Konda Surekha BJP Join Rumors: కొండా కుటుంబం చేరేది బీజేపీ తీరానికేనా ? - ప్లాన్ బి వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Revanth Reddy Konda Family Row: కొండా కుటుంబం ప్లాన్ బీ అమలు చేస్తోంది. హైకమాండ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

Konda Sushmitha Congress Controversy: తెలంగాణ రాజకీయంలో దశాబ్దాలుగా తమకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న కొండా సురేఖ - మురళి దంపతుల రాజకీయ ప్రస్థానం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ అధిష్ఠానానికి, స్థానిక ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. సొంత పార్టీలోనే సొంత సహచరులు కొండాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటంతో, వారి కాంగ్రెస్ ప్రయాణం దాదాపు క్లైమాక్స్‌కు చేరిందనే చర్చ జోరందుకుంది.
బీఆర్ఎస్ పార్టీ వైపు చూసే చాన్స్ లేనట్లే !
గతంలో బీఆర్ఎస్ శ్రేణులతో తీవ్రస్థాయిలో శత్రుత్వం పెంచుకుని ఆ పార్టీని వీడి రావడం, కెటిఆర్ , బిఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో తిరిగి కేసీఆర్ గూటికి వెళ్లే తలుపులు పూర్తిగా మూసుకుపోయాయి. ఇక మిగిలిన ఒకే ఒక ప్రధాన జాతీయ ప్రత్యామ్నాయం బీజేపీ . ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, సొంత కేడర్ ఉన్న కొండా దంపతులకు ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో బీజేపీ వైపు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌లో విమర్శల సెగ, బీఆర్‌ఎస్‌తో మూసుకుపోయిన తలుపులు.. ఇప్పుడు కొండా దంపతులకు మిగిలిన ఒకే ఒక ప్రధాన ద్వారం బీజేపీ! అయితే క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చే కమలం పార్టీలో వీరి దూకుడు నైజంతో ఉండగలరా అన్నది కూడా అప్పుడే అందరికీ వస్తున్న సందేహం.
బలమైన బీసీ నాయకత్వం కోసం చూస్తున్న బీజేపీ
మరోవైపు తెలంగాణలో బలమైన బీసీ నాయకత్వం కోసం శోధిస్తున్న బీజేపీకి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టున్న బిసి నేతలు అవసరం ఎంతైనా ఉంది. బలమైన బీసీ సామాజిక వర్గాలకు చెందిన కొండా జంటను చేర్చుకోవడం ద్వారా వరంగల్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయవచ్చని బీజేపీ భావించే అవకాశం ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే, ముందస్తుగా కుమార్తె సుస్మితను బీజేపీలోకి పంపి, ఆ తర్వాత శాసనసభ ఎన్నికల సమయానికి సురేఖ-మురళి దంపతులు నేరుగా కమలం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీజేపీలో అయినా కొండా దంపతుల రాజకీయం మారదు!
అయితే, అసలు సమస్యల్లా కొండా దంపతుల ఫైర్‌బ్రాండ్ పొలిటికల్ స్టైల్. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ, ప్రజాస్వామ్య వాతావరణం ఉన్న పార్టీలలో వారు చూపించిన స్వతంత్ర వైఖరి, దూకుడు రాజకీయం బీజేపీ కల్చర్‌కు పూర్తిగా భిన్నమైనవి. బీజేపీ అనేది కేంద్ర నాయకత్వం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, ఖచ్చితమైన పార్టీ క్రమశిక్షణ ఆధారంగా నడిచే సంస్థ. పార్టీ గీత దాటి మాట్లాడితే ఎంతటి నేతలనైనా పక్కన పెట్టే నైజం బీజేపీది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సొంత సీఎంపైనే తిరుగుబాటు బావుటా ఎగరేసినట్లుగా ముద్రపడిన కొండా దంపతులు, బీజేపీలోని విధివిధానాలకు అలవాటు పడి ఇమడగలరా అన్నది పెద్ద ప్రశ్నార్థకం. వరంగల్ జిల్లా బీజేపీలో ఇప్పటికే ఉన్న స్థానిక నేతలతో కొండా దంపతులకు ఆధిపత్య పోరు తప్పకపోవచ్చు. ఏది ఏమైనా, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీ లోకి అడుగుపెట్టడం ఒక ఎత్తయితే, అక్కడి కట్టుబాట్లను తట్టుకుని నిలబడటం కొండా దంపతులకు అతిపెద్ద సవాలుగా మారనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















