Janasena Kakinada MP Candidate: కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్, ఆపై ఆసక్తికర వ్యాఖ్యలు
Andhra Pradesh Elections 2024: జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన నేతలతో సమావేశంలో ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.
Uday Srinivas Tangella Janasena Kakinada MP Candidate: పిఠాపురం: తాను అందర్నీ కలుపుకుని వెళ్లే రకం మనిషినని, తప్పదు అనుకుంటే తప్పా తాను గొడవకు వెళ్లనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పిఠాపురాన్ని ఎవరైనా భయపెడతా అంటే.. వారికి వ్యతిరేకంగా తాను అడ్డుగోడగా నిలబడతానని చెప్పారు. తనను కట్టడి చేసే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కలిసిన సందర్భంగా ఎన్ని కష్టాలు ఎదురైనా తమ నియోజకవర్గాన్ని కాపాడుకుంటామని చెప్పినట్లు తెలిపారు.
కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్
కూటమి నుంచి జనసేనకు 2 ఎంపీ సీట్లు వచ్చాయి. అందులో భాగంగా కాకినాడ ఎంపీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిని మంగళవారం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా 'టీ టైమ్' ఓనర్ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉదయ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆ స్థానంలో పవన్ బరిలోకి దిగడంతో ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ ఎంపీ సీటు ఖరారు చేశారు. ఉదయ్ తనకు తమ్ముడి లాంటి వాడని, తన విజయం కోసం కూటమి శ్రేణులు సహకారం అందించాలని పవన్ కోరారు. ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ పేరు ప్రకటిస్తూ.. భవిష్యత్తులో తనకు ఎసరు పెట్టవు కదా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశాడని, భారీ మెజార్టీతో అతడ్ని గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పెన్షనర్ల ప్యారడైజ్‌ను గంజాయికి ప్యారడైజ్ చేశారు!
వంగా గీత, సునీల్ మన ద్వారా రాజకీయాల్లోకి వచ్చారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన సునీల్.. తన డ్రెస్ బాగాలేదన్నారని పవన్ తెలిపారు. ఆయన ఓ మంచి వ్యక్తి కానీ.. సరిగ్గా లేని ఓ పార్టీలో ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో జనసేన చెందిన వారిపై దెబ్బ పడితే.. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని వారికి మద్దతుగా అక్కడికి వెళ్లానని పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల్ని తాను కాపాడుకుంటానని, ఒకదెబ్బ పడితే ఊరుకునేది లేదన్నారు.
‘కాకినాడ పెన్షనర్ల స్వర్గం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పెదనాన్న అక్కడ పోస్ట్ మాస్టర్ గా చేశారని, తన బంధువులు చాలా మంది కోనసీమలో ఉన్నారు. అలాంటి ప్రాంతం ప్యారడైజ్ ఫర్ గంజాయిగా మారింది. క్రైమ్ రేట్ పెరుగుతోంది. వీటిని అరికట్టాలంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా ఉండాలి. అందుకే పిఠాపురం నుంచి తాను, కాకినాడ నుంచి ఉదయ్ ని గెలిపించండి. ఉదయ్ అన్ని నియోజకవర్గాలు తిరగాలి. మరో తరం కోసం తాము పనిచేయాలని, ఇప్పుడు పుట్టబోయే బిడ్డలకు 2047లో మెరుగైన అభివృద్ధి చెందిన సమాజం కావాలన్నది ప్రధాని మోదీ ఆకాంక్ష. మోదీ, అమిత్ షా భవిష్యత్తులో తనను ఎంపీగా పోటీ చేయాలని అడిగితే.. ఉదయ్ ని అడిగి తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉదయ్ సీట్లు మార్పిడి చేసుకుంటామని చెప్పాను. అందరి కోసం 4 దశాబ్దాలుగా ఉన్న టీడీపీ, కేంద్రంలో బలమైన బీజేపీ, జనసేన ఓ కూటమిగా ఏర్పడ్డాం. 5 కోట్ల ఏపీ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకుందాం. ఈ రెండు సీట్లతో పాటు జనసేనకు వచ్చిన అన్ని స్థానాల్లో గెలిచి చూపిద్దాం’ అని పవన్ పిలుపునిచ్చారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డైలాగ్ పై..
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఓ సీన్ గురించి పవన్ కళ్యాణ్ వివరించారు. ‘గాజు గ్లాస్ పగిలే సీన్ ఎందుకు అని హరీష్ శంకర్ ను అడిగితే.. మిమ్మల్ని చాలా మంది ట్రోల్ చేస్తారు కానీ వారికి విషయం తెలియాలి. గాజు గ్లాస్ ఎంత పగిలితే అంత పదునెక్కుతుందని హరీష్ శంకర్ డైలాగ్ పెట్టారని చెప్పారు. దశాబ్దం అధికారం లేకున్నా పార్టీ నడపడం అంత ఈజీ కాదు. జనసేన సీట్లు గెలిపిస్తే యావత్ భారతదేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తాం. జాతీయ స్థాయి నాయకులను ఒప్పించి పొత్తు వచ్చేలా చూశా. ఎవరినో తొక్కడానికి రాజకీయాలు చేయడం లేదు, కేవలం నిలదొక్కుకోవడానికి మాత్రమే. పిఠాపురంలో మొదలుపెడదాం, అన్నీ గెలుస్తూ వెళదాం. ఏర్పాటు కానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మన వంతు పదవులు దక్కించుకుందాం. కష్టపడే వారికి ఫలితం దక్కాలి. లక్ష మెజార్టితో గెలిపించాలని’ పవన్ కళ్యాణ్ కోరారు.