Lokesh Unstoppable : అమ్మాయిలతో ఫోటోలు, ఎన్నికల్లో ఓటమిపై మామకు లోకేష్ ఇచ్చిన ఆన్సర్ ఏమిటో తెలుసా ?
అన్‌స్టాపబుల్ షోలో స్విమ్మింగ్‌పూల్‌లో అమ్మాయిలతో ఉన్న ఫోటోపై లోకేష్ స్పందించారు. ఆయనేం చెప్పారంటే ?
Lokesh Unstoppable : ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబుతో పాటు మధ్యలో లోకేష్ కూడా ఇంటర్యూలో జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా లోకేష్‌ను కూడా బాలకృష్ణ పలు ప్రశ్నలు వేశారు. అందులో వ్యక్తిగత అంశాలతో పాటు రాజకీయాలు కూడా ఉన్నాయి. ప్రోమోలో ముందుగానే చూపించిన... స్విమ్మింగ్‌ఫూల్‌లో అమ్మాయిలతో ఫోటోల గురించి బాలకృష్ణ ఓపెన్ గానే అడిగారు. నిజానికి అలాంటి ఫోటోలే కాదు..వీడియోలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ ఓ పార్టీ చేసుకుంటున్నట్లుగానే ఉన్నాయి. కానీ లోకేష్ రాజకీయ ప్రత్యర్తులు వాటిని చూపించి అదే పనిగా ఆయనపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఆ ఫోటోలను చూపించి లోకేష్‌ను ప్రశ్నించడంతో లోకేష్ ఏం చెప్పారా అన్న ఆసక్తి అందరిలో ప్రారంభమయింది. బాలకృష్ణ లోకేష్‌కు పిల్లనిచ్చిన మామ. అందుకే లోకేష్ ఏం చెప్పారా అని ఆసక్తిగా చూశారు.
ఆ విదేశీయులంతా తనకు,, బ్రహ్మణికి కామన్ ఫ్రెండ్సన్న లోకేష్
ఈ ఫోటోల విషయంలో లోకేష్ తాను దాచుకోవాల్సింది ఏమీ లేదని పూర్తి క్లారిటీగా చెప్పారు. 1996లో తాను విదేశాల్లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మిత్రులతో కలిసి పార్టీ చేసుకుంటున్నప్పటి ఫోటోలన్నారు. అందులో అభ్యంతరకమైనది ఏమీ లేదని స్పష్టం చేశారు. అందులో ఉన్న అమ్మాయిలు కూడా బాలకృష్ణ కుమార్తె, తన భార్య అయిన బ్రహ్మణి మిత్రులేనని .. వారంతా కామన్ ఫ్రెండ్సెనని లోకేష్ స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే వారంతా తనతో కంటే.. బ్రహ్మణికే ఎక్కువ మిత్రులన్నారు. ఈ ఫోటోల గురించి తరచూ రాజకీయం అవుతూ ఉంటుంది. లోకేష్ ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. కానీ మొదటి సారి మామ బాలకృష్ణ ఫోటోలు చూపించి మరీ అడిగారు.. మొత్తం చెప్పేశారు. స్నేహితులతో సరదగా ఫోటోలు దిగితే తప్పేంటి - కావాలంటే ఆ ఫోటోలు ఫ్రేమ్ కట్టి ఇస్తానని చెప్పానని కూడా సెటైర్ వేశారు.
టీడీపీ ఎప్పుడూ గెలవని చోట పోటీ చేశా... ఈ సారి గెలిచేందుకు కష్టపడుతున్నా !
మరో వైపు రాజకీయాలపైనా బాలకృష్ణ కొన్ని ప్రశ్నలను లోకేష్‌కు వేశారు. మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయడం.. ఓడిపోవడంపై ప్రశ్నించారు. దీనికి లోకేష్ క్లుప్తంగా వివరణ ఇచ్చారు. తెలుగుదేశం గత రెండు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ గెలవని చోట పోటీ చేయడానికి ముందుకు వచ్చానన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. రాజకీయాల్లో ఎక్కువగా చూసుకునే సామాజిక సమీకరణాలు కూడా అనుకూలంగా లేవు. అయినప్పటికీ లోకేష్ అక్కడ పోటీ చేశారు. చివరి క్షణంలో మంగళగిరిలో పోటీకి సిద్ధమయ్యానని.. తన గురించి అక్కడి ప్రజలకు చెప్పుకోవడానికి సమయం సరిపోలేదన్నారు. అయితే ఓటిపోయినప్పటికీ ఈ సారి తన గురించి అక్కడి ఓటర్లకు చెప్పుకునేందుకు.. అక్కడి ప్రజల మనసుల్ని గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ... కష్టపడి పని చేస్తున్నానన్నారు.
ఆకట్టుకుంటున్న ఇంటర్యూ
వ్యక్తిగ, రాజకీయ అంశాలపై మామ బాలకృష్ణ ప్రశ్నలకు లోకేష్ ఉత్సాహంగా స్పందించారు. ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. స్విమ్మింగ్ ఫూల్ ఫోటోలపై పిల్లనిచ్చిన మామ ప్రశ్నిస్తే కాస్త తడబడతారు.. కానీ తాను తప్పేం చేయలేదు కాబట్టి తడబడాల్సిన.. నీళ్లు నమలాల్సిన అవసరం లేదని లోకేష్ భావించారు. సూటిగానే సమాధానం చెప్పారు. ఇక ఈ అంశంపై రాజకీయ విమర్శలు ఆగిపోతాయేమో చూడాలి!