Modi Charishma: ఏమాత్రం తగ్గని మోదీ ఛరిష్మా, ప్రతి 10 మందిలో 8 మంది ఆయన వైపే - తేల్చి చెప్పిన రీసెర్చ్
Modi Charishma: మోదీ ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదని మరో సర్వే తేల్చి చెప్పింది. ప్యూ రీసెర్చ్ ఈ మేరకు వెల్లడించింది.
Modi Charishma: భారతీయుల్లో మోదీ పట్ల వైఖరి ఏమాత్రం చెక్కుచెదరలేదని, అది మరింతగా బలపడినట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా వెలువడిన ప్యూ రీసెర్చ్ కూడా ఇదే గుర్తించింది. ప్రతి 10 మంది భారతీయుల్లో 8 మంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ తేల్చింది. 55 శాతం మంది మరింత ఎక్కువ అనుకూలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ బుధవారం తన సర్వే నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర నేతలతో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నట్లు నిర్ధారించింది. 2024 లోనూ మోదీయే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు గణనీయంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
సర్వే ప్రకారం, 10 మంది భారతీయుల్లో ఏడుగురు ఇటీవలి సంవత్సరాలల్లో ప్రపంచంలో భారతదేశ ప్రభావం మరింత బలంగా పెరుగుతున్నట్లు చెప్పారు. మోదీ హయాంలో భారతదేశ భౌగోళిక రాజకీయ బలం పెరిగిందనే అభిప్రాయాన్ని రాజకీయ వర్గాల్లో అంచనా వేస్తున్నారు. దీనికి విరుద్ధంగా, 19 శాతం మంది భారతదేశం బలహీనంగా ఉందని, 13 శాతం మంది దాని ప్రభావం మారలేదని చెప్పారు.
10 మంది భారతీయుల్లో ఆరుగురు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని సానుకూల దృక్పథంతో చూశారని సర్వే వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా చూస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వే చేసిన వారిలో దాదాపు 34 శాతం మంది రాహుల్ గాంధీ పట్ల ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. 46 శాతం మంది పెద్దలు భారతదేశం పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే 34 శాతం మంది మధ్యస్థులు ప్రతికూల అభిప్రాయాలను కలిగి ఉన్నారు.
Also Read: Blue Moon: ఆకాశంలో అరుదైన ఘటన, సూపర్ బ్లూ మూన్‌గా చందమామ
ఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ కు ముందు ఈ సర్వే ఫలితాలు వచ్చాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 9-10 వ తేదీల్లో G 20 సదస్సు (G 20 Summit) జరగనుంది. మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ సదస్సుని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంది. పలు దేశాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అందుకే...భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ విధించనున్నారు. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుందీ ఈ సమ్మిట్. ఈ రెండు, మూడు రోజుల పాటు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకుండా పూర్తిగా లాక్‌డౌన్ పెట్టారు. అంతే కాదు. పోలీసులు పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. ఆ రెండు రోజుల పాటు వ్యాపారాలూ బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ ఆయన రావడం లేదని తెలుస్తోంది. ఢిల్లీ, NCR ప్రాంతాల్లోని హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్స్‌తో బిజీగా ఉన్నాయి. ITC Maurya, తాజ్ ప్యాలెస్, ది ఇంపీరియల్ సహా పలు ఫైవ్ స్టార్ హోటళ్లలోని రూమ్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి.