Chandrababu: 'రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు రాజధానులు కడతారా?' - బూతులు మట్లాడే వారికే మంత్రి పదవులు ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం
Andhrapradesh News: సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. గుంతలు పూడ్చలేని వారు రాజధానులు కడతారా.? అంటూ సెటైర్లు వేశారు.
Chandrababu Speech In Pamarru Prajagalam Meeting: రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చ లేని వారు 3 రాజధానులు కడతారా.? అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో (Pamarru) ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ జిల్లాలో ఎంతో మంది గొప్ప మహనీయులు పుట్టారని.. అయితే, ప్రస్తుతం ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కల్లా కొందరు నేతలు తయారయ్యారని విమర్శించారు. సీఎం జగన్ బూతులు మాట్లాడే వారికే మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ధ్వజమెత్తారు. రైతును రాజు చేయడమే తన ఉద్దేశమని.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని, సాధారణ పెన్షన్లు కూడా నెలకు రూ.4 వేలకు పెంచుతామని అన్నారు. అలాగే, మహిళలకు నెలకు రూ.1500 అందిస్తామని స్పష్టం చేశారు.
'ఆ బాధ్యత నాది'
అమరావతి రాజధానిగా ఉంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేదని.. రాజధాని పూర్తై ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం వచ్చేదని చంద్రబాబు అన్నారు. 'ఉద్యోగాలు దొరక్క ఇక్కడి యువత హైదరాబాద్ వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. టీడీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ యువతకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తీసుకొస్తాం. జాబు కావాలంటే బాబు రావాలని అంతా ఎదురు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం నా చిరకాల కోరిక. సీఎం జగన్ హయాంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా.?. డీఎస్సీ వేశారా.?. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు. జగన్ కు డబ్బులు కావాలి. నాకు మంచి నేతలు కావాలి. అభివృద్ధికి ఓటు వేస్తారో.?. విధ్వంసానికి ఓటు వేస్తారో.? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రచారం
అటు, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ - జనసేన - కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే చంద్రబాబు ప్రజాగళం సభలు, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ముమ్మరం ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడిగా కలిసి క్యాంపెయిన్ నిర్వహించేలా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రజాగళం మూడో విడతలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఈ నెల 10న తణుకు, నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు.