Tekkali Politics : అటు అచ్చెన్న-ఇటు దువ్వాడ, హీటెక్కిన టెక్కలి రాజకీయం
Tekkali Politics : శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం రాజకీయం రసవత్తంగా మారిపింది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో గెలుపుపై వ్యూహరచన చేస్తున్నారు.
![Tekkali Politics : అటు అచ్చెన్న-ఇటు దువ్వాడ, హీటెక్కిన టెక్కలి రాజకీయం Srikakumla Tekkali constituency TDP Ysrcp announced contestants Atchamnaidu duvvada Srinivas DNN Tekkali Politics : అటు అచ్చెన్న-ఇటు దువ్వాడ, హీటెక్కిన టెక్కలి రాజకీయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/27/65efd94914f6f12d9c6544c9a9ccd8251666888328390235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tekkali Politics : రానున్న శాసనసభ ఎన్నికలకి ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ ప్రధాన పార్టీలు ఇప్పటికే నియోజకవర్గాలలో అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించాయి. విభేదాలు ఉన్న చోట్ల నేతలతో మాట్లాడి అభ్యర్థుల విషయంలో అధినేతలు స్పష్టత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంకి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు 2024 ఎన్నికలలో కూడా అక్కడ నుంచే పోటీ చేయడం సుస్పష్టం. వచ్చే శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దువ్వాడ శ్రీనివాసే పోటీ చేస్తారని వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కేడర్ కి స్పష్టత ఇచ్చారు. మరో మాట లేదని శ్రీను పోటీ చేస్తారని టెక్కలిలో వైసీపీ జెండా ఎగురవేయడానికి అంతా ఇప్పటి నుంచే పనిచేయాలని కేడర్ కి సీఎం జగన్ దిశా నిర్దేశం చేసేశారు. దీంతో టెక్కలిలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లు తేలిపోయింది. వారి మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్న దానిపై ఎవరికి వారు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా రెండు సార్లు విజయం
వరుసగా 2014, 2019 ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపొందారు. 2014 ఎన్నికలలో అచ్చెన్నకి ప్రత్యర్ధిగా దువ్వాడ శ్రీనివాసే పోటీచేయగా 2019 ఎన్నికలలో ప్రత్యర్థిగా పేరాడ తిలక్ బరిలో నిలిచారు. అయినప్పటికీ అచ్చెన్న మాత్రం 8 వేలకి పై చీలుకు మెజార్టీతో వరుసగా విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జగన్ వేవ్ తో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ టెక్కలిలో మాత్రం ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. కింజరాపు కుటుంబంపై టెక్కలి నియోజకవర్గ ఓటర్లు మొగ్గు చూపించి అచ్చెన్నాయుడుకే పట్టం కట్టారు. కింజరాపు అచ్చెన్నాయుడు వరుసగా జరిగిన రెండు ఎన్నికలలో టీడీపీ ఓటు బ్యాంకును పదిలం చేసుకున్నారు. 2014 ఎన్నికలలో దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ సీపీ తరపున పోటీ చేయగా టీడీపీ తరపున అచ్చెన్నాయుడు బరిలో నిలిచారు. అప్పటి ఎన్నికలలో అచ్చెన్నకి 81,167 ఓట్లు రాగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కి 72,180 ఓట్లు వచ్చాయి. 8,387 ఓట్ల మెజార్టీతో అచ్చెన్నాయుడు ఆ ఎన్నికలలో గెలుపొందారు. ఆ ఎన్నికలలో టీడీపీకి 50.9 శాతం ఓటు బ్యాంకు రాగా వైకాపాకి 45.67 శాతం వచ్చాయి. 2014లో టీడీపీ అధికారంలోకి రాగా కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించి టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు.
50 శాతం ఓటు బ్యాంకుతో
2019లో జరిగిన ఎన్నికలలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని అచ్చెన్న ప్రచారం చేసి మరోసారి సత్తా చాటారు. 2019 ఎన్నికలలో అచ్చెన్నాయుడుకి 87,658 ఓట్లు రాగా వైకాపా తరపున బరిలో నిలిచిన పేరాడ తిలక్ కి 79,113 ఓట్లు వచ్చాయి. 8,545 ఓట్లతో అచ్చెన్నాయుడు ఆ ఎన్నికలలో గెలుపొందారు. ఆ ఎన్నికలలో టీడీపీకి 50.5 శాతం ఓటు బ్యాంకు రాగా వైకాపాకి 45.6 శాతం వచ్చాయి. 2019 ఎన్నికలలో దువ్వాడ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేయగా ఆయనపై టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2014, 2019 ఎన్నికలలో కూడా అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం నుంచి 8 వేలకి పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో పాటు 50 శాతానికి పైగా ఓటు బ్యాంకును రాబట్టుకోగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కింజరాపు అచ్చెన్నాయుడు తన పట్టును కొనసాగిస్తూ వస్తున్నారు. కింజరాపు కుటుంబ హవాకి గండి కొట్టేందుకు వైకాపా ఇప్పుడు వ్యూహాలను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే టెక్కలి శాసనసభా అభ్యర్థిత్వం కోసం దువ్వాడ శ్రీనివాస్ తో పాటు పేరాడ తిలక్, కిల్లి కృపారాణి వంటి వారు రేసులో ఉన్నా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుగుండా స్పష్టతను ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ కే టెక్కలి టిక్కెట్ అని తేల్చిచెప్పారు.
స్థానికి సంస్థల గెలుపుతో
టెక్కలి నియోజకవర్గానికి దువ్వాడ శ్రీనివాస్ ఇన్ చార్జీగా ఉన్నారు. ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ సీగా అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దువ్వాడ టెక్కలి నియోజకవర్గంలో దూకుడు పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తి యుక్తులను ఉపయోగించి నియోజకవర్గంలో నాలుగు మండలాలలో కూడా వైకాపా మెజార్టీ సర్పంచ్ , ఎంపీటీసీ స్థానాలను దక్కించుకోవడంతో పాటు జడ్పీటీసి స్థానాలను గెలుపొందింది. ఆ బలంతోనే రానున్న శాసనసభ ఎన్నికలలో గెలిచి తీరగలమన్న ధీమాను ఆ పార్టీ వ్యక్తం చేస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఏ పరిస్థితుల్లో ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటామన్న దానిపై మాత్రం వారు ఆలోచనలు చేయడం లేదు. వారిలో వారికి ఉన్న గ్రూపులు గోలను పట్టించుకోవడం లేదు. అందరూ కలిసి పనిచేయాలని అధినేత స్వయంగా చెప్పినా ద్వితీయ శ్రేణి నేతలు ఆ మాటలను తూచా తప్పకుండా పాటిస్తారన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణులలోనే కన్పించడం లేదు. ఏ ఒక్కరికి టిక్కెట్ ఇచ్చినా ఇతరులు పూర్తిగా సహకరించే పరిస్థితి లేదని, నాయకులు సహకరించిన కేడర్ వారికి మద్దతుగా నిలిచే పరిస్థితి లేదన్న మాటలు ఆ నియోజకవర్గంలో బహిరంగంగానే విన్పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఎలా గట్టెక్కగలమన్న ప్రశ్నలు వైకాపాలోనే వ్యక్తమవుతున్నాయి.
రసవత్తంగా టెక్కలి రాజకీయాలు
మరో వైపు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా రానున్న ఎన్నికలలో గెలుపు కోసం తన శక్తియుక్తులను ఒడ్డేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా బిజీబిజీగా ఉన్నా సమయం దొరికినప్పుడల్లా టెక్కలి నియోజకవర్గంలో పర్యటనలను సాగిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలకి అందుబాటులో ఉంటున్నారు. ఆయన నియోజకవర్గంలో ఉంటే పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ కార్యాలయం, క్యాంపు కార్యాలయం కూడా కోలాహలంగా కన్పిస్తుంటుంది. ఆ కుటుంబానికి జిల్లా రాజకీయాలలో ఓ ప్రత్యేకత ఉంది. కేడర్ కి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వారికి చేతనైన సహాయాన్ని అందిస్తూ వారి మనస్సులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో కూడా అచ్చెన్నాయుడు అండ్ టీంకి పూర్తిగా తెలుసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ టెక్కలి రాజకీయాలు రసవత్తరంగా మారడం ఖాయంగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)