Chandrababu: 'ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు' - ఓటుతో కలియుగ భస్మాసురుణ్ని అంతం చేయాలని చంద్రబాబు పిలుపు
Srikakulam News: సీఎం జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు మళ్లిందని, పేదలు ఇంకా నిరుపేదలయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. శ్రీకాకుళంలో సోమవారం 'రా.. కదలిరా' సభలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
![Chandrababu: 'ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు' - ఓటుతో కలియుగ భస్మాసురుణ్ని అంతం చేయాలని చంద్రబాబు పిలుపు tdp chief chandrababu slam cm jagan in tdp raa kadiliraa meeting in srikakulam Chandrababu: 'ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు' - ఓటుతో కలియుగ భస్మాసురుణ్ని అంతం చేయాలని చంద్రబాబు పిలుపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/6c77c0a297cf66580a24c9281f6d11901708952365143876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Slams Cm Jagan In Srikakulam Raa Kadilira Meeting: వైసీపీ ప్రభుత్వం ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. శ్రీకాకుళంలో (Srikakulam) సోమవారం నిర్వహించిన 'రా.. కదలిరా' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో అందరూ బాధితులేనని, అందులో తానూ ఉన్నానని అన్నారు. సీఎం జగన్ పాలనలో పేదలు నిరుపేదలు అయ్యారని.. ఆ పార్టీ నేతలు మాత్రం ధనవంతులయ్యారని మండిపడ్డారు. నమ్మి ఓటు వేసిన ప్రజలను జగన్ నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు. 'ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కు మళ్లింది. టీడీపీ హయాంలో 2029 విజన్ రూపొందించాం. 2019లో తాము అధికారంలోకి వచ్చి ఉంటే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రంగా ఏపీ ఉండేది.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
'జగన్ కు బుద్ధి చెప్పాలి'
వైసీపీ హయాంలో తనతో సహా టీడీపీ నేతలందిరిపైనా అక్రమ కేసులు బనాయించారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతలైన అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వంటి నేతలపైనా ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని గుర్తు చేశారు. 'ఒక్క ఛాన్స్ అంటూ అడగ్గా.. నమ్మి ఓటేసిన ప్రజల్ని సీఎం జగన్ మోసం చేశారు. ఇప్పుడు మీ ఓటుతో వారికి తగిన బుద్ధి చెప్పాలి. భస్మాసురుడిలా జగన్ ప్రజల నెత్తిన చేయి పెట్టారు. ఓటుతో కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
'టీడీపీ - జనసేన గెలుపు ఖాయం'
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కరెంట్ ఛార్జీలు సహా అన్నింటి ధరలు పెంచి, ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్.. పేదల వ్యక్తి ఎలా అవుతారని ప్రశ్నించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. అలాగే, యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. అవసరమైతే వర్క్ షాప్స్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.
'ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకుంటాం'
శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా బలహీనవర్గాలు ఉన్నాయని.. ఆర్థికంగా, సామాజికంగా వారిని ఆదుకోవడం టీడీపీ - జనసేన ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. 'బలహీన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసి డిక్లరేషన్ ప్రకటిస్తాం. చెత్తపన్నును ఎత్తేస్తాం. రైతులకు సబ్సిడీలు అందజేస్తాం. సుజల స్రవంతి ప్రాజెక్ట్ వస్తే ఈ ప్రాంతానికి నీళ్ల సమస్య ఉండదు. కానీ, వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. మేము అధికారంలోకి వస్తే ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్ర నీటి సమస్యను తీరుస్తాం. వంశధార - నాగావళి నదులను అనుసంధానం చేస్తాం. పలాసలో ఢిపెన్స్ కోచింగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. నరసన్నపేట పరిధిలోని బొంతు లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కామేశ్వరపేట వద్ద రైతులు ఆశిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును, పలాస - కాశీబుగ్గ రైల్వే ఫ్లై ఓవర్ ను పూర్తి చేస్తాం. విశాఖను గంజాయి, నేరాలకు రాజధానిగా మార్చారు. సీఎం జగన్ కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదు. విశాఖలో రూ.40 వేల కోట్ల భూములు కొట్టేశారు. విశాఖకు వచ్చిన అన్నీ కంపెనీలు పారిపోయాయి. రోడ్లపై గుంతల వల్ల 27 మంది మృతి చెందారు. అయినా, వారికి సంపాదనపై తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదు.' అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)