Vanama : వనమాకు సుప్రీంకోర్టులో ఊరట - అనర్హతపై స్టే !
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై అనర్హతా వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
Vanama : సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటరావుకు ఊరట లభించింది. అనర్హత కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాలకు కేసు వాయిదా వేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావు 2019లో హైకోర్టుకు వెళ్లారు. దీనిపై మూడేండ్లుగా వాదనలు జరిగాయి. జులై 25న కోర్టు తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నిక చెల్లదని, ఆయనపై అనర్హత వేటు వేయడంతోపాటు 5 లక్షల జరిమానా విధించింది. తీర్పు అమలును నిలిపివేసేందుకు నిరాకరించడంతో వనమా మాజీ ఎమ్మెల్యే అయినట్లుగానే భావించారు. అయితే ..ఈ వివాదంలో ప్రభుత్వం తీర్పును వెంటనే అమలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే జలగం వెంకట్రావు తనను ఎమ్మెల్యేలగా గుర్తించాలని.. ప్రమాణస్వీకారం చేయించాలని అధికారులను , బీఆర్ఎస్ పెద్దలను కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదని మంగళవారం హైకోర్టు ఇచ్చిన 84 పేజీల తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి కూడా అందజేశారు. స్పీకర్‌కు ఫోన్‌లో విషయం చెప్పారు. అయితే ఆయననుకలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తె్చచుకున్నారు.
వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు ఇద్దరూ బీఆర్ఎస్‌కు చెందిన వారే కావడంతో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున గెలిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పట్నుంచి అక్కడ జలగం వెంకట్రావుకు ప్రాధాన్యత తగ్గింది. దీనిపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీఈ తీర్పు వచ్చిన తర్వతా తాను పార్టీకి విధేయుడినేనని చెబుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేసి ఉన్నట్లయితే.. వనమా మాజీ అయ్యేవారు. జలగం వెంకట్రావు మూడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవారు. అయితే వివాదం కారణంగా ఇద్దరూ హాజరు కాలేదు. ఇంతా చేసి ఎమ్మెల్యే పదవి కాలం మూడు నెలలే ఉంది.
వనమా అఫిడవిట్‌లో చెప్పని వివరాలు ఇవే
పాల్వంచ మండల వ్యవసాయ అధికారి ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం పాల్వంచలోని సర్వే నంబర్ 122/2/సంస్తాన్ 1 ఎకరం 33 గుంటలకు వనమా రైతుబంధు నిధులు తీసుకున్నట్లు వెల్లడించారు. సదరు భూమికి 2018 నుంచి 2021 వరకు దాదాపు ఎనిమిదిసార్లు మొత్తం రూ.69,350 తీసుకున్నట్లు ఆధారాలతో నిరూపితమైంది. ఆయన భార్య పేరు మీద పాల్వంచలో సర్వే నంబర్ 992లో 8.37 ఎకరాల విషయంలో సైతం ఆధారాలు స్పష్టంగా ఉన్నట్లు హైకోర్టు పేర్కొంది. తప్పుడు వివరాలు వెల్లడించడంతోపాటు ఆస్తుల వివరాలు దాచిపెట్టినట్లు ఆధారాలతో సహా వెల్లడి కావడంతో వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తుది తీర్పు ఇచ్చింది. 2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణించాలని స్పష్టం చేసింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసినందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇప్పటివరకు ఈ కేసు కోసం జలగం వెంకట్రావుకు అయిన మొత్తం ఖర్చును సైతం చెల్లించాలని వనమాకు ఆదేశాలు జారీచేసింది.