Ravela Kishore Babu : వైసీపీకి మొదటి షాక్ - పార్టీకి రావెల కిషోర్ రాజీనామా
Andhra Pradesh News: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి నేతలు గుడ్ బై చెప్పడం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ వైసీపీకి గుడ్ బై చెప్పారు.
YSRCP Leader Ravela Kishore Resigned: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజుల్లోనే మాజీ మంత్రి రావెల కిషోర్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితిలో ఉన్న ఆయన ఆ తర్వాత రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తన భార్యను కూడా ఆయన పార్టీలో చేర్చారు. బాపట్ల ఎంపీ టిక్కెట్ ఆయనకు లేదా ఆయన భార్యకు ఇస్తారని అనుకున్నారు. కానీ టిక్కెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేశారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.
రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన ఆయన చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. 2014లో తనకు టిక్కెట్ ఇచ్చి.. గెలిపించి మంత్రిని చేశారని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి నుంచి మధ్యలో తప్పించడంతో పాటు తర్వాత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. పార్టీ నేతలతో సఖ్యతగా ఉండకపోవడమే దీనికి కారణం. తర్వాత పలు పార్టీలు మారారు. దురదృష్టవశాత్తూ కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయినందుకు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటానని తెలిపారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని వాపోయారు.
వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు. కానీ, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఆయనను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని ప్రశంసించారు. మందా క్రిష్ణ మాదిగ 40 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అంశం ముగింపునకు వచ్చిందని భావిస్తున్నానని రావెల అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరూ వర్గీకరణకు మద్దతు తెలిపారన్నారు.
2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిశోర్‌బాబు.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన.. కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కొంత కాలం తర్వాత బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రావెల కిషోర్‌బాబు. ఇప్పుడు రావెల కిషోర్ ఏ పార్టీల చేరాలన్నా రెండో సారి ఎంట్రీ ఇవ్వాల్సిందే.