Lokesh Padayatra : లోకేష్ పాదయాత్ర చేసినా సీఎం అయ్యేది చంద్రబాబే - మరి ఇచ్చే హామీలకు విలువ ఎంత?
లోకేష్ పాదయాత్ర సీఎం అయ్యేందుకు కాదు. మరి హామీలు ఎలా ఇస్తున్నారు?
Lokesh Padayatra : తెలుగుదేశం పార్టీలో పాదయాత్ర జోష్ కనిపిస్తోంది. నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. నాలుగు వందల రోజుల పాటు సుదీర్ఘంగా పాదయాత్ర సాగనుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఈ పాదయాత్ర కోసం కష్టపడుతున్నారు. మరో మాట రానీయకుండా అంతా లోకేష్ వెంట నడుస్తున్నారు. పని విభజన చేసుకుని పాదయాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పని చేస్తున్నారు. సోషల్ మీడియాను గరిష్టంగా వాడుకుంటున్నారు. అయితే ఇంత చేసినా లోకేష్ సీఎం అభ్యర్థి కాదు... పార్టీ నేత ..ఇంకా చెప్పాలంటే వారసుడు మాత్రమే. మరి ఈ పాదయాత్రలో నారా లోకేష్ చెప్పేవి ప్రజలకు నమ్మశక్యంగా ఉంటాయా ? ఇచ్చే హామీలు భరోసా నిస్తాయా ? లోకేష్ చెప్పే ధైర్యం.. నిజంగా ఊరటనిస్తుందా ?
లోకేష్ పాదయాత్ర చేసినా సీఎం అయ్యేది చంద్రబాబే !
సాధారణంగా పాదయాత్రలు చేయాలనుకునేవారు అగ్రనేతలవుతారు. అంటే ఎన్నికల్లో గెలిస్తే తామే ముఖ్యమంత్రి అన్న వారు మాత్రమే పాదయాత్రలు చేస్తున్నారు. అప్పట్లో వైఎస్ ముఖ్యమంత్రి కాకపోయినా పార్టీలో కీలక నేతగా ఉన్నారు. పాదయాత్రతో వచ్చిన ఇమేజ్ తో ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యారు. పార్టీ గెలవగానే సీఎం అయ్యారు. తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేశారు. సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. సీఎం అయ్యారు. వీరంతా పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు.. భరోసా కల్పించబట్టే ప్రజలు ఓట్లేశారు. మరి లోకేష్ టార్గెట్ సీఎం కావడం కాదు. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేయడం. మరి లోకేష్ ఇచ్చే హామీలను ప్రజలెంత వరకూ నమ్మగలరు ?
ప్రజాసమస్యలు - బాధితలకు భరోసా ఇచ్చేలా పాదయాత్ర ప్లాన్
తొలి రోజు పాదయాత్రలో లోకేష్ రాజకీయ పరంగా ఆవేశపడలేదు. ఆయన ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటకు వచ్చేలా చేసి.. ఆ సమస్యలను తాము పరిష్కరించగలమని భరోసా ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే.. ఎక్కడా ఆవేశపడలేదు. ఘాటు వ్యాఖ్యలు చేయలేదు.కానీ ప్రతీ వర్గం సమస్యను ప్రస్తావించి పరిష్కరించే మార్గం తమ దగ్గర ఉందని చెప్పుకున్నారు. లోకేష్ ప్రసంగం.. ఆయనను విమర్శిస్తున్న మంత్రులకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఉంటుందని అనుకున్నారు కానీ.. పూర్తిగా ప్రజా రాజకీయ కోణంలోనే జరగింది. రాజకీయంగా సోషల్ మీడియాకు స్టఫ్ ఇవ్వడం కన్నా.. ప్రజల్లో సమస్యలపై చర్చ పెడితే బెటరని అనుకున్నారు. ఆ దిశగానే ఆయన ప్రసంగం సాగింది.
లోకేష్ వెంట నడుస్తున్న టీడీపీ
మామూలుగా అగ్రనేత పాదయాత్ర చేస్తేనే పార్టీ మొత్తం కదులుతుంది. కానీ ఇక్కడ లోకేష్ పాదయాత్ర చేసినా.. మొత్తం పార్టీ యంత్రాంగం కదిలింది. అయితే టీడీపీ గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారు. కానీ పాదయాత్ర వల్లే టీడీపీ గెలిచిందని పేరు వస్తే మాత్రం... లోకేష్ ఇమేజ్ .. తర్వాతైనా సీఎం పదవికి పోటీ పడే స్థాయికి వస్తుంది. అందుకే.. వైఎస్ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ... లోకేష్ ను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కేటగిరీలో చేర్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పవనా.. చంద్రబాబా.. లోకేషా అని ఆయన ప్రశ్నించారు. ఆయన అలా ప్రశ్నించడానికి రాజకీయ వ్యూహం ఉండవచ్చు కానీ ..లోకేష్ నిరంతరాయంగా సాగించే పాదయాత్ర విషయంలో కొంత మందికి ఈ డౌట్ వస్తుంది. దీనికి లోకేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను ఏ హోదాతో పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని.. ఈ మూడున్నరేళ్లలో హోదాలు అనుభవించిన వాళ్లు చేసిందేమిటని ప్రశ్నించారు. అయితే ఇది ఎదురుదాడే అవుతుంది.
నాయకత్వ సామర్థ్యాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారా ?
ముందు ముందు లోకేష్ తన నాయకత్వ సామర్థ్యాన్ని పాదయాత్ర ద్వారా నిరూపించుకుంటే.. ఆయన భవిష్యత్‌లో సీఎం అభ్యర్థి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చాలా మంది సీఎం అభ్యర్థి అయ్యాక పాదయాత్రలు చేశారు... లోకేష్ మాత్రం పాదయాత్ర ద్వారా సామర్థ్యం నిరూపించుకుని.. ఆ స్థాయి నేత అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు