JC Brothers ED Raids : ఈడీ దాడులపై స్పందించని జేసీ బ్రదర్స్, మౌనం వెనుక కారణం ఇదేనా?
JC Brothers ED Raids : సాధారణంగా ఏ విషయంలోనైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడే జేసీ సోదరులు ఈడీ సోదాలపై మౌనం వహించారు. ఈడీ దాడులపై వారం గడుస్తున్నా నోరు విప్పకపోవడంపై జోరుగా ప్రచారం జరుగుతోంది.
JC Brothers ED Raids : చిన్న విషయాలపై సైతం తీవ్ర స్థాయిలో స్పందించే జేసీ సోదరులు ఇటీవల వారి ఇళ్లలో జరిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలపై మాట్లాడకుండా మౌనం వహించడంతో రాష్ట్రస్థాయిలో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఉన్నట్టుండి జేసీ సోదరుల మౌనవ్రతం వెనుక కారణం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల జేసీ సోదరుల ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది. వీరి స్వగృహంతోపాటు క్లాస్ వన్ కాంట్రాక్టర్ శివ గోపాల్ రెడ్డి ఇంటితో పాటు కార్యాలయంలో కూడా సోదాలు ఏకకాలంలో జరిగాయి. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సాధారణంగా ఆదాయపన్ను శాఖ అధికారులు, అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన అధికారుల దాడులు జరుగుతూ ఉంటాయి. ముందుగా అందరూ అలానే భావించారు. అయితే దాడులు నిర్వహించింది ఈడీ అనగానే అందరి దృష్టి అటు వైపు మళ్లింది.
వారం గడిచినా మౌనం వీడని జేసీ సోదరులు
సాయుధులైన 8 మంది కేంద్ర బలగాలతో దాడులలో పాల్గొనడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న అనంతరం జేసీ దివాకర్ రెడ్డి హుటాహుటిన తాడిపత్రికి బయలుదేరి వచ్చారు. సుమారు 15 గంటల సోదాల అనంతరం కీలక పత్రాలతో పాటు జేసీ సోదరుల మొబైల్ ఫోన్లను అధికారులు తమ వెంట తీసుకుని వెళ్లారు. సోదాలలో భాగంగా ఇంట్లోని లాకర్లు , బీరువాలు, ఫైళ్లను తనిఖీ చేయడంతోపాటు కాంపౌండ్ లో ఉంచిన అన్ని వాహనాల్లో కూడా అణువణువు జల్లెడ పట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వారం గడిచిపోయినా ఇంతవరకు ఆ దాడులపై జేసీ సోదరులు మౌనం వీడక పోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రతి విషయంలోనూ మీడియా ముందుకు వచ్చి తమ వాణిని గట్టిగా వినిపించే వారు. ఈడీ కేంద్ర సంస్థ కావడంతో మాట్లాడేందుకు జేసీ సోదరులు ఇబ్బంది పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
త్రిశూల్ సిమెంట్స్ దుమారం!
సాధారణంగా విదేశాల నుంచి వచ్చే నగదుకు సంబంధించిన వివరాలలో తేడాలు ఉంటే ఈడీ రంగ ప్రవేశం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బినామీ పేర్లపై ఆస్తులు ఉన్నాయన్న అనుమానం వచ్చినప్పుడు కూడా ఈడీ పరిశీలించవచ్చు. గతంలో త్రిశూల్ సిమెంట్ కు సంబంధించిన అంశం దుమారం రేపింది. ఇది కూడా దాడులకు ప్రధాన కారణమై ఉండొచ్చు అన్న అనుమానాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే ఓ జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు గతంతో జేసీ సోదరులను తమ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్న ప్రచారం వెలుగులోకి వస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీని వీడి వచ్చే ప్రసక్తే లేదని జేసీ బ్రదర్స్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా ఈడీని ఉపయోగిస్తున్నట్లు జేసీ సోదరులపై కూడా ప్రయోగించినట్లు మరో చర్చ జోరందుకుంది. జేసీ సోదరులు సోదాలకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేసినా, మీడియాకు వెల్లడించినా ఇబ్బందులు తప్పవని ఈడీ అధికారుల నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలోనే ఈ విషయంపై నోరు మెదపడం లేదన్నది మరో అంశం. ఏదేమైనా అన్ని విషయాలపై కుండ బద్దలు కొట్టినట్లు వ్యవహరించే జేసీ సోదరులు ఈ విషయంపై మౌనంగా ఉండడం మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.