టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న అరెస్టు- శ్రేణులు అడ్డుకోవడంతో విడిచిపెట్టిన పోలీసులు!
లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసులో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పోలీసులు విశాఖ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసులో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పోలీసులు ఆయన్ని విశాఖ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఈ మధ్య గన్నవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం, మంత్రులు, ఇతర వైసీపీ లీడర్లపై అయన్న దూషించారని కేసులు రిజిస్టర్ అయ్యింది.
అయ్యన్నపాత్రుడు, బుద్ద వెంకన్న సహా పలువురు నేతలపై కేసులు నమోదు అయ్యాయి. వీటిని దర్యాప్తు చేస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు ఈ ఉదయం అయన్నపాత్రుడిని అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో విశాఖ వచ్చిన ఆయన్ని ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ స్టేషన్ బెయిల్‌పై అయ్యన్న విడుదలయ్యారు.
మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద అయ్యన్నపై కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్టు అయిన కాసేపటికే 41 వన్ ఏ నోటీసు ఇచ్చి తాళ్లపాలెం ఎలమంచిలి హైవేలో పోలీసులు వదిలి పెట్టారు. టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతోనే పోలీసులు నోటీసులు ఇచ్చిన అనకాపల్లి టోల్ ప్లాజా వద్ద విడిచి పెట్టారని ప్రచారం జరుగుతోంది.
అచ్చెన్న ఆగ్రహం
అయ్యన్నపాత్రుడి అరెస్టును టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ప్రజాస్వామ్య మూలాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కక్షతో రగిలిపోతున్నారని ఆరోపించారు. బహిరంగ సభలో అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్‌లో తప్పేముందని ప్రశ్నించారు. అధికార పార్టీ ఏం చేసినా కేసులు పెట్టకుండా కేవలం ప్రతిపక్షాలపైనే కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. రోజూ టీడీపీ లీడర్లపై చంద్రబాబు, లోకేష్‌పై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ సంగతి ఏంటని క్వశ్చన్ చేశారు. ప్రశ్నించే వాళ్లను అరెస్టులు చేస్తే మిగతా వాళ్లు నోరు ఎత్తరని అనుకుంటున్నారని కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమన్నారు.