Rayalaseema Horticulture Hub project : లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ -సీమ రాత మార్చబోతున్న చంద్రబాబు బిగ్ ప్లాన్.. రిలయన్స్ అగ్రీ స్కూల్ కూడా!
AP horticulture project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు రూ. లక్ష కోట్ల వ్యయంతో రాయలసీమ హార్టికల్చర్ హబ్, రిలయన్స్ అగ్రికల్చర్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనుంది.

AP Govt 1 Lakh Crore Rayalaseema plan: ఎడారిగా, కరువు ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమను దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సీమ ముఖచిత్రాన్ని, ఈ ప్రాంత రైతు ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చే లక్ష్యంతో ప్రతిపాదించిన రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు అక్టోబర్ 2న శంకుస్థాపన జరగనుంది. మదనపల్లెలో జరిగే ఈ వైభవ వేడుకలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు.
దాదాపుగా లక్ష కోట్ల పెట్టుబడులు
ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న నిధుల సమీకరణ స్కేల్ చాలా పెద్దది . కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక 'పూర్వోదయ' పథకం కింద వివిధ రూపాల్లో సమకూరే రూ. 40,000 కోట్ల నిధులకు తోడు, మరో రూ. 60,000 కోట్ల మేర ప్రైవేటు పెట్టుబడులను భాగస్వామ్యం చేస్తూ ఏకంగా రూ. లక్ష కోట్ల భారీ నిధుల వ్యయ ప్రణాళికతో ఈ విజన్‌ను అమల్లోకి తెస్తున్నారు. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు పాటు పక్కనే ఉన్న పొరుగు జిల్లాలైన ప్రకాశం, నెల్లూరులను కూడా ఈ హబ్ పరిధిలోకి చేర్చడం దీని విస్తృతికి అద్దం పడుతోంది.
రైతులకు అండగా సమగ్ర ప్రణాళిక
ఒకప్పుడు కేవలం వర్షాధార పంటలు, కరువు సహాయకాలపై ఆధారపడిన రాయలసీమలో నీటి లభ్యత పరిమితం. ఈ సవాలును జయించేందుకు ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరాను క్రమబద్ధీకరిస్తూనే, తక్కువ నీటితో అత్యధిక ఆదాయాన్ని, లాభాలను అందించే ఉద్యాన పంటలు పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు వైపు రైతులను మళ్లించడమే ఈ హార్టికల్చర్ హబ్ ప్రధాన ఉద్దేశం. ఆధునిక మైక్రో ఇరిగేషన్, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు మరియు గ్లోబల్ మార్కెట్ లింకేజీలను కల్పించడం ద్వారా సీమ రైతుల్లో సంపదను సృష్టించే దిశగా ప్రణాళిక రూపుదిద్దుకుంది.
చంద్రబాబు కృషి ఫలితం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో నిరంతరం జరిపిన సమర్థవంతమైన సంప్రదింపుల ఫలితంగానే కేంద్రం నుంచి ఇంతటి భారీ నిధుల కేటాయింపులు సాధ్యమయ్యాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం వ్యవసాయ ఉత్పత్తికే పరిమితం కాకుండా, ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అపారమైన అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల స్థానికంగా ఉండే వేలాది మంది గ్రామీణ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించే వీలుంది. ఇదే వేదికగా రాయలసీమ రూపురేఖలను మార్చే మరో కీలక మైలురాయి పడనుంది. వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు, ఎఐ (AI) ఆధారిత సాగు పద్ధతులు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది.
రిలయన్స్ అగ్రి వర్శిటీ
రిలయన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు కూడా అక్టోబర్ 2న శంకుస్థాపన జరగనుంది. ఇది సీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు అగ్రీ-టెక్ రంగానికి గ్లోబల్ కేంద్రీకృత గుర్తింపును తేనుంది. ఈ లక్ష కోట్ల ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున సానుకూల చర్చ సాగుతోంది. శంకుస్థాపన పూర్తయి, ప్రతిపాదిత లక్ష్యాలు క్షేత్రస్థాయిలో అమల్లోకి వస్తే.. దక్షిణాసియాలోనే ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రంగ రాజధానిగా ఎదిగేందుకు ఈ ప్రాజెక్టు ఒక గ్రేట్ గేమ్ ఛేంజర్‌గా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















