Revant Vs Komatireddy : నల్లగొండ జిల్లాలో రేవంత్ పర్యటన వద్దంటున్న ఉత్తం , కోమటిరెడ్డి ? కాంగ్రెస్‌లో సమసిపోని ఆధిపత్య పోరాటం !
కాంగ్రెస్‌లో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి పోరు ఇంకా ముగిసినట్లుగా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. నల్లగొండ జిల్లాలో రేవంత్ పర్యటన వద్దని కోమటిరెడ్డి వర్గం అంటూండటమే దీనికి కారణం.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు అన్నీ సద్దుమణిగి పోలేదని.. అంతర్గతంగా ఇంకా నడుస్తూనే ఉన్నాయని అప్పుడప్పుడూ కొన్ని ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్త నేతల జాబితాలో చేరారు. చాలా రోజుల పాటు తీవ్రమైన విమర్శలు చేశారు. ఇటీవల రాహుల్ గాంధీతో భేటీ తర్వాత అంతా సర్దుకున్నట్లుగా ప్రకటనలు చేశారు. రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని ప్రకటించారు. అయితే ఇరువురి మధ్య వివాదాలుపైకే ముగిశాయని అంతర్గతంగా ఇంకా కొనసాగుతున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేసేందుకు జిల్లాల వారీగా రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో పార్టీ నేతలతో ఇలాంటి సమీక్షలు నిర్వహించారు. తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహించాల్సి ఉంది. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనను ఎంపీలు ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారి వర్గీయులు చౌటుప్పల్ మండలం, ఆందోల్ మైసమ్మ టెంపుల్ దగ్గర ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం లేదని.. కోమటిరెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలో తామే రాహుల్ సభకు భారీగా తరలి వస్తామని వారు చెబుతున్నారు.
అయితే రేవంత్ రెడ్డి వర్గం నేతలుగా పేరు పడిన అద్దంకి దయాకర్ మరికొంత మంది నేతలు మాత్రం రేవంత్ రెడ్డి పర్యటన జరిగి తీరుతుందంటున్నారు. రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన చేసి తీరుతారని అంటున్నారు. వారు కూడా రహస్యంగా భేటీ అయి.. తమ కార్యాచరణపై చర్చించారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎక్కడైనా తిరగవచ్చుని చెబుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి దళిత - గిరిజన దండోరా సభలను కూడా తన నియోజవకర్గ పరిధిలో ఏర్పాటు చేసేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగీకరించలేదు. చివరి క్షణంలో రేవంత్ సభా వేదికను మార్చాల్సి వచ్చింది. అయితే అప్పట్లో కోమటిరెడ్డి అసంతృప్త నేతగా ఉన్నారు.
ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చింది. దాంతో తాను రాష్ట్రం మొత్తం తిరుగుతానని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రయత్నిస్తానని అంటున్నారు. ఆయనకు అలా తిరిగే హక్కు ఉందని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పార్టీ సమీక్ష పెడతానంటే వద్దంటున్నారని... ఇదేం రాజకీయం అని కాంగ్రెస్‌లోని మరో వర్గం ప్రశ్నిస్తోంది. అయితే ఇలాంటివన్నీ రోడ్డు మీదకు రాకుండా అంతర్గతంగా చూసుకుంటే చాలని ఇతర నేతలు అనుకుంటున్నారు.