మంత్రివర్గంలో 11 ఖాళీలు, దేశవ్యాప్త ఉద్యమాలు, పార్లమెంటులో బలం పెంచుకోవాల్సిన అవసరం వంటివి ప్రధాన కారణాలు. మంత్రుల పనితీరు, రానున్న ఎన్నికల వ్యూహం కూడా విస్తరణకు దారితీస్తున్నాయి.
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన! తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
దీపావళికి ముందే మోదీ 3.0 మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీకి చెందిన మంత్రులకు పదోన్నతులు వస్తాయా? జనసేనకు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందా? ఆశావహుల జాబితా, కేంద్ర రాజకీయ సమీకరణాలు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తమిళనాడు మంత్రి ఎల్. మురుగన్ ఆకస్మిక రాజీనామాతో చర్చ పెరిగింది. దీపావళికి ముందే మోదీ 3.0లో భారీ మార్పులు జరగొచ్చన్న ప్రచారం ఢిల్లీ రాజకీయాల్లో వేడి పెంచుతోంది. అక్టోబర్ 20వ తేదీ సమీపంలో విస్తరణ ఉండొచ్చని సూచనలందుతున్నాయి. ఈసారి మంత్రివర్గంలో ఎవరికి పదోన్నతి దక్కుతుంది? ఎవరి పదవికి ఎసరు పడుతుంది? తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుంది? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్టాపిక్!
విస్తరణ అనివార్యమా !!
రాజకీయ వాతావరణం చూస్తుంటే, విస్తరణ ఇప్పుడే అవసరమని చెప్తున్నాయి. మోదీ క్యాబినెట్లో పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దానికి తోడు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్యమాలు, నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగ సవరణ చేయడానికి పార్లమెంటులో అధికార పార్టీ బలం పెంచుకోవాల్సిన అవసరం, కొత్తగా చేరిన పార్టీలు—ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ ఒక బలమైన అవసరంగా కేంద్రం భావిస్తోంది. మంత్రుల పనితీరు, రానున్న ఎన్నికలు, వ్యూహం—ఇవన్నీ కేంద్ర క్యాబినెట్ విస్తరణకే దారి చూపుతున్నాయి.
మంత్రివర్గంలో మరో 11 మందికి అవకాశం ?
రాజ్యాంగం ప్రకారం ప్రధానితో సహా కేంద్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం వరకు ఉండొచ్చు. అంటే గరిష్ఠంగా 81 మందికి అవకాశముంది. ప్రస్తుతం 70 మంది మాత్రమే ఉన్నారు.. కాబట్టి ఈసారి మంత్రివర్గాన్ని గరిష్ఠ పరిమితికి దగ్గరగా తీసుకెళ్లే అవకాశముంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి నియామకం, పార్టీ బాధ్యతల్లోకి వెళ్లనున్న కొందరు మంత్రుల స్థానాల్లో కొత్తవారికి అవకాశం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం.. ఈ మూడు అంశాలు విస్తరణలో కీలకంగా మారే అవకాశముంది.
ఎవరి ఎసరు? ఆశావహులు ఎవరు?
హర్దీప్ సింగ్ పురి, బి.ఎల్. వర్మలకు రాజ్యసభ రీనామినేషన్ దక్కకపోవడంతో వారి భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌధరీ, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రా పార్టీ బాధ్యతలు చేపట్టడంతో.. వీరి మంత్రి పదవులపై నిర్ణయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. పంజాబ్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టమని మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ కి పార్టీ ఇప్పటికే ఆదేశాలిచ్చింది కాబట్టి ఆయన్నూ మంత్రి వర్గంనుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు కీలక శాఖల్లో మార్పులూ ఉండొచ్చని సమాచారం. ఆర్ధిక శాఖామంత్రి నర్మళా సీతారామన్ ను విద్యాశాఖకు బదిలీ చేసి, ఆమే స్దానంలో మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ను నియమించవచ్చన చర్చ ఢిల్లీలో సాగుతోంది. శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండేకు కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చన్న ప్రచారం ఉంది., మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఏ పేరుకూ ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేదు.
కూటమి పార్టీలకు పెద్దపీట..
ఇటీవల కేంద్రం అనేక వ్యతిరేక ఉద్యమాలను ఎదుర్కొంటున్న తరుణంలో మిత్రపక్షాల బందం మరింత మొరుగు పరుచుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే TMC, Shiv sena, NCP పార్టీలో చీలికవర్గ ఎంపీలకు అవకాశం కల్పించవచ్చు. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి, జనసేనకు చెరో అదనపు మంత్రి పదవి దక్కవచ్చని చర్చ. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్కు కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారా చూడాలి.
తెలంగాణకు ఓ మార్పు, మరొకరికి చోటు?
తెలంగాణ బీజేపీకి ఈ విస్తరణ రాజకీయంగా అత్యంత కీలకం కానుంది. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ తన బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో.. మరో ఇద్దరు నేతలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చన్న ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి జి. కిషన్రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. వీరితో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, గోడం నగేశ్, డి.కె. అరుణ, కె. లక్ష్మణ్ పేర్లు చర్చలో ఉన్నాయి.
అయితే ఎవరికి అవకాశం దక్కుతుందనేది సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీ ఎన్నికల వ్యూహంపై ఆధారపడి ఉండొచ్చు. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గోడం నగేశ్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. కిషన్రెడ్డి శాఖ మారుతుందా? బండి సంజయ్ స్థానంలో మరొకరికి అవకాశం వస్తే మాత్రం దాని ఆధారంగా తెలంగాణలో బీజీపీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని అంచనా వేయవచ్చు.
TDPకి పదోన్నతి? జనసేనకూ చోటు?
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ప్రధానంగా ఎన్డీయే కూటమి సమీకరణాల చుట్టూ తిరిగే అవకాశముంది. ప్రస్తుతం టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ఉన్నారు. బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. మోడీ - చంద్రబాబుల బందం మెరుగుపరచుకునే క్రమంలో TDPకి అదనంగా మరో సహాయ మంత్రి పదవి దక్కే అవకాశముందని తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు శాఖ మారవచ్చని ప్రచారం సాగుతోంది. ఇక జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందా? మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం వస్తుందా? అన్నది మరో కీలక ప్రశ్న. అయితే ఈ అంశాలపై కూడా అధికారిక స్పష్టత లేదు.
2029 లక్ష్యంగా మోదీ టీమ్!
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు కీలకమైన టీడీపీ వంటి మిత్రపక్షాలను సంతృప్తిపరచడం ఒకవైపు.. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడం మరోవైపు.. మోదీ నాయకత్వానికి రెండు వేర్వేరు రాజకీయ అవసరాలు.
మొత్తంగా.. ఈ విస్తరణ జరిగితే అది కేవలం శాఖల మార్పు కాదు. ఎన్నికల వ్యూహం, కూటమి బంధాలు, సామాజిక సమీకరణాలకు అద్దం పట్టే నిర్ణయం కానుంది.
Frequently Asked Questions
కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరుగుతోంది?
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండవచ్చని అంచనా?
దీపావళికి ముందే, అక్టోబర్ 20వ తేదీ సమీపంలో మోదీ 3.0లో మార్పులు జరగవచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడు మంత్రి మురుగన్ రాజీనామాతో దీనికి ఊపొచ్చింది.
ఈ విస్తరణలో ఎంతమందికి కొత్తగా అవకాశం లభించవచ్చు?
రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా 81 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం 70 మంది ఉన్నారు కాబట్టి, మరో 11 మందికి పైగా కొత్తవారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాలపై మంత్రివర్గ విస్తరణ ప్రభావం ఏమిటి?
తెలంగాణ నుంచి మరో ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీకి అదనపు సహాయ మంత్రి పదవి, జనసేనకు చోటు దక్కవచ్చని ప్రచారం ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















