్
తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో ప్రధానమైన అపోనెంట్ తానే అని చాటడం కోసం... బీజేపీ ఓ ఉపఎన్నికను అనివార్యంగా తీసుకొచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో గెలిచి.. ఇక కాంగ్రెస్ ను పక్కకు నెట్టి.. తానే అనే అజెండా సెట్ చేయాలనుకుంది. దానికి సమాంతరంగా టీఆరెఎస్ ను వీక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అందులో మొదటిది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరును ఇక్కడ బీజేపీ నాయకులు ప్రస్తావించడం. ఎక్కడా కేసులో పేరు లేకపోయినప్పటికీ .. పదే.. పదే ఆమె పేరు తీసుకొస్తున్నారంటే.. బహుశా ఆ విషయాన్ని ట్రంప్ కార్డ్ లా వాడటానికి ప్రయత్నం చేస్తారన్నది అర్థం అవుతోంది. ఈ లోగా మీరు మా చేతిలో ఉన్నారని ఇండికేషన్ ఇస్తున్నారన్నమాట. కాకపోతే.. ఇక్కడ బీజేపీ ఊహించనవి రెండు జరిగాయి. ఒకటి.. కచ్చితంగా గెలుస్తామనుకున్న మునుగోడులో ఓడిపోవడం.. అదే స్పీడులో తెరాస ఎమ్మెల్యేలకు ఎర వేయడం కోసం వేసిన స్కెచ్ లో కొంతమంది ఇరుక్కుని.. బీజేపీ పేరు బయటకు రావడం. ఈ విషయంలో కేసీఆర్ వీళ్లని గట్టిదెబ్బే కొట్టారు. దొరికిన వాళ్లు బీజేపీ వాళ్లు కాకపోయినా.. ఇందులో బీజేపీకి ఇన్వాల్వ్ మెంట్ ఉందనే విషయాన్ని కేసీఆర్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. బీజేపీ నేతలతో దొరికిన రామచంంద్ర భారతి వంటి వారు.. బీజేపీ లో కీలక నేతలుగా ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్, తుషార్ వంటి నేతల పేర్లను టీఆరెఎస్ బయటకు తెచ్చింది. అంతటితో ఆగకుండా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి.. నోటీసులు కూడా పంపింది.
"సిట్" అనే ఆయుధంతో బీజేపీతో అమీ తుమీ తేల్చుకునే దిశగా కేసీఆర్ !
ఢిల్లీ లిక్కర్ స్కీమ్ లో తన కూతురు పేరను చేర్చి.. పార్టీలో చేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేశారని కేసీఆర్ స్వయంగా చెప్పారు. అంటే బీజేపీ వేస్తున్న ఎత్తులకు పై ఎత్తుగా ఫామ్ హౌస్ కేసును వాడుకున్నారా.. లేక నేరుగా ఢిల్లీని ఢీ కొడదాం అనుకున్నారో తెలీదు కానీ.. కేసీఆర్ అయితే పెద్ద సాహసమే చేశారు. ఫామ్ హౌస్ టేప్సులో దొరికిన దాని ప్రకారం ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అలా మార్చగలిగిన బీజేపీకి.. ఓ రకంగా తెలంగాణ గట్టి ఎదురుదెబ్బనే కొట్టింది. ముఖ్యంగా ఫామ్ హౌస్ టేపుల్లో పార్టీ నేతల పేర్లు రావడం... పెద్ద వాళ్ల ప్రస్తావనలు ఆ పార్టీని బాగానే ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. అయితే అంత ఈజీగా వదిలేస్తే అది బీజేపీ ఎందుకవుతుంది... అందుకే దెబ్బకు దెబ్బ అన్నట్లుగా మరింత దాడులు పెరిగాయి. చివరకు ఈ ఆట ఎక్కుడకు వెళ్లిందంటే.. పొలిటికల్ టార్గెట్లే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈడీ వర్సెస్ సిట్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రెండూ ఎక్కడా తగ్గడం లేదు. సిట్ అధికారులు నోటీసులు మీద నోటీసులు ఇస్తున్నారు. రాకపోతే... లుక్ అవుట్ ఇచ్చేవరకూ వెళ్లారు.
బీజేపీని కట్టడి చేస్తే కేసీఆర్‌కు తిరుగులేనట్లే !
ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ , మహరాష్ట్ర , తమిళనాడు, కర్ణాటక, కేరళ వరకూ బీజేపీ తన ఆట తాను ఆడింది. కొన్ని చోట్ల ప్రభుత్వాలను కూల్చగా.. ఇంకొన్ని రాజకీయంగా పె చేయి సాధించింది. కానీ తెలంగాణలో వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి ఈ స్థాయిలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన వారు లేరంటూ కొంతమంది జాతీయ మీడియా ప్రతినిధులు కూడా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు ద్వారా బీజేపీపై మమత లాంటి వాళ్లు పై చేయి సాధించారు కానీ.. ఇలాగ ఆ పార్టీని నేరుగా ఇరికించింది.. కేసీఆర్ ఒక్కడే. అందుకే బీజేపీ తనకున్న అస్త్రాలన్నింటినీ బయటకు తీసింది. నలువైపులా కమ్మేస్తోంది. నలుగురుని ఇప్పటికే ఇరికించేసింది. ఇంకొందరి పేర్లను లీక్ చేసి భయపెడుతోంది. ఇటు ఇక్కడా తగ్గడం లేదు. బీజేపీ లాగే... ఎమ్మెల్యేల కేసులో ఇంకొందరి పేర్లను లీక్ చేసినా చేయొచ్చు. అందుకే రాజకీయ పండితులకు కూడా ఆట మొదలైందా... ముగుస్తోందా.. తెలీడం లేదు. ఏదైనా కానీ.. అత్యంత శక్తివంతమైన కేంద్రాన్ని కేసీఆర్ గట్టిగానే ఎదిరిస్తున్నారు. టీఆరెస్ ను బీఆరెఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని కేసీఆర్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఆటలో కనుక ఆయన గెలిస్తే... నేషనల్ పాలిటిక్స్ కు మంచి లాంచింగ్ పాడ్ దొరికినట్టే..!