పరేడ్ గ్రౌండ్ కాకపోతే ఎల్బీ స్టేడియం- తెలంగాణ విమోచన దినంపై తగ్గేదేలే అంటున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్టీలు సభలు, సమావేశాలతో స్పీడ్ పెంచుతున్నాయ్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్టీలు సభలు, సమావేశాలతో స్పీడ్ పెంచుతున్నాయ్. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా పోటాపోటీ కార్యక్రమాలకు కాంగ్రెస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. సెప్టెంబరు 17న హైదరాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు...కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇప్పటికే రక్షణశాఖ అధికారులకు దరకాస్తు చేసుకుంది. అయితే అదే రోజు పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహించేందుకు...బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు అనుమతి ఇవ్వకపోతే...ఎల్బీ స్టేడియంకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. ఈ నెల 2నే రక్షణ శాఖ అధికారులకు లేఖ రాశామన్న రేవంత్... సభకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వకపోతే...ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. మొదటి ఆప్షన్ పరేడ్ గ్రౌండ్...రెండో ఆప్షన్ ఎల్బీ స్టేడియంను అనుమతి కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నామన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు భద్రత ఉన్న జాతీయ నేతలు వచ్చిపుడు ప్రభుత్వంతో...విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వని పక్షంలో... ఔటర్ బయట కొంగర కలాన్, ఇతర ప్రాంతాల్లో సభ నిర్వహించుకుంటామన్నారు. సభ ఎక్కడ పెట్టినా.. సక్సెస్ చేసేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహిస్తుండటం...దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు వస్తుండటంతో...సభను హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మరోవైపు పరేడ్ గ్రౌండ్స్‌లోనే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే...పరేడ్ గ్రౌండ్ లోనే బీజేపీ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది అక్కడే సభ నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. పరేడ్ గ్రౌండ్ లో సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయ్. ముందుగా దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇస్తుందా లేదంటే బీజేపీ సభకు అనుమతి ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17కు ప్రాధాన్యత ఉంది. నిజాం పాలన అంతమై భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన రోజును...ఒక్కో పార్టీ ఒక్కో విధంగా పాటిస్తోంది. విలీనం, విమోచనం, విద్రోహం లాంటి చర్చలు దీర్ఘకాలంగానే సాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు దీన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. బీజేపీ సెప్టెంబరు 17ను విమోచనా దినం గా పరిగణిస్తోంది. అధికార బీఆర్ఎస్ మాత్రం జాతీయ సమైక్యతా దినంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది.