Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
Transgender Reservation : తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. 9 కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించారు. ఇక హిజ్రాల్లో మార్పు వస్తుందా?

Hyderabad transgender HYDRAA commandos: హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా నకిలీ హిజ్రాలు, క్రాస్ డ్రెస్సర్లు శుభకార్యాలు, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి బరితెగించి దందాలు చేయడం, అసభ్యకర ప్రవర్తనతో బెదిరించి డబ్బులు వసూలు చేయడంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అదే సమయంలో, సమాజంలో వివక్షకు గురవుతున్న నిజమైన ట్రాన్స్‌జెండర్లను నేర మార్గం లేదా భిక్షాటన నుంచి బయటకు తీసి, వారిని గౌరవప్రదమైన వ్యవస్థలో భాగస్వాములను చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. కేవలం పోలీసుల లాఠీలతో శాంతిభద్రతల సమస్యను తీర్చడమే కాకుండా, వారికి రాజకీయ, సామాజిక సాధికారత కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులుగా అవకాశం
ట్రాన్స్‌జెండర్ల సాధికారతలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఇటీవల ఒక విప్లవాత్మక బిల్లుకు ఆమోదముద్ర వేసింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 కి అవసరమైన కీలక సవరణలు చేస్తూ తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు ను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నూతన చట్ట సవరణ ప్రకారం.. హైదరాబాద్ నగరానికి సంబంధించి కోర్ అర్బన్ రీజియన్ వెలుపల ఉన్న రాష్ట్రంలోని 9 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం వంటి కార్పొరేషన్లలలో ట్రాన్స్‌జెండర్లకు స్థానిక పాలనలో అవకాశం కల్పిస్తారు. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక ట్రాన్స్‌జెండర్‌ను కో-ఆప్షన్ సభ్యుడిగా ప్రభుత్వం నేరుగా నామినేట్ చేయనుంది.
భారతదేశంలోనే ఇది మొదటిసారి
స్థానిక ప్రభుత్వాల చట్టాల్లో ఒక సామాజిక వర్గానికి, అదీ ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్లకు కౌన్సిల్స్ లేదా కార్పొరేషన్లలో చట్టబద్ధంగా కో-ఆప్షన్ సభ్యత్వాలు కల్పించడం భారతదేశంలోనే ఇది మొదటిసారి. నిర్ణయాధికారం ఉన్న స్థానిక పాలకమండళ్లలో వారు కూర్చోవడం ద్వారా తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న ఆవాస, విద్యా, ఆరోగ్య సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. ఉనికి కోల్పోయిన వర్గానికి చట్టసభలు, పాలనా వ్యవస్థల్లో భాగస్వామ్యం కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పాలనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైడ్రా వ్యవస్థలో ట్రాన్స్‌జెండర్లుగా కమాండోలు
కేవలం రాజకీయ ప్రాతినిధ్యానికే పరిమితం కాకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల తెలంగాణ హైడ్రా వ్యవస్థలో ట్రాన్స్‌జెండర్లను కమాండోలుగా నియమించడం, నిరసనలు, ఆక్రమణల తొలగింపు వేళ వారి సేవలను వాడుకోవడం నగరంలో పెద్ద ట్విస్ట్‌గా మారింది. అంతేకాకుండా, ట్రాఫిక్ నిర్వహణ కోసం ట్రాఫిక్ వాలంటీర్లు గా కూడా ట్రాన్స్‌జెండర్లను నియమించి వారికి నిలకడైన వేతనాలు అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లుగా, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అవకాశం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
క్రాస్ డ్రెస్సర్లతో పెద్ద సమస్య
ఒకవైపు క్రాస్ డ్రెస్సర్లు, నకిలీ హిజ్రాల పేరుతో అమాయక ప్రజలను, నవ దంపతులను వేధిస్తున్న ముఠాలపై ఖాకీలు కఠిన చర్యలు తీసుకుంటుంటే.. మరొకవైపు అర్హులైన ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వమే అధికారిక గుర్తింపు, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు ఇవ్వడం వల్ల స్పష్టమైన గీత ఏర్పడుతోంది. కఠినమైన లా అండ్ ఆర్డర్ చర్యలతో పాటు సమాంతరంగా సామాజిక పునరావాసం, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం కల్పించడం తెలంగాణ ప్రభుత్వ దార్శనికతకు అద్దం పడుతోంది. నకిలీ దందాలను అరికడుతూనే, చట్టసభల్లో సవరణల ద్వారా 9 కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ సభ్యులుగా చట్టబద్ధమైన స్థానం కల్పించడం తెలంగాణ మోడల్‌ను దేశంలోనే ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా అమలైతే, నగరంలో హిజ్రాల వేధింపుల సమస్య శాశ్వతంగా రూపుమాసిపోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చునని అంచనా వేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















