Hindupuram MP : హిందూపురంపై గురిపెట్టిన స్వామిజీ- సీట్లు గ్యారంటీ అంటూ ప్రచారం
Hindupuram Lok Sabha Seat : కాకినాడకు చెందిన ఓ స్వామిజీ హిందూపురం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి కచ్చితంగా సీటు వస్తుందని చెప్పుకుంటున్నారు.
Hindupuram Lok Sabha Seat : 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హడావుడి చేసిన ఓ స్వామీజి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని టాక్ నడుస్తోంది. అప్పట్లో ఆయన్ని ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారం జరిగింది. ప్రమాణస్వీకారానికి అంతా సిద్దమైపోయిందని రిజల్ట్స్ రావడమే ఆలస్యమంటూ తెగ ఊదరగొట్టారు అప్పట్లో. అయితే తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు చూసిన తర్వాత ఆయనకు తత్వం బోధపడింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే రాజకీయాలు మన వల్ల కాదని సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వాక్యూమ్ ఉందని దాన్ని సెట్ చేస్తానంటూ యాక్టివ్ అవుతున్నారట. తాను ఇప్పటికీ బీజేపీలో ఉన్నానంటున్న సదరు స్వామి ఎంపీ స్థానంపై గురి పెట్టారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ సాములోరు హిందూపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు సన్నిహితుల వద్దు చెప్పుకుంటున్నారు. హిందపురంలో పోటీ చేయడం ఖాయమని విజయం తనవైపే ఉందని కూడా అంటున్నారు. తాను ఎలా గెలవబోతున్నానో కూడా ఆయన విశ్లేషణలు చేస్తున్నారు.
బీజేపీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నాని... నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు ఆ స్వామి. దానికి బీజేపీ కూడా సానుకూలంగా ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.