Sajjala On Gorantla : ఫిర్యాదు లేదు - చర్యలుండవ్ ! గోరంట్ల మాధవ్ విషయంలో సజ్జల క్లారిటీ
న్యూడ్ వీడియో విషయంలో గోరంట్ల మాధవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. అది ప్రైవేటు వీడియోగా చెప్పారు.
Sajjala On Gorantla : వైఎస్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అసలు ఫిర్యాదే రాలేదన్నట్లుగా స్పందించారు. జుగుస్పాకరంగా వీడియోలో ఉందని.. అది తనది కాదని గోరంట్ల మాధవ్ చెబుతున్నారన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రానప్పుడు చర్య తీసుకునే అవకాశం లేదని సజ్జల తేల్చేశారు. అదే సమయంలో అది నాలుగు గోడుల మధ్య జరిగిన ప్రైవేటు వ్యవహారం అని.. అసలు బాధితులు లేకపోయినా మీడియానే ఎక్కువ హడావుడి చేస్తోందన్నారు. సజ్జల స్పందనతో .. గోరంట్ల మాధవ్ చర్యల నుంచి బయటపడినట్లుగానే వైఎస్ఆర్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి.
మార్ఫింగ్ వీడియోగా మాధవ్ ఆరోపణ
గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా ఉన్నట్లుగా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మహిళలను వేధింపులకు గురి చేస్తున్న గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాధవ్ పార్లమెంట్ పరువు తీశారని టీడీపీ నేతలు విమర్శించారు. అయితే ఆ వీడియో లో ఉన్నది తాను కాదని.. తాను జిమ్ చేస్తూండగా తీసిన వీడియోను మార్ఫింగ్ చేశారని మాధవ్ ఆరోపించారు. తాను పోలీసులకు... సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశానన్నారు.
మార్ఫింగ్ కాకపోతే కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయన్న సజ్జల
గోరంట్ల మాధవ్ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత వివాదాస్పదం కావడంతో ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వీడియో మార్ఫింగ్ అని మాధవ్ చెహుతున్నారని మార్ఫింగ్ కాదని తేలితే కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ వీడియో మార్ఫింగ్ అవుతో కాదో పరీక్షలు చేయిస్తున్నారో.. ఎక్కడ చేయిస్తున్నారో స్పష్టత లేదు. అప్పుడే ఆయనపై సస్పెన్షన్ వేటు లేదా.. బహిష్కరణ వేటు వేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే పార్టీ పరమైన సమావేశాలకు ఆయన హాజరవుతూనే ఉన్నారు. దీంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టమైంది.
ఇప్పుడు ప్రైవేటు వీడియో.. నిలబడదన్న సజ్జల
అయితే ముందుగా చెప్పినట్లుగా మాధవ్‌పై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలుపెరిగిపోతూండటంతో సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాము చర్యలు తీసుకునే అవకాశం లేదని.. అది ప్రైవేటు వీడియో అని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చిన మంత్రి అంబటి.. మాజీ మంత్రి అవంతిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న నటుడు ఫృధ్వీపై చర్యలు తీసుకున్నారు. అయితే ఆయన విషయంలో వేధింపులకు గురైన యువతి ఫిర్యాదు చేసింది. దీంతో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అంబటి, అవంతి, గోరంట్ల మాధవ్ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో చర్యలు తీసుకోవడం లేదని సజ్జల పరోక్షంగానే క్లారిటీ ఇచ్చారు.