TDP Mahanadu NTR : టీడీపీ మహానాడుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ! ఎన్టీఆర్ కుటుంబం అంతా తరలి రానుందా ?
తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఈ సారి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను మహానాడు వేదికగానే ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా అందరూ హాజరవుతారని టీడీపీ వర్గాలు ఆశిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ సారి ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సారి అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. ప్రత్యేకతలు కూడా ఎక్కువే ఉండబోతున్నాయి. ఈ సారి మహానాడు వేదికపై ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరూ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు జూమ్ ద్వారానే ఆన్ లైన్ లో మహానాడు జరిపిన టీడీపీ ఈ సారి మాత్రం ఎన్టీఆర్ కుటుంబసభ్యులు , పార్టీ అభిమానులు ,కార్యకర్తలు ,నేతల సమక్షంలో భారీ స్థాయిలో మహానాడును జరుపడానికి సన్నద్ధం అవుతుంది . అధికారం లో ఉండగా విశాఖ లో ఒకసారి ,విజయవాడ లో చివరి సారిగా మహానాడు జరిపిన టీడీపీ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో గత రెండేళ్లుగా ప్రజల సమక్షంలో మహానాడు జరుపలేదు .
రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైన నేపథ్యంలో మహానాడు వేదిక నుండే ఎన్నికల శంఖారావం పూరించాలని టీడీపీ భావిస్తుంది . ప్రతీ ఏడూ తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా మే నెల 27,28,29 తేదీలలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేస్తుంది టీడీపీ . పార్టీ భవిష్యత్ ప్రణాళికలకు ,అంతర్మధనానికి మహానాడు వేదిక గా నిలుస్తుంది . ప్రస్తుతం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు కావడంతో పాటు.. ఎన్టీఆర్ జన్మించి 99 ఏళ్ళు పూర్తి కావొస్తుండడం తో ఆయన శత జయంతి ఉత్సవాలను మహానాడు నుండే మొదలు పెట్టాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి పార్టీ అభిమానుల్లో నూ ,కార్యకర్తల్లోనూ క్రొత్త ఉత్సాహం నింపాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది . ఈ మహానాడు మొదలు వచ్చే మహానాడు వరకూ ఏడాదిపాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చెయ్యడం ద్వారా 2024 ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చెయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారు . అలాగే రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న నందమూరి కుటుంబ సభ్యులను కూడా మహానాడులో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా నందమూరి హరి కృష్ణ కుమారులైన కల్యాణ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ లను మహానాడులో చూడాలని టీడీపీ అభిమానులు కోరుతున్నారు .
ఇటీవల అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తె , చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో ఎన్టీఆర్ కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చింది. వైఎస్ఆర్‌సీపీ నేతల వ్యాఖ్యలను ఖండించింది. ఆ తరహాలోనే ఇప్పుడు టీడీపీ కోసం వారంతా తరలి వస్తారని టీడీపీ అభిమానులు ఆశిస్తున్నారు. అప్పడు ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ కూడా స్పందించారు. తాము రాజకీయాలకు దూరంగా ఉన్నా.. టీడీపీకి దూరంగా ఉండబోమని వారు చెబుతారని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.